పవన్ కల్యాణ్ సరసన బద్రి సినిమా చేసిన హీరోయిన్ అమీషా పటేల్ కు ఇప్పుడు కోర్టు కేసు మెడకు చుట్టుకుంది. ఓ ఫైనాన్షియర్ నుంచి 3 కోట్ల రూపాయల అప్పు ఎగవేసినందుకు ఆమెకు కోర్టు సమన్లు జారీచేసింది. పైగా ఇందులో చెక్ బౌన్స్ కేసు కూడా లింక్ అయి ఉండడంతో, అమీషాకు కష్టాలు తప్పలేదు.
హీరోయిన్ గా అవకాశాల్లేక ఇబ్బందిపడుతున్న అమీషా, సోషల్ మీడియాతో పాటు ఫొటోషూట్స్ తో వస్తున్న సంపాదనతో బండి లాగించేస్తోంది. ఇలాంటి టైమ్ లో ఆమెను ఓ కథ ఎట్రాక్ట్ చేసింది. తనే నిర్మాతగా మారి ఆ సినిమా తీసేందుకు రంగంలోకి దిగింది. దీనికోసం అజయ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి దగ్గర 3 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది.
అయితే ఎన్నో కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మరోవైపు ఫైనాన్షియర్ నుంచి ఒత్తిడి రావడంతో అతడికి చెల్లని చెక్కు ఇచ్చింది అమీషా. దీంతో సదరు ఫైనాన్షియర్ ఆమెపై కేసు వేశాడు. రాంచీ కోర్టులో కేసు ఫైల్ అయింది. ఈనెల 8న ఆమె కోర్టుకు హాజరుకావాలి. హాజరుకాకపోతే అరెస్ట్ వారెంట్ జారీచేస్తారు.
తనకు రావాల్సిన 3 కోట్ల మొత్తాన్ని వడ్డీతో పాటు చెల్లించాలని.. ఇప్పటికిప్పుడు చెల్లించకపోయినా ఎప్పట్లోగా చెల్లిస్తారో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని అంటున్నారు అజయ్ కుమార్. ఈ విషయంపై స్పష్టత కోరిన ప్రతిసారి అమీషా తప్పించుకు తిరుగుతోందని ఆరోపించారు. దీన్ని అమీషా ఖండిస్తోంది. తను ఎటూ పారిపోలేదని, ముంబయిలోనే ఉన్నానని.. అప్పు త్వరలోనే తీరుస్తానని చెబుతోంది.
అమీషా ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడంతో.. ఆ ఫైనాన్షియర్ కోర్టులో కేసు వేశాడు. ప్రారంభించిన సినిమా సెట్స్ పైకి రాక, అప్పు తీర్చలేక ప్రస్తుతం సతమతమౌతోంది అమీషా.