మంత్రివర్గంలో చోటు దక్కించుకోలేకపోయిన రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు జగన్. అయితే ఇది జస్ట్ కొసరు మాత్రమే, అసలు పదవి ఇంకోటి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అవును.. నగరి ఎమ్మెల్యే రోజా కోసం జగన్ ప్రత్యేకంగా ఓ కొత్త పదవిని సృష్టించే పనిలో ఉన్నారట.
తను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలు అమలు బాధ్యతను రోజాకు అప్పగించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటుచేసి దానికి రోజాను అధ్యక్షురాలిగా నియమించాలని అనుకుంటున్నారట. ఈ సంస్థ ఇతర శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ నవరత్నాల హామీల్ని దగ్గరుండి అమలు చేస్తుందన్నమాట.
నిజంగా రోజాకు ఇది కీలకమైన బాధ్యత, పదవి. దాదాపు అన్ని శాఖల్ని సమన్వయపరిచే పదవి అంటే మామూలు విషయం కాదు. దీనికోసం సీఆర్డీఏ తరహాలో ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేయాలని జగన్ భావిస్తున్నారు. దీనిపై ఏ మంత్రి ఆజమాయిషీ ఉండదు. పూర్తిగా రోజాదే బాధ్యత. ఆమె జగన్ కు రిపోర్ట్ చేస్తారన్నమాట. నవరత్నాల అమలుతో పాటు ఈ కార్యక్రమంలో ఎలాంటి అవకతవకలు, అవినీతి జరగకుండా చూసే బాధ్యత కూడా రోజాదే.
అయితే ఇక్కడే కొంతమంది మరో వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. రోజాకు ఈ బాధ్యత అప్పగిస్తే, రెండున్నరేళ్ల తర్వాత జరిగే రెండో విడత కేబినెట్ విస్తరణలో ఆమెకు ఇక మంత్రిపదవి ఇవ్వరని అంటున్నారు. అయితే మంత్రి పదవితో సమానంగా ఈ నూతన పదవిని తీర్చిదిద్దాలని జగన్ భావిస్తున్నారు. సో.. రోజా మంత్రిపదవి కల నెరవేరబోతోందన్నమాట.