లోకేశ్‌పై చాలా పెద్ద బాధ్యతే ఉంది. టీడీపీ నాయకత్వం చంద్రబాబు చేతిలోనే ఉండబోతోంది. ఆయన దాన్ని తిరిగి ఎన్టీయార్ వారసులకు అప్పగించడం కల్ల. తన వారసుడైన లోకేశ్‌కే పార్టీ అధినేతృత్వం కట్టబెడతారు. అది ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేం. తను ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నపుడే బాబు ఆ పని చేసేయవచ్చు. తను డీలాపడ్డాక, లోకేశ్ నాయకుడంటే కొంతమంది తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే అతన్ని యువరాజుగా చూపించినా, పార్టీ దృష్టిలో కానీ, ప్రజల దృష్టిలో కానీ బాబు మీదే ఫోకస్ ఉంటోంది. లోకేశ్ గెలిచి అసెంబ్లీకి వచ్చి ఉంటే బాబుతో పాటు అతనూ వైసిపిని ఢీకొనే ప్రయత్నం చేసేవాడేమో! కానీ అది జరగలేదు. అందువలన లోకేశ్ తన కంటూ ఇమేజిని, బలాన్ని సమకూర్చుకోవడం ఆలస్యమౌతోంది.
అధికారంలో ఉండగా ప్రతిభకు పెద్దగా గుర్తింపురాదు. కష్టాల్లో ఉన్నపుడు చూపిన పోరాటపాటవమే హైలైట్ అవుతుంది. పాండవులు ఇంద్రప్రస్థంలో ఉండగా వచ్చిన పేరు కంటె అరణ్య, అజ్ఞాతవాసాల తర్వాత కురుక్షేత్రంలో గెలిచిన తీరుకే ఎక్కువ ప్రశంసలు వచ్చాయి. అలా అని ఎవరూ కావాలని కష్టాలను వరించరు. టీడీపీ ఈ స్థితికి చేరాలని లోకేశ్ కోరుకుని ఉండరు. కానీ దీన్ని తన అనువుగా మార్చుకుని, తనంతట తాను పార్టీని నడపగలనని చూపించుకునే అవకాశంగా మలచుకోవడంలో ప్రజ్ఞ ఉంది. అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది కూడా. ఈ సందర్భంలో సంజయ్‌గాంధీ చరిత్ర తెలుసుకోవడం లోకేశ్‌కు ఎంతైనా ఆవశ్యకరం.
సంజయ్‌గాంధీ అనగానే చాలామందికి చికాకు పుట్టుకు వస్తుంది. ఎమర్జన్సీ సమయంలో రాజ్యాంగేతర శక్తిగా విపరీతమైన అధికారం చలాయించిన వ్యక్తిగా, కేంద్రమంత్రులను, ముఖ్యమంత్రులను కూడా చప్రాసీలుగా చూసిన అహంభావిగానే వాళ్లకు గుర్తు. ఎమర్జన్సీని ఉపయోగించి తను ఆడింది ఆట, పాడింది పాటగా చెల్లించుకుని కాంగ్రెసు పార్టీని సర్వనాశనం చేసిన వ్యక్తిగా అందరికీ జ్ఞాపకం. 1977 ఎన్నికల తర్వాత సంజయ్‌ను శామ్‌సన్‌గా చిత్రీకరిస్తూ కార్టూన్ వచ్చింది. శామ్‌సన్ శత్రువులున్న ఒక భవంతిని కూల్చేస్తూ దానికింద తనూ పడి నాశనమైపోతాడు. సంజయ్ కూడా తనతో పాటు కాంగ్రెసును కూడా నామరూపాలు లేకుండాచేశాడు. ఉత్తరాది రాష్ట్రాలలో ఒక్క సీటు కూడా రాకుండాపోయింది.
ఇదంతా వాస్తవమే కానీ సంజయ్‌లో అది ఒక పార్శ్వం మాత్రమే. 1977-80 మధ్యకాలంలో అతని చర్యలను గమనిస్తే, అతనిలో ఉన్న రాజకీయ నాయకుడు తెలుస్తాడు. సంజయ్‌కు మొదట్లో రాజకీయాల పట్ల ఆసక్తిలేదు. మారుతి పేరుతో చిన్నకారు తయారుచేసి పేరు తెచ్చుకుందామనే దుగ్ధతో తల్లికి చెప్పి అడ్డదారిలో బ్యాంకు ఋణాలు తెచ్చుకున్నాడు. దానిపై రచ్చ జరిగింది తప్ప, కారు తయారు కాలేదు. ఆ నిస్పృహలో ఉండగానే అలహాబాదు తీర్పురావడం, ఏం చేయాలో తెలియక ఇందిరా కొట్టుమిట్టులాడడం జరిగింది. అప్పుడు సంజయే తల్లికి ధైర్యం చెప్పి ఎమర్జన్సీ విధింపు సలహాకు వత్తాసు పలికాడు. ఇందిర అతనిమాట వింది. ఎమర్జన్సీ విధించింది.
ఇక అప్పణ్నుంచి సంజయ్ విజృంభించాడు. దేశానికి ఏది మేలు చేస్తుందని తను అనుకున్నాడో అవన్నీ నియంతలా అమలుచేశాడు. పాత దిల్లీలో జామా మసీదు చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలన్నీ ఒక్కదెబ్బలో కూల్చిపారేయించాడు. కుటుంబ నియంత్రణ అంటే అసహ్యించుకుని, ఇబ్బడిముబ్బడిగా జనాభా పెంచుకుపోతున్న ఉత్తరాది రాష్ట్రాలలో బలవంతంగా ఆపరేషన్లు చేయించాడు. ఎంత ప్రజావ్యతిరేకత వచ్చిన తొణకలేదు, బెణకలేదు. యూత్ కాంగ్రెసు నాయకుణ్నంటూ దేశమంతా తిరిగి నీరాజనాలు అందుకున్నాడు. ఇందిరకు వారసుడిగా, కాంగ్రెసు పార్టీకి భవిష్యనేతగా ప్రొజెక్టు చేయించుకున్నాడు. తనకు కావలసినవాళ్లకు ఉపకారాలు చేశాడు, నచ్చనివారికి అపకారాలు, అవమానాలు. తల్లి సోషలిస్టు విధానాలకు తిలోదకాలు ఇచ్చాడు. ఆవిడ చిరకాల స్నేహితులైన సీపీఐతో పేచీ పెట్టుకున్నాడు. పాలన ఇందిర పేరు మీద నడిచినా, పెత్తనమంతా ఇతనిదే.
మీడియాపై సెన్సార్ ఉండడంతో వాస్తవాలు బయటికి రాకుండా పోయాయి. జర్నలిస్టులు సైతం భజనదాసులుగా మారిపోయారు. ఎమర్జన్సీ పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని భ్రమించి, 1977లో ఇందిర ఎన్నికలు జరిపించింది. దిమ్మ తిరిగేలా ప్రజలు బుద్ధిచెప్పారు. ఇందిర, సంజయ్‌తో సహా కాంగ్రెసు దిగ్గజాలందరూ ఓడిపోయారు. దక్షిణ రాష్ట్రాలు మాత్రం పార్టీ పరువు నిలిపాయి. ఇందిర ఈ ఓటమిని తట్టుకోలేక పోయింది. కాంగ్రెసు పార్టీలోని పాతకాపులందరినీ ఒక ఆట ఆడించి, వినూత్న విధానాలతో పేదప్రజల మనసులలో 'ఇందిరమ్మ'గా తిష్ట వేసుకుని, అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్న తను ఇంత ఘోరంగా ఓడిపోవడం, వెనువెంటనే తన అనుచరులందరూ తనను వదిలివెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోయింది.
అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ఉత్తరాది రాష్ట్రాలలో అసెంబ్లీలను రద్దుచేసి ఎన్నికలు జరిపితే, కాంగ్రెసుకు మళ్లీ ఘోరపరాజయం! జనతా ప్రభుత్వం ఇందిరపై కేసులు పెట్టసాగింది. అరెస్టు చేయించింది. ఎమర్జన్సీ అత్యాచారాలపై షా కమిషన్ వేసి, అప్పటి పాతకాలన్నీ తవ్వి తీయించింది. దానితో దక్షిణాదిన కూడా కాంగ్రెసు నాయకులు డిఫెన్సులో పడిపోయారు. జనతా పార్టీ అక్కడ కూడా విస్తరించసాగింది. మీడియా ఒక్కసారిగా ప్లేటు మార్చి, ఇందిరను, కాంగ్రెసును, సంజయ్‌ను రాక్షసులుగా చూపించసాగింది. వాళ్ల తప్పులపై విస్తృతంగా వ్యాసాలు రాసింది. పుస్తకాలు కూడా వెలువడ్డాయి. గతంలో ఎమర్జన్సీలోని కొన్ని అంశాలను చూసి మురిసి మెచ్చుకున్నవాళ్లు కూడా టపటపా లెంపలు వేసుకోసాగారు. జనతా పార్టీ నాయకులు 'ఇందిర ఫినిష్ అయిపోయింది' అని గర్వంగా చెప్పుకోసాగారు.
ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే కొంచెం తక్కువ స్థాయిలో ప్రస్తుత టీడీపీ పరిస్థితి ఇలాగే ఉంది. టీడీపీ పాలన గురించి మంచిగా మాట్లాడేవాడు లేకుండాపోయాడు. తేడా ఎక్కడంటే ఇక్కడ యువరాజు ఓడినా, మహరాజు నెగ్గాడు. ఇందిర సైన్యం ఆనాడు కుంచించుకుపోయినట్లే ఈనాడు టీడీపీ సైనికుల సంఖ్య తగ్గిపోయింది. ఆనాడు కాంగ్రెసు నాయకులు అధినేత్రికి ఎదురు తిరిగి, జనతా పార్టీకి వెళ్లిపోయారు. ఈనాడు టీడీపీ నాయకులు, బాబు గారికి ఎంతచెప్పినా చెవిన పెట్టలేదు అంటూ భారతీయ జనతా పార్టీకి వెళ్లిపోతున్నారు. ఆనాడు ఇందిర బహిరంగంగా బయట పడకపోయినా స్థయిర్యం చెడి ఉందని చెప్పుకున్నారు. ఈనాడు బాబు కూడా పైకి బింకంగా అపజయాలు టీడీపీకి కొత్త కాదు అంటూనే ఉన్నా, లోపల 'ఇదేమిటి, ఇంత ఘోరంగా ఓడిపోయాం, ఎప్పటికి కోలుకుంటాం?' అని దిగాలు పడుతూనే ఉంటారు.
ఆనాడు పరాజిత ఇందిరకు ధైర్యం చెప్పి అండగా నిలబడ్డాడు సంజయ్. ఆమె బయటకు ఎక్కువ రానక్కరలేకుండా తనే బయటకు వచ్చి పోరాటాలు చేసి, కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని, రాజకీయ వ్యూహాలు రచించి, ప్రతిక్షకుల శిబిరంలో చీలికలు తెచ్చి, మిత్రభేద నీతితో వారి ప్రభుత్వాన్ని పడగొట్టి, మళ్లీ ఎన్నికలు వచ్చేట్లు చేశాడు. ఆ ఎన్నికలలో అభ్యర్థులందరినీ తనే ఎంపిక చేసి, ప్రచారం చేసి, మంచి ప్రణాళికతో ఎన్నికలు నెగ్గి, విజయకిరీటాన్ని తల్లి శిరసుపై ఉంచాడు.
నేననేది – లోకేశ్ సంజయ్ కథ నుంచి స్ఫూర్తి పొంది, అటువంటి ప్రయత్నం చేయాలి. దాని ఫలితం ఇప్పుడే చెప్పలేం. కానీ ప్రయత్నమైతే చేయాలి. అప్పుడే లోకేశ్ నాయకు డనిపించుకుంటాడు. బాబు కెరియర్ మహా అయితే పది, పన్నెండేళ్లుంటుంది. కానీ లోకేశ్ కెరియర్ 40 ఏళ్లుంటుంది. 40 ఏళ్ల పాటు పార్టీని ఏకతాటిపై నిలబెట్టి ఉంచాలంటే అనుచరులకు నాయకుడి సామర్థ్యంపై అచంచల విశ్వాసం ఉండాలి. ఫలానావారి అబ్బాయి కాబట్టి ఆటోమెటిక్‌గా సమర్థుడై ఉంటాడని ఎవరూ అనుకోరు. చరణ్ సింగ్ స్థాయి ఎక్కడ? అజిత్ సింగ్ స్థాయి ఎక్కడ? కరుణానిధి స్థాయి ఎక్కడ? అళగిరి స్థాయి ఎక్కడ? అవకాశం వచ్చినపుడు కొడుకు అందిపుచ్చుకోవాలి.
ఇందిరాగాంధీ స్థాయి తక్కువేమీకాదు. రాజకీయాల్లో చెడుగుడు ఆడేసిన మనిషి. అయితే 1977 ఓటమి తర్వాత ఆమె డీలా పడింది. సంజయ్ గాంధీ ఆమెను కాస్త విశ్రాంతి తీసుకోమని చెప్పి లీడ్ తీసుకున్నాడు. ఇందిర ప్రజాజీవితం నుంచి రిటైర్ కాలేదు, కనుమరుగు కాలేదు. 1978 నవంబరు నాటి ఉపయెన్నికలో నెగ్గి చిక్‌మగళూరు నుండి ఎంపీ అయింది. 1978లో ఆంధ్ర, కర్ణాటకలలో ప్రచారం చేసి కాంగ్రెసు ప్రభుత్వాలను అధికారంలోకి తెచ్చింది. అయినా పార్టీ వ్యవహారాలను నడపడం, జనతా పార్టీని ఎదిరించి వీధిపోరాటాలు చేయడం ఇవన్నీ సంజయ్ చేపట్టాడు.
నిజానికి అప్పట్లో జనతా పార్టీకి గొప్ప ఇమేజి ఉండేది. మొరార్జీ, చరణ్, వాజపేయి, ఫెర్నాండెజ్, ఆడ్వాణీ, మధు దండవతే.. వంటి నిష్కళంకమైన ఇమేజి గల నాయకులు కాబినెట్‌లో ఉన్నారు. అట్టహాసానికి, ఆడంబరానికి దూరంగా ఉండేవారు. 30ఏళ్ల కాంగ్రెసు పాలనతో విసిగి ఉన్న ప్రజలకు జనతా పార్టీ గొప్ప రిలీఫ్. ఇటు చూస్తే సంజయ్ గాంధీకి అన్నీ లొసుగులే. ఎమర్జన్సీలో రాజ్యాంగేతర శక్తిగా అతను చేసిన అకృత్యాలన్నీ వెలుగులోకి వచ్చాయి. అతని వ్యక్తిగత జీవితం గురించి అనేక రసవత్తరమైన విషయాలు – కొన్ని కల్పితం కూడా కావచ్చు – మీడియా విస్తారంగా ప్రచురించింది. ఎమర్జన్సీ సమయంలో అతని చుట్టూ ఉన్నవాళ్లు ఎంత దుర్మార్గ్గులో మీడియా కథనాలు వండి వార్చింది. వాటిని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సంజయ్ అంటే మహాపాపి అనే మాటే వ్యాప్తిలో ఉంది.
అలాంటి ఇమేజి పెట్టుకుని అతను బయట తిరగడమే కాదు, అధికార పార్టీపై తిరగబడ్డాడు కూడా. అదీ విశేషం. దానికి అతనికి తగిన సాధనసంపత్తి కూడా లేదు. ఎమర్జన్సీ టైములో ఇందిర, సంజయ్‌ల అడుగులకు మడుగులొత్తిన కాంగ్రెసు నాయకులు, ఓటమి తర్వాత వాళ్లను పార్టీలోంచి బహిష్కరించారు. ఇందిర సొంత పార్టీ కాంగ్రెసు (ఐ) అని పెట్టుకుంది. కాంగ్రెసు ఎన్నికల గుర్తు ఆవు దూడ. ఇందిరకు హస్తం గుర్తు కేటాయించారు. సంజయ్ కేసులు ఎదుర్కున్నాడు. తల్లితో పాటు అరెస్టు కావడంతో పాటు, కిస్సా కుర్సీకా అని తమపై తీసిన వ్యంగ్యచిత్రాన్ని తగలబెట్టిన కేసులో 1979 ఫిబ్రవరిలో కోర్టు అతనికి 25 నెలల జైలుశిక్ష వేసింది.
సంజయ్‌కు బెయిలు కూడా ఇవ్వలేదు. (తర్వాతపై కోర్టులో తీర్పుమారింది) ఇలాంటి పరిస్థితుల్లో సంజయ్ తన భార్య మేనక సంపాదకురాలిగా ''సూర్య'' అనే పత్రిక ప్రారంభించి జనతా పార్టీని నిశితంగా విమర్శించేవాడు. ఆ పార్టీ నాయకుల మధ్య అంత:కలహాలను బయటపెట్టడంతో పాటు, వారి లొసుగులను బయటపెట్టేవాడు. ఉపప్రధానిగా ఉన్న జగజీవన్ రామ్ కొడుకు సురేశ్ అనే అతను తన వద్ద పనిచేసే సుష్మ అనే అమ్మాయితో ఓ గెస్ట్‌హౌస్‌లో రాసలీలలు సాగించగా ఆ కథనం ఫోటోలతో సహా వేసి జగ్‌జీవన్ రామ్‌కు చిక్కులు తెచ్చిపెట్టాడు. పార్టీలో జగన్‌జీవన్ వ్యతిరేకులందరూ పోగై, అతను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాంతో పార్టీలో గొడవలు ఇంకా ముదిరాయి.
జనతా పార్టీలో ప్రధాని మొరార్జీకి, ఉపప్రధాని చరణ్‌కు ఒకరిపొడ ఒకరికి గిట్టేదికాదు. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడమే అబ్బురం. జనసంఘ్ వర్గం మొదట్లో చరణ్ సింగ్‌తో చేతులు కలిపి లాభపడింది. వారి మద్దతుతో ప్రధాని అవుదామనుకుంటూండగా వాళ్లు మొరార్జీవైపు ఫిరాయించారు. దాంతో సోషలిస్టులందరూ చరణ్ వైపు వచ్చారు. ప్రధాని కావడానికి ఎంతటి దుస్సాహసానికైనా చరణ్ సిద్ధంగా ఉన్నాడని పసి గట్టిన సంజయ్, రాజ్ నారాయణ్ ద్వారా అతన్ని ఎప్రోచ్ అయ్యాడు. నిజానికి రాజ్ నారాయణ్ ఇందిరపై కేసు వేసి గెలిచినవాడు, రాయబరేలీలో ఇందిరను ఓడించినవాడు. ఇక చరణ్ సింగ్ పంతంతో ఇందిరను, సంజయ్‌ను అరెస్టు చేయించినవాడు.
కానీ సంజయ్ రాజకీయపు టెత్తులలో భాగంగా అహంకారాన్ని దిగమింగి, వ్యక్తిగత వైరాలను పక్కనపెట్టి, చరణ్ ప్రధాని కావడానికి తాము సాయపడతామని రాజ్ నారాయణ్ ద్వారా కబురంపాడు. చరణ్ బుట్టలో పడ్డాడు. కాంగ్రెసు అవిశ్వాస తీర్మానం పెట్టింది. దానిపై చర్చ జరుగుతూండగానే ఫెర్నాండెజ్ వంటి అనేకమంది నాయకులు మొరార్జీ క్యాంపు నుంచి, చరణ్ క్యాంపుకి మారిపోయారు. దాంతో మొరార్జీ ప్రభుత్వం 1979 జులైలో కుప్పకూలింది. కాంగ్రెసు మద్దతుతో చరణ్ ప్రధాని అయ్యాడు. వెంటనే తమపై కేసులు ఎత్తివేయాలని ఇందిర, సంజయ్ షరతులు విధించారు. చరణ్ సింగ్ కుదరదన్నాడు. అయితే మద్దతు ఉపసంహరిస్తున్నాం అన్నారు వీళ్లు.
1979 ఆగస్టులో చరణ్ ప్రభుత్వం కూలింది. పార్లమెంటు రద్దయి, కొత్త ఎన్నికలు ప్రకటించారు. సంజయ్‌కు కావలసినది అదే. 1980 జనవరిలో ఎన్నికలై కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా ఐదునెలల పాటు చరణ్ సింగ్ ఆపద్ధర్మ ప్రభుత్వం నడపవలసి వచ్చింది. అలాంటి ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దాంతో ధరలు పెరిగాయి. పాలన అస్తవ్యస్తమైంది. ఆ పాపమంతా జనతా పార్టీ నాయకులకు చుట్టుకుంది. అఖండమైన మెజారిటీ ఇచ్చి గద్దె నెక్కిస్తే తమలో తాము కలహించుకుని, దేశాన్ని భ్రష్టు పట్టించారు అని జనాలు జనతా పార్టీని అసహ్యించుకున్నారు. 'పనిచేసే ప్రభుత్వం అందిస్తా' అనే నినాదంతో ఇందిరా కాంగ్రెసు ఎన్నికలలో పాల్గొంది. జనతా పార్టీ ఏ పనీ చేయలేకపోయిందనే అంతరార్థం అందులో ఉంది.
1980 ఎన్నికలలో పార్టీ నిర్వహణ భారాన్ని సంజయ్ తన భుజాలపై వేసుకున్నాడు. అభ్యర్థుల ఎంపిక, నిధుల పంపిణీ, ప్రచార సరళి అన్నీ తనే చూసుకున్నాడు. అతని అసలైన ఆర్గనైజేషనల్ స్కిల్స్ అప్పుడే బయటపడ్డాయి. తనంటే అస్సలు పడనివాళ్లను కూడా ఒప్పించడంలో అతని చతురత తెలిసి వచ్చింది. సంజయ్ గాంధీకి ముస్లిములంటే అసహ్యమనే పేరు ఉంది. జామా మసీదు చుట్టూ ఉన్న ఇళ్ల కూల్చివేత, బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ద్వారా ముస్లిముల వ్యాప్తిని అరికట్టడం ఇలాంటివి ఆ భావాన్ని బలపరిచాయి. 1977 ఎన్నికలలో జామా మసీదు షాహీ ఇమామ్ అబ్దుల్లా బుఖారీ జనతా పార్టీకి మద్దతిచ్చి, కాంగ్రెసును ఓడించమని ముస్లిములందరికీ పిలుపు నిచ్చాడు.
1979లో ఎన్నికలు ప్రకటించగానే సంజయ్ బుఖారీ వద్దకు వెళ్లి 10 అంశాల కార్యక్రమం ఆధారంగా మద్దతు కోరాడు. జనతా పార్టీ తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని, వారి పాలనలో ఆరెస్సెస్ ప్రాబల్యం పెరిగిందనే కినుకతో ఉన్న బుఖారీ ముస్లిములందరూ ఈసారి కాంగ్రెసుకు ఓటేయాలని పిలుపునిచ్చాడు. 1980 ఎన్నికలలో కాంగ్రెసు బ్రహ్మాండంగా నెగ్గింది. అప్పణ్నుంచి దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉంది. అయితే అది చూడడానికి సంజయ్ బతికిలేడు. 1980 జూన్‌లో ఒక విమాన ప్రమాదంలో మరణించాడు. ఆ తర్వాతే ఇందిర రాజీవ్ గాంధీని బలవంతంగా రాజకీయాల్లోకి లాక్కుని వచ్చింది. ఇక్కడ గమనించవలసినది క్లిష్ట పరిస్థితులను సంజయ్ అధిగమించిన తీరు.
లోకేశ్ ఈ కథను స్ఫూర్తిగా తీసుకోవాలి. (వివరాలు కావాలంటే సంజయ్ ఒకప్పటి అనుచరుడు తన తండ్రిని అడిగి తెలుసుకోవచ్చు) తల్లి పేరు చెప్పుకుని సంజయ్ అధికారం చలాయించినట్లు, తండ్రి పేరు చెప్పుకుని లోకేశ్ చలాయించారు. ఎటొచ్చీ ఈయన మంత్రి కూడా. సంజయ్ లాగానే లోకేశ్ ఎన్నికలలో ఓడిపోయారు. అప్పటి జనతా లాగానే ఇప్పటి వైసీపీ ప్రభ కూడా వెలుగుతోంది. అప్పటి ఇందిర లాగానే యిప్పుడు బాబు నిందలు మోస్తున్నారు. కొత్త ప్రభుత్వం కమిటీలు, విచారణలు అంటూ మొదలుపెట్టి బాబుపై కేసులు పెట్టవచ్చు. తనను జైలుకి పంపడంలో ముఖ్యపాత్ర వహించిన బాబుని ఎలాగైనా జైలుకి పంపడమే జగన్ జీవితాశయమని వినబడుతోంది. అది సఫలమైతే, లోకేశ్ బయటవుండి పార్టీని నడిపించగలగాలి. అది మామూలు పార్టీ కాదు, 39% ఓటు బ్యాంకున్న పార్టీ. దాన్ని నడిపే స్కిల్స్ ఉన్నట్టుండి రావు, అలవర్చుకోవాలి.
అవినీతిని అరికట్టడం విషయంలో ఆశయాలు వేరు, ఆచరణ వేరు. జగన్ నిజంగా నిజాయితీగా మసలుకుంటే ఎమ్మెల్యేలలో అసంతృప్తి రగలడం ఖాయం. వారిని దువ్వి, తమవైపు తిప్పుకోవడంలోనే టీడీపీ ప్రజ్ఞ ఉంది. కాకలు తీరిన రాజ్ నారాయణ్‌ని కూడా సంజయ్ ముగ్గులోకి దింపగలిగాడు. నిజంగా జగన్ ప్రజలకు మంచి చేయగలిగితే, జనాలతో డైరక్టు ఈక్వేషన్ పెట్టుకుంటే ఈ ఎమ్మెల్యేలు ఏమీ చేయలేరు. కానీ మంచి పేరు తెచ్చుకోవాలనే యావతో వైసీపీ ప్రభుత్వం అలవికాని హామీలను గుప్పిస్తోంది. పథకాలను ప్రకటించడమే తప్ప, నిధులు ఎక్కణ్నుంచి వస్తాయో చెప్పటంలేదు. కేంద్రం నుంచి 60 వేల కోట్లు వస్తాయని బజ్డెట్‌లో అంచనా వేశారు. బీజేపీ ఇచ్చే రకమేనా? ప్రత్యేకహోదా కూడా విఫలమైన హామీగానే మిగులుతుందనిపిస్తోంది.
ఇవన్నీచూస్తూ కూడా జగన్ ప్రజల ఆశలు పెంచేస్తున్నారు. ఆశలు ఎంత ఎత్తులో ఉంటే నిరాశ అంత త్వరగా ఏర్పడుతుంది. బాబు విషయంలో అదే జరిగింది. కానీ జగన్ నేర్చుకోవటం లేదు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన విషయంలో దగాపడిన ఫీలింగు యువతలో రావడం తథ్యం. దాన్ని లోకేశ్ తనకు అనుగుణంగా ఉపయోగించుకోవాలి. లేకపోతే ఏ పవన్ కళ్యాణో ఎగరవేసుకుని పోయి, టీడీపీ భవిష్యత్తు దెబ్బతింటుంది. ఇదంతా లోకేశ్ ఎందుకు చేయాలి, బాబు ఉన్నాడుగా అనుకోవచ్చు. కానీ లోకేశ్‌కు ఒక ఎడ్వాంటేజి ఉంది. బాబుతో మాట్లాడడం ఎవరికైనా బెరుకే. ఎందుకంటే ఆయన చెప్తాడు కానీ వినడు. మీకేం తెలుసు అన్నట్లు వుంటుంది ఆయన వైఖరి. ఆయనతో చాలామంది నాయకులు గ్లాస్ వాల్ ఫీలింగ్ ఫీలవుతారు. అంటే మధ్యలో కనబడని గోడ ఉన్న అనుభూతి.
లోకేశ్‌కు అటువంటి భేషజం అక్కరలేదు. మనం అనుకున్నది అనుకున్నట్లు చెప్పవచ్చు అనే ధైర్యం అవతలివాళ్లకు కలిగించవచ్చు. 'బాబుకి వయసుతో పాటు చాదస్తం వచ్చింది, పైగా దశాబ్దాల పాటు ముఖ్యమంత్రి చేశానన్న హజం ఒకటుంది' అని బెదిరే యువ టీడీపీ, వైసీపీ నాయకులు లోకేశ్ వద్ద ఓపెన్ అప్ కావచ్చు. గతంలో లేదు కానీ, ఇటీవల బాబుపై కమ్మ ముద్ర బాగా పడింది. లోకేశ్ తను దానికి అతీతం అని చూపుకోగలిగితే, అన్నివర్గాల వారూ అతని వద్దకు వస్తారు. టీడీపీలో యూత్ వింగ్ మొత్తం లోకేశ్ తనచేతిలో తీసుకుని, దాని ద్వారా కొన్ని కార్యకలాపాలు స్వతంత్రంగా చేపడితేనే, సొంతంగా రాజకీయపు టెత్తుగడలు వేస్తేనే అతనికి సొంత ఇమేజి ఏర్పడుతుంది. లేకపోతే కేరాఫ్ నాన్నగా మిగిలిపోతాడు.
ఇవన్నీ నాలుగ్గోడల మధ్య వ్యవహారాలు. జనాన్ని ఇంప్రెస్ చేయాలంటే మంచి వక్తగా మారాల్సిందే. ఎందుకోగానీ లోకేశ్‌కు తెలుగు సరిగ్గా రావటంలేదు. మంత్రిగా ఉండగా లక్ష రూపాయల ప్రభుత్వ జీతంతో టీచరును పెట్టించుకున్నా (ఆయనకు ముగ్గురు అసిస్టెంట్లు కూడాట, ఎందుకు? పలకా, బలపం పట్టుకోవడానికా?) తెలుగు అబ్బలేదు. అందుచేత ఇంగ్లీషులో మాట్లాడడం బెటరు. దాని వలన నష్టం పెద్దగాలేదు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ నెగ్గుకురావడం లేదా? ఇక్కడ ముఖ్యమైన దేమిటంటే లోకేశ్ తను కూడా ఫైటర్నని చూపించుకోవాలి. వైయస్ మృతి తర్వాత తను ముఖ్యమంత్రి కావాలని పట్టుబట్టినపుడు జగన్ ఆశపోతుగా కనబడ్డాడు. కానీ తొమ్మిదేళ్ల స్ట్రగుల్ తర్వాత ప్రజల దృష్టిలో ఎలివేట్ అయ్యాడు, రైట్ రాయల్ వేలో ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే లోకేశ్ కూడా తన శక్తి చూపించుకోవాలి. ఫైటర్ క్రెడిటంతా చంద్రబాబుకే పోతే, ఇక లోకేశ్‌కు ఏం మిగులుతుంది?
దీనితోపాటు తనకు విషయపరిజ్ఞానం ఉందనీ లోకేశ్ చూపించుకోవాలి. పాదయాత్ర సమయంలో జగన్ ఇమేజి ఒకటైతే, అసెంబ్లీలో ఇమేజి మరొకటి. ప్రతి అంశంపై తనకు విషయం తెలిసున్నట్లు స్లయిడ్ షోలతో సహా చూపించుకుంటున్నాడు. వైసీపీ వాళ్లు ఇస్తున్న గణాంకాలకు సమాధానం చెప్పలేక అంత సీనియరైన బాబే తికమక పడుతున్నారు. అక్కడ కూర్చోవడం దుస్సహంగా ఉంది. అప్పుడే స్పీకరు వలపక్షం చూపిస్తున్నారంటూ రగడ మొదలుపెట్టారు. ఏదో సాకు చెప్పి అసెంబ్లీలోంచి తప్పుకునే రోజు మరీ దూరంలో లేదు. ఈ సమయంలో లోకేశ్ విజృంభించాలి. తన పేర పత్రికల్లో గణాంకాలతో వ్యాసాలు రావాలి. జగన్‌కే కాదు, తనకూ సబ్జక్టు ఉందని, తనలోనూ మేటరు ఉందని చూపుకోవాలి. ఇవన్నీ చేయకుండా ట్విటర్‌లనే నమ్ముకుంటే లోకేశ్ జోకేశ్‌గానే మిగులుతాడు.
-ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2019)
[email protected]