కరెంటు షాక్ తప్పదా?

జగన్మోహనరెడ్డి ప్రభుత్వం విద్యుత్తు చార్జీలను పెంచకుండా అయిదేళ్లపాటూ ప్రజల మీద భారం వేయకుండా ఉండడానికే ప్రాధాన్యం ఇస్తోందని ఆ పార్టీ నాయకులు, వ్యూహకర్తలు పదేపదే, వేర్వేరు వేదికలపై చెబుతూ వస్తున్నారు. అయితే డిస్కంలు ఇప్పుడు…

జగన్మోహనరెడ్డి ప్రభుత్వం విద్యుత్తు చార్జీలను పెంచకుండా అయిదేళ్లపాటూ ప్రజల మీద భారం వేయకుండా ఉండడానికే ప్రాధాన్యం ఇస్తోందని ఆ పార్టీ నాయకులు, వ్యూహకర్తలు పదేపదే, వేర్వేరు వేదికలపై చెబుతూ వస్తున్నారు. అయితే డిస్కంలు ఇప్పుడు కొత్త వ్యూహం అనుసరిస్తున్నట్లున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్తు చార్జీలను పెంచక తప్పని పరిస్థితిని, ఒత్తిడిని ప్రభుత్వం మీద కల్పిస్తున్నాయి. ఈ పితలాటకాన్ని జగన్ సర్కారు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు డిస్కంలకు 20 వేల కోట్ల రూపాయల అప్పు ఉంది. గత మూడేళ్లలో మరో 8వేల కోట్ల రూపాయల అప్పు పెరిగినట్లుగా డిస్కం లెక్కలు చెబుతోంది. అంటే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం మీద 28వేల కోట్ల రూపాయల రుణభారం ఉంది. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకోవాలంటే.. విద్యుత్తు చార్జీలను పెంచడం ఒక్కటే మార్గం ఉన్నట్లుగా డిస్కంలు ప్రతిపాదిస్తున్నాయి. ఈ మేరకు ఏపీఈఆర్‌సీని డిస్కంలు కోరుతున్నాయి.

రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడి మీద ప్రభావం చూపించే విద్యుత్తు చార్జీల విషయంలో జగన్ సర్కారు చాలా కృతనిశ్చయంతో ఉంది. ఈ విషయంలో ఎలాంటి అదనపు భారం పెంచకుండా జాగ్రత్త తీసుకోవాలని అనుకుంటోంది. కేవలం విద్యుత్తు భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతోనే జగన్మోహన రెడ్డి విద్యుత్తు పీపీఏలను సమీక్షించే ప్రయత్నానికి కూడా పూనుకున్నారు. విపక్షాలు గోల చేస్తున్నా.. తగ్గడంలేదు. ఇప్పుడు డిస్కంలు చేస్తున్న చార్జీల పెంపు ప్రతిపాదనలను వచ్చే ఏడాది జనవరిలో సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే కొత్త ఏడాది కానుకగా ప్రజల మీద విద్యుత్తు భారం మోపకుండా ఉండాలంటే.. ఈలోగానే పీపీఏలను సమీక్షించి విద్యుత్తు కొనే ధరలనే సవరించాల్సి ఉంటుంది. అంటే.. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం పీపీఏల సమీక్షను ఈ ఏడాదిలోగానే పూర్తిచేయాలి. డిస్కంలకు అప్పులు పేరుకుపోతున్న తరుణంలో, జగన్ కొత్తగా గిరిజన తండాలకు  కూడా ప్రకటించిన ఉచిత విద్యుత్తు కూడా అమలు కావాలంటే.. గట్టి నిర్ణయాలు తప్పనిసరి అవుతాయి.

జగన్ వైఎస్సార్ పాలనలోలాగానే.. తన పాలన అయిదేళ్లలో విద్యుత్తు చార్జీలు ఒక్కసారి కూడా పెంచకుండా ప్రజల హృదయాలు గెలుచుకోవాలని అనుకుంటున్నారు. మరి.. డిస్కంలు ప్రతిపాదిస్తున్న గండం నుంచి ఎలా గట్టెక్కుతారో చూడాలి.

జగన్ మేనమామపై అసంతృప్తి జ్వాలలు!