బిగ్ బాస్ హౌజ్ నుంచి హేమ బయటకు వచ్చేసింది. ఆమెకు ఎలిమినేషన్ తప్పదని ఎలా అయితే అంతా ఊహించారో, బయటకొచ్చిన తర్వాత ఆమె ఆరోపణలు చేస్తుందని కూడా అలానే ఊహించారు. ఇప్పుడదే జరిగింది. హౌజ్ లోకి ఇలా వెళ్లి అలా బయటకొచ్చేసిన హేమ.. స్టార్ మా నిర్వాహకులపై నిప్పులు చెరిగింది. నిర్వాహకులతో పాటు.. హౌజ్ లో ఉన్న కంటెస్టంట్లు తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు హేమ.
బిగ్ బాస్ హౌజ్ లో తనకు రాహుల్ కు గొడవ జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించిన హేమ, ఆ గొడవలో తప్పంతా తనవైపే ఉన్నట్టు టీవీ యాజమాన్యం ఎడిట్ చేసి చూపించారని ఆరోపించింది. అంతేకాదు.. హౌజ్ లో ఉన్న వ్యక్తులు కూడా అంతా ఒక్కటై తనకు అన్యాయం చేశారని అంటోది. అక్కా. .అక్కా అంటూనే అంతా తనను తొక్కేశారని బాధపడింది హేమ.
హౌజ్ లో కనీసం 3 వారాలైనా ఉండాలని అనుకున్నానని, కానీ అంతాకలిసి రాజకీయాలు చేసి తనను బయటకు గెంటేశారని ఆరోపిస్తున్నారు హేమ. చివరికి తనకు ప్రచారం కూడా కల్పించలేదని, ఓట్లలో కూడా లొసుగులు ఉన్నాయని ఆమె ఆరోపిస్తున్నారు. గూగుల్ లో తనకు ఎక్కువ ఓట్లు వచ్చాయని, కానీ హాట్ స్టార్ లోనే ఓట్లు వేయాలనే విషయాన్ని యాజమాన్యం తనకు చెప్పలేదన్నారు.
హౌజ్ లోకి ప్రవేశించినప్పట్నుంచి తనపై స్టార్ మా యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన హేమ, చివరికి తను వచ్చినప్పుడు తన AVని కూడా ప్రసారం చేయలేదన్నారు. ఇలా అంతా ఏకపక్షంగా సాగిపోతోందని, ఈ అక్రమాలేవీ నాగార్జునకు తెలియకుండా కూడా జాగ్రత్తపడుతున్నారని ఆమె ఆరోపించారు.
బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న టైమ్ లో హేమ బయటకు వచ్చి హైదరాబాద్ నగరంలో చక్కర్లు కొట్టారంటూ ఆమెపై విమర్శలు చెలరేగాయి. దీనిపై స్పందించని హేమ, అంతాకలిసి తనను విలన్ గా చూపించారంటూ బాధపడ్డారు. హౌజ్ నుంచి బయటకొచ్చిన వెంటనే కూతురితో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హేమ.