‘చైనా’ అక్రమాల్ని అపడం జగన్ వల్ల అవుతుందా?

ఇక్కడ చైనా అంటే పొరుగుదేశం చైనా కాదు. విద్యావ్యవస్థలో చైనాకు ఓ చక్కటి పేరు ఉంది. అదే చైతన్య, నారాయణ కాంబినేషన్. ఈ రెండు యాజమాన్యాలు కలిసి సాగిస్తున్న దందా అనేది ఓ బహిరంగ…

ఇక్కడ చైనా అంటే పొరుగుదేశం చైనా కాదు. విద్యావ్యవస్థలో చైనాకు ఓ చక్కటి పేరు ఉంది. అదే చైతన్య, నారాయణ కాంబినేషన్. ఈ రెండు యాజమాన్యాలు కలిసి సాగిస్తున్న దందా అనేది ఓ బహిరంగ రహస్యం. విద్యావ్యవస్థను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకున్న ఈ అక్రమ అనుబంధానికి చెక్ పెట్టాలని జగన్ నిర్ణయించారు. ప్రజాసంకల్పయాత్ర నుంచి ఎన్నికల ప్రచారం వరకు ప్రతి సందర్భంగా నారాయణ, చైతన్య నిలువు దోపిడీ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు జగన్.

చివరికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున కూడా విద్యావ్యవస్థలో మార్పులు, ఈ సంస్థల అక్రమాలపై మాట్లాడారు. అలా విద్యావ్యవస్థలో మార్పులపై సీరియస్ గా దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి, దానికి సంబంధించి ఈరోజు రెండు కీలకమైన బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని ప్రతి విద్యాసంస్థ నిబంధనల ప్రకారం మౌలిక వసతులు కల్పించడం, విద్యాప్రమాణాలు పాటించడంతో పాటు కనీస రుసుములు విధించేలా ఈ బిల్లుల్ని రూపొందించారు.

ఈ బిల్లులు సభలో ఆమోదం పొందితే ప్రత్యేకంగా 2 కమిషన్లు ఏర్పాటవుతాయి. హైకోర్టు జడ్జిల ఆధ్వర్యంలో ఈ కమిషన్లు నడుస్తాయి. విద్యారంగం, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులు ఇందులో సభ్యులుగా ఉంటారు. వీళ్లంతా విద్యావ్యవస్థలో సమూల మార్పులకు తగిన సూచనలు చేస్తారు. కేవలం సూచనలు చేయడంతోనే ఈ కమిషన్ల పని అయిపోదు. నిబంధనలు పాటించని సంస్థల గుర్తింపును రద్దుచేసే అధికారాన్ని సైతం ఈ కమిషన్లకు ఇచ్చేలా బిల్లులు తయారయ్యాయి.

అంతేకాదు, ఓ సాధారణ సివిల్ కోర్టుకు ఇచ్చే అధికారాల్ని ఈ కమిషన్ కు దఖలు చేస్తూ బిల్లు రూపొందించారు జగన్. కాబట్టి ఏ విద్యాసంస్థ అయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, అదనంగా ఫీజులు వసూలు చేస్తే సంబంధిత వ్యక్తుల్ని పిలిచి విచారించే అధికారం ఈ కమిషన్లకు ఉంటుంది. విద్యావ్యవస్థలో ఫీజులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎల్ కేజీకి కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేసే సంస్థలున్నాయి. ఇక ఇంటర్మీడియట్ విద్యలో అరాచకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఐఐటీ, ఇంజినీరింగ్, మెడిసిన్ పేరుపెట్టి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యార్థులపై విపరీతంగా ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉదంతాలు ఎన్నో. వీటన్నింటినీ గతంలో జగన్ ప్రస్తావించారు. అందుకే విద్యావ్యవస్థలో సమూల మార్పులకోసం ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం 40వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటన్నింటి ఫోటోలు తీయమని ఆదేశించారు ముఖ్యమంత్రి. సరిగ్గా రెండేళ్లలో ఈ పాఠశాలల రూపురేఖలన్నీ మార్చేస్తానని, ఆ తర్వాత తీసిన కొత్త ఫొటోలతో పాత ఫొటోల్ని సరిపోల్చుకోవచ్చని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఆర్థిక కారణాలతో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే అమ్మఒడి పథకాన్ని ఇంటర్మీడియట్ వరకు విస్తరించారు. ఇలా విద్యావ్యవస్థలో సమూల మార్పులతో పాటు నారాయణ, చైతన్య అక్రమాలకు అడ్డుకట్టు వేసేందుకు జగన్ ఇలా చట్టపరంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి విద్య అనేది వ్యాపారం కాదు. కనీస రుసుముతో సేవాదృక్పథంతో చేయాల్సిన కార్యక్రమం. కానీ ట్రస్టుల పేరిట కొన్ని విద్యాసంస్థలు విద్యను కార్పొరేట్ వ్యాపారంగా మార్చేశాయి. ఈ అవ్యవస్థను మార్చడమే ఇప్పుడు జగన్ లక్ష్యం.

కామ్రేడ్ కథ మొత్తం చెప్పిన విజయ్ దేవరకొండ

తల్లిపేరుతో సంజయ్ చేస్తే.. తండ్రి పేరుతో లోకేష్ చేశాడు