కేసీఆర్ మరీ అమానుషంగా ప్రవర్తిస్తున్నారా?

ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని ధిక్కరించి ఇవాళ సమ్మె చేస్తుండవచ్చు గాక. అంతకుమించిన ప్రజాందోళనలు కూడా చేస్తుండవచ్చు గాక.. అంతమాత్రాన దానిని వ్యక్తిగత వైరం లాగా ఎంచి, వారి మీద కక్ష సాధింపు తరహా ప్రతీకార…

ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని ధిక్కరించి ఇవాళ సమ్మె చేస్తుండవచ్చు గాక. అంతకుమించిన ప్రజాందోళనలు కూడా చేస్తుండవచ్చు గాక.. అంతమాత్రాన దానిని వ్యక్తిగత వైరం లాగా ఎంచి, వారి మీద కక్ష సాధింపు తరహా ప్రతీకార చర్యలకు దిగడం ప్రభుత్వానికి పాడి కాదు.

తమ డిమాండ్లు, పోరాటం విషయంలో కీలకమైన డిమాండును పక్కన పెట్టేసి.. ఆర్టీసీ కార్మికులు ఒక మెట్టు దిగారు. ప్రభుత్వం ఇంకా వారిపట్ల మునుపటి కఠిన వైఖరిని కొనసాగించడంలో అర్థం లేదు. వీరు కూడా ఒక మెట్టు దిగి వారిని చర్చలకు ఆహ్వానించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

ఆర్థిక భారంతో సంబంధంలేని 21డిమాండ్లపై చర్చించాలని గతంలో హైకోర్టు ఆదేశించినప్పుడు ప్రభుత్వం కాస్త తగ్గింది. ధాన్ని కూడా స్కిప్ చేయడానికి మార్గాన్వేషణ చేసి, చివరికి చర్చలకు పిలిచారు.

ఆ సమయంలో ఆర్టీసీ కార్మికులు కూడా మొండిగా వ్యవహరించి.. విలీనం సంగతి తేలితే తప్ప మిగిలిన అంశాలు చర్చించబోమని ప్రకటించడంతో.. చర్చలు ఆదిలోనే బెడిసికొట్టాయి. అప్పటినుంచి ప్రతిష్టంభన కొనసాగుతూ వచ్చింది. కోర్టు కూడా నిస్సహాయంగా చేతులెత్తేసింది.

ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు ఉధృతం కావడంతో.. కాస్త హింసాత్మకరూపు కూడా దాల్చాయి. మరోవైపు అశ్వత్థామరెడ్డి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.

ఆయన డిమాండు  మరీ చిన్నది. చర్చలకు పిలిచేదాకా దీక్ష చేస్తానని అంటున్నారు. ఇంకా చర్చలకు పిలిచేంతగా కూడా ప్రభుత్వం మెట్టు దిగకపోతే.. అది పనికిరాని మొండితనం అనిపించుకుంటుంది.

ఆర్టీసీ కార్మికులంతా కూడా తెలంగాణ సమాజపు ముద్దుబిడ్డలే అనే సత్యాన్ని గౌరవించి.. కేసీఆర్, ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించాలి. ప్రభుత్వానికి, సంస్థకు భారంగా మారకుండా ఉండేంతవరకు వారి డిమాండ్లను పరిష్కరించాలి.

తదనుగుణంగా మధ్యేమార్గంగా ఒక పరిష్కారాన్ని అన్వేషించాలి.. అంతే తప్ప.. ఇప్పటికీ మొండిగా ఉండడం మంచిది కాదని పలువురు అంటున్నారు.