నవరత్నాల ప్రచారం ఈ ఎన్నికల్లో వైసీపీకి భారీగా లబ్ధిచేకూర్చింది. ఆ లెక్కన చూసుకుంటే ఆ పథకాలను సక్రమంగా అమలు చేస్తేచాలు వచ్చేసారి కూడా వైసీపీ అధికారంలోకి రావడం గ్యారెంటీ. ఇంకేవీ చేసినా, చేయకపోయినా ఇబ్బంది లేదు. మరి సీఎం జగన్ దూకుడు చూస్తుంటే.. కేవలం నవరత్నాల వరకే పరిమితం అయినట్టు లేరు. గత ప్రభుత్వం అవినీతిపై అంతకంటే ఎక్కువగా ఫోకస్ పెట్టారు జగన్.
జగన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారని అందుకే అవినీతిని వెలికితీసి చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఓ వాదన ఉంది. వచ్చే ఎన్నికలకల్లా టీడీపీని చావుదెబ్బ కొట్టాలంటే ఇదే సరైన మార్గమని మరికొందరు పార్టీ నాయకులు కూడా అనుకుంటున్నారు. ఇంతకీ జగన్ ది ప్రతీకారమా? లేక భవిష్యత్ ప్రణాళికా? ఆలోచించి చూస్తే ఈ రెండూ కావని తేలుతుంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితే జగన్ ని ఈ దిశగా పురిగొల్పుతోంది. ఆర్థిక లోటులో ఉన్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు పెంచుకుంటూ పోతున్నారు సీఎం జగన్. ఖజానాపై మరింత భారం పడుతున్నా ఉద్యోగుల జీతభత్యాలు పెంచారు. ఇలాంటి టైమ్ లో జగన్ ముందు రెండు ఆప్షన్ లున్నాయి. ఒకటి చంద్రబాబులా అప్పులు తేవడం, రెండు చరిత్రలో నిలిచిపోయేలా సమస్యకు పరిష్కార కనుక్కోవడం. జగన్ రెండో మార్గాన్నే ఎంచుకున్నారు.
దుబారాని పూర్తిగా తగ్గించేశారు సీఎం. అక్రమాలు, అవినీతిని రూపుమాపితే ఏపీ అప్పుల కుప్ప కాదు, అభవృద్ధికి మారుపేరులా నిలుస్తుందని జగన్ నిరూపించబోతున్నారు. అందులో భాగంగా ఆయన చేపట్టిన ప్రక్షాళణ టీడీపీ నేతలకు ప్రతీకారంగా కనిపిస్తోంది. కానీ అది ప్రతీకార చర్య కాదనే విషయం కాస్త లోతుగా ఆలోచిస్తే అర్థమౌతుంది.
చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకోడానికే ప్రజావేదిక కూలదోశారని, కరకట్ట నిర్మాణాలను పడగొడుతున్నారని, ప్రాజెక్ట్ లపై సమీక్షలు చేస్తున్నారని, తమ పథకాలను ఆపేశారని దుష్ప్రచారం చేస్తోంది టీడీపీ. వాస్తవాల్ని గమనిస్తే.. నవరత్నాల అమలు ఎంత ముఖ్యమో.. అవినీతి ప్రక్షాళణ అంతకంటే ఎక్కువ ముఖ్యంగా మారింది. ఒకరకంగా నవరత్నాలు అమలు చేయాలంటే.. గతప్రభుత్వ అవినీతిని కట్టడి చేయాల్సిందే. వారి పాపాలను బైటకు లాగాలి, తిన్నదంతా కక్కించాలి. అప్పుడే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా అభివృద్ధి బాటలో పయనిస్తుంది.
ప్రస్తుతం జగన్ ఇదే పనిలో ఉన్నారు. కొంతమందికి ఇది ప్రతీకారంగా కనిపించొచ్చు, కానీ ఈ అపవాదులన్నిటినీ భరిస్తూనే జగన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై స్థిరమైన ప్రణాళికతో ఉన్నారు కాబట్టే దేనికీ వెరవకుండా, ఎలాంటి దుష్ప్రచారాలను పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. అదే సరైన నాయకుడి లక్షణం.