Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్ చాలా చెప్పారు.. వారు చేసేదెన్ని?

జగన్ చాలా చెప్పారు.. వారు చేసేదెన్ని?

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి తన పార్టీకి చెందిన ఎంపీలతో సమావేశం పెట్టుకున్నారు. పార్లముంటులో ఎలా వ్యవహరించాలి? ఏ అంశాలను లేవనెత్తాలి? వేటికోసం పోరాడాలి? అనే అంశాల్లో దిశానిర్దేశం చేసేందుకు ప్రయత్నించారు.

భారత పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పాటీ వైకాపానే. అలాంటి నేపథ్యంలో.. వారి డిమాండ్లకు బలం ఉంటుందని అనుకోవడం సహజం. ఆ ఉద్దేశంతోనే.. జగన్ తమ పార్టీ ఎంపీలకు చాలా చాలా పార్లమెంటు ఎజెండా అంశాలు ఇచ్చారు! అయితే వారు అందులో ఎన్ని సాధించగలరు? అనేదే చర్చనీయాంశం.

ప్రత్యేకహోదా అనే అంశాన్ని తాము విడిచిపెట్టలేదు..అని ప్రజల ముందు చెప్పుకోడానికి వైకాపా ఇంకా ప్రయత్నిస్తోంది. అందువల్ల సహజంగానే ఆ మాటను కూడా ఎంపీలకు చెప్పారు.

అలాగే క్లిష్టమైన కేంద్రం మెడలు వంచి రాబట్టడం అసాధ్యం అనిపించే చాలా అంశాలను కూడా సూచించారు. విభజన చట్టం హామీలను వెంటనే సాధించడం, రెవెన్యూలోటు 18వేల కోట్లను రాబట్టడం, పోలవరం ఖర్చుపెట్టిన నిధులు 3వేల పైచిలుకు కోట్లను రాబట్టడం, ఆర్అండ్ఆర్ కోసం మరో పదివేల కోట్లు తక్షణం తీసుకురావడం.. వంటివెన్నో జగన్ సూచనల్లో ఉన్నాయి. పైగా జగన్ సూచించిన అంశాల్లో... రాష్ట్రానికి 12 లక్షల ఇళ్లు రాబట్టడం వంటివి కూడా ఉన్నాయి.

కానీ ఇవేవీ కూడా ఒక పట్టాన నెరవేరేవి కాదు. కేంద్రం అకారణద్వేషాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌ను విస్మరిస్తోంది. పోలవరం విషయంలో కూడా అంతే తేడాగా వ్యవహరిస్తోంది. జాతీయ ప్రాజెక్టుగా పేరుకు ప్రకటించినప్పటికీ.. సకాలంలో నిధులు విడుదల చేయడం.. పనులు త్వరగా సాగడం అనే జాగ్రత్తలు వారు తీసుకోలేకపోతున్నారు. పట్టించుకోవడం లేదు.

విభజన చట్టం హామీలన్నింటినీ సాధించుకోవడం కూడా అంత సులువు కాదు.  కేంద్రం రాష్ట్రం పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ప్రస్తుత తరుణంలో వారు ఈ డిమాండ్లు నెరవేర్చడం అనుమానమే.

రాష్ట్రంలో ప్రబలశక్తిగా ఎదగాలని భాజపా అనుకుంటున్నప్పటికీ.. ఆమేరకు రాష్ట్రంపై ప్రేమ చూపించడంలో మాత్రం విఫలమవుతోంది.

రాష్ట్రానికి సంబంధించి జగన్ ఎన్ని సూచనలు చేసినప్పటికీ.. వైకాపా ఎంపీలు ఎన్ని సాధిస్తారన్నది అనుమానమే. వారిలో చిత్తశుద్ధిలోపం ఉంటుందని కాదు గానీ.. ప్రభుత్వం తరఫునుంచి స్పందనే సందేహం.

ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా... వీరి కృషికి ఎన్ని విజయాలు నమోదు అవుతాయో వేచిచూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?