Advertisement

Advertisement


Home > Politics - Gossip

నాన్నకు ప్రేమతో.. : కొనసాగించనున్న జగన్!

నాన్నకు ప్రేమతో.. : కొనసాగించనున్న జగన్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తండ్రి వారసత్వాన్ని పదవిలో అందింపుచ్చుకున్నారు. అయితే ఆయన ఆశయాల్ని, ఆయన తన జీవితంలో పెండింగ్‌గా ఉంచిన పనిని కూడా కొనసాగించే ఉద్దేశంతో ఉన్నారు. రాష్ట్రంలో తిరుగులేని ప్రజాదరణ దక్కించుకున్న నాయకుడిగా గుర్తింపు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి... ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని తాను సంకల్పించి, ప్రారంభించకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని వైఎస్ జగన్ తిరిగి ప్రారంభించబోతున్నారు. వైఎస్సార్ కన్నుమూసిన సెప్టెంబరు 2వ తేదీనే తిరిగి ఆయన ఆశయానికి ప్రాణం పోయబోతున్నారు.

2009లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైఎస్సార్ కొత్త కొత్త ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు. వాటిలో రచ్చబండ కార్యక్రమం కూడా ఒకటి. ప్రజల కష్టాలను పరిమార్చే దిశగా అది ఒక పెద్ద ముందడుగు. ఆ కార్యక్రమాన్ని చిత్తూరుజిల్లా పీలేరు నియోజకవర్గం అనుప్పల్లెనుంచి అప్పట్లో ప్రారంభించాలని సంకల్పించారు. ఒకవైపు వర్షం వస్తున్నా.. చేయాలనుకున్న పనిని చేసి తీరాలనే ఉద్దేశంతో.. వైఎస్సార్ ఆరోజు హెలికాప్టర్ ప్రయాణానికి వెనుదీయకుండా బయల్దేరారు. ప్రకృతి బీభత్సంగా ఉన్న నేపథ్యంలో, ప్రమాదం ఆయనను కబళించింది.

ఇప్పుడు ఆయన కొడుకు జగన్ సీఎం అయ్యారు. తన తండ్రి జీవితంలో ఏ పనిగా వెళుతూ ఏ రోజైతే కన్ను మూశారో.. ఆ పనిని అదేరోజున ప్రారంభించబోతున్నారు. సెప్టెంబరు 2నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్ వర్ధంతి అయిన ఆ రోజున, ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళి అర్పించిన అనంతరం సీఎం జగన్.. పీలేరు వద్ద గల అనుప్పల్లెలోంచే రచ్చబండను ప్రారంభిస్తారని సమాచారం.

వైఎస్సార్ మరణించిన తర్వాత.. నడిచిన కాంగ్రెస్ ప్రభుత్వాలు రచ్చబండ పేరుతో కార్యక్రమాన్నైతే నిర్వహించాయి. కానీ.. ప్రజల కష్టాలను తీర్చడంలో వైఎస్సార్ సంకల్పించిన స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయాయనే విమర్శ ఉంది. ఇప్పుడు అదే రోజున రచ్చబండను ప్రారంభించబోతున్న జగన్.. దీనిద్వారా.. ప్రజలకు మరింత చేరువ అవుతారేమో చూడాలి.

జగన్ మేనమామపై అసంతృప్తి జ్వాలలు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?