మొన్నటివరకు ఈ రాష్ట్రంలో జగన్ పై పీకల వరకు కోపం కేవలం చంద్రబాబుకే ఉందని అనుకున్నాం. కానీ అంతకుమించిన కోపం, ఈర్ష్య చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కు ఉన్నాయనే విషయం ఇప్పుడిప్పుడే స్పష్టమౌతోంది.
ఇసుక పాలసీ, ఇంగ్లిష్ మీడియం విషయంలో జగన్ పై లేనిపోని విమర్శలు చేసి, అర్థంలేని వాదనల్ని తెరపైకి తీసుకొచ్చి అభాసుపాలైన పవన్ కు.. ఇప్పుడు సరైన టాపిక్ దొరక్కపోవడంతో అన్ని అంశాల్ని జగన్ కు ఆపాదిస్తూ విమర్శలు చేస్తున్నారు. దీంతో ప్రజల్లోనే కాదు, సొంత పార్టీలో కూడా పవన్ పలచనైపోతున్నారు.
ప్రస్తుతం జనసేనాని పరిస్థితి ఎలా ఉందంటే.. ఆయనకున్న డిప్రెషన్, ఈర్ష్య, అసూయ తగ్గడానికి ఆయన ఎవరైనా డాక్టర్ ను కలిస్తే బాగుంటుందేమో అంటూ ఆయన పార్టీ నేతలే ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటున్నారు. అంతలా జగన్ విషయంలో పవన్ పీక్స్ కు వెళ్లిపోయారు. తాజాగా పవన్ మాట్లాడిన మాటలు వింటే, ఆయనకు కచ్చితంగా డాక్టర్ అవసరం ఉందని ఎవరైనా ఒప్పుకొని తీరాలి.
ఈరోజు జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన పవన్, దిశా అత్యాచారం, హత్యకేసుపై స్పందించారు. చుట్టూ ఇంతమంది ఉన్నప్పటికీ అభద్రతాభావంలో బతుకుతున్నామని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత పవన్ మాట్లాడిన మాటలు మాత్రం అతడి మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. సమాజంలో మహిళలకు రక్షణ కల్పించలేనప్పుడు 151 సీట్లు గెలిచి ఏం లాభం అని ఆవేశంగా ప్రశ్నించారు పవన్.
దిశా హత్య జరిగింది తెలంగాణలో. నిందిస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిందించాలి. కానీ కేసీఆర్ ను విమర్శించేంత గుండెధైర్యం, ఖలేజా పవన్ కు లేవనే విషయం అందరికీ తెలిసిందే కదా. అందుకే తెలంగాణలో జరిగిన హత్యకు, జగన్ సాధించిన 151 సీట్లకు ముడిపెట్టి విమర్శలు చేశారు. పవన్ ఒక్కసారిగా అలా అనేసరికి, అసలు ఈ రెండు అంశాలకు లింక్ ఎక్కడ కుదిరిందో అర్థంకాక జనసైనికులు తలగోక్కున్నారు.
నిజంగా పవన్ కు దమ్ముంటే దిశా హత్యకేసులో కేసీఆర్ ను నిందించాలి. లేదంటే ఎఫ్ఐఆర్ విషయంలో అలసత్వం చూపించిన పోలీసుల్ని అనాలి. మరీ అంతగా చలించిపోతే తనే రంగంలోకి దిగి ఏదో ఒక నిరసన కార్యక్రమం చేపట్టాల్సింది. ఇలా చేయడం పవన్ కు చేతకాదు. ఈ ఘటనకు, జగన్ కు సంబంధం లేకపోయినా అవాకులు, చవాకులు పేలడం మాత్రం పవన్ కు తెలుసు.
అంతెందుకు.. నిన్నటికినిన్న ఓ మహిళ వచ్చి పవన్ ముందు తన గోడు వెళ్లబోసుకుంది. 2017లో ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో తన కూతురిని అత్యాచారం చేశారని, తనకు న్యాయం చేయమని పవన్ ను అభ్యర్థించిందామె. ఈ కేసును జగన్ ఎందుకు తొక్కిపెడుతున్నారు? అత్యాచారం చేసిన వాళ్లను ఎందుకు రక్షిస్తున్నారంటూ పవన్ వీరావేశంతో స్టేట్ మెంట్స్ ఇచ్చారు. ఆ టైమ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్ కాదు, చంద్రబాబు అనే విచక్షణ కూడా లేకుండా మాట్లాడారు పవన్.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈమధ్య కాలంలో పవన్ ఇలాంటి ఎన్నో తప్పుడు వ్యాఖ్యలు చేశారు. చూస్తుంటే పవన్ కు ఏదో మానసిక సమస్య ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. అతడి పార్టీ నేతలు, కార్యకర్తలు అంటున్నట్టు… పవన్ ఓసారి డాక్టర్ కు చూపించుకుంటే మంచిదేమో. డిప్రెషన్, జగన్ పై ఈర్ష్య తగ్గడానికి ఏమైనా మందులు వాడితే బెటరేమో.