బాధ్యత మొత్తం జగన్ తీసుకుంటున్నారా?

నదుల అనుసంధానం అనేది ఖచ్చితంగా ఉపయోగకరమైన చర్య. గోదావరి కృష్ణ నదులను అనుసంధానం చేస్తేరెండు రాష్ట్రాలకు అది ఉపయోగకరం. ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అయినప్పుడు అదే చర్చించుకున్నారు. నిజానికి గోదావరిపై తెలంగాణ ప్రాంతంలోనే ఎత్తిపోతల…

నదుల అనుసంధానం అనేది ఖచ్చితంగా ఉపయోగకరమైన చర్య. గోదావరి కృష్ణ నదులను అనుసంధానం చేస్తేరెండు రాష్ట్రాలకు అది ఉపయోగకరం. ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అయినప్పుడు అదే చర్చించుకున్నారు. నిజానికి గోదావరిపై తెలంగాణ ప్రాంతంలోనే ఎత్తిపోతల ఏర్పాటుచేసి.. ఆ నీటిని శ్రీశైలం వరకు తీసుకువస్తే గనుక… తెలంగాణకు ఎక్కువ లాభం వస్తుంది. అయినా సరే.. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటిదాకా… గట్టి ప్రయత్నం తన తరఫు నుంచి మొదలెట్టలేదు. ఇటువైపు జగన్ మాత్రం.. అంతా తానే అయి కేంద్రానికి విన్నవించుకుంటున్నారు.

గోదావరి నుంచి వేల టీఎంసీల నదీజలాలు ప్రతిఏటా వృథాగా వెళ్లి సముద్రంలో కలుస్తున్న మాట నిజం. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిదే. పోలవరం డ్యాం ప్రధాన ఉద్దేశం కూడా అదే. అది పూర్తయితే చాలావరకు మిగులు జలాలు సముద్రంలో కలవడం తగ్గుతుంది. కానీ కొత్తగా కేసీఆర్ మరొక ప్రతిపాదన కూడా తెచ్చారు. తెలంగాణలోనే గోదావరిపై మరో ఎత్తిపోతల నిర్మించి అక్కడనుంచి 120 రోజుల వ్యవధిలో సుమారు 500 టీఎంసీల నీటిని శ్రీశైలానికి తరలించాలనేది ఆయన ప్లాన్.

అక్కడినుంచి నీళ్లు శ్రీశైలం చేరితే రాయలసీమకు పంపగలం అనేది ప్రస్తుతం చెబుతున్నమాట. కానీ శ్రీశైలం దాకా చేరడానికంటె ముందే ఉమ్మడి నల్గొండ, పాలమూరు జిల్లాలు మొత్తం సాగునీటితో సమృద్ధంగా తయారవుతాయి. శ్రీశైలానికి ఎన్ని నీళ్లు వస్తాయో.. అక్కడినుంచి ఎంతభాగం… రాయలసీమ చివరి జిల్లాలు అయిన చిత్తూరు వరకు చేరుతాయో దేవుడికెరుక. ఈలోగా ఉమ్మడి నల్గొండ, పాలమూరు జిల్లాలు నీటిన సంపదతో తులతూగడం గ్యారంటీ.

ఆ ప్లాన్ చాలా గొప్పది అనే అభిప్రాయం కలిగించేందుకే.. కేసీఆర్ ఇటీవలి పర్యటనలో చిత్తూరుజిల్లా నగరిలో కూడా రాయలసీమ రైతుల సాగునీటి వెతల గురించి మాట్లాడారు. ఒకసారి జగన్ తో సమావేశంలో నిర్ణయించడం, రోజా ఇంట్లో రైతుల గురించి మాట్లాడడం మినహా ఈ దిశగా ఆయన ఇప్పటిదాకా చేసిందేం లేదు.

చూడబోతే.. ప్లాన్ తాను చెప్పేసి.. బాధ్యత మొత్తం జగన్ ను తీసుకోమన్నట్లుగా ఉంది. జగన్ ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ఈ అనుసంధాన ప్రాజెక్టు గురించి.. ప్రధానికి విన్నవించారు. ఇప్పుడు తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ కు లేఖ రాశారు. జగన్ చురుగ్గానే ఈ విషయంలో పనిచేస్తున్నారు. కానీ కేసీఆర్ ఇప్పటిదాకా ఒక్క అడుగు కూడా వేయలేదు.

నిజానికి ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసి కేంద్రం వద్దకు వెళ్లి అడగాలి. ఇద్దరూ కలసి లేఖ రాయాలి. ఎందుకంటే ఇరు రాష్ట్రాలకూ ప్రయోజనం ఉంది. అలా కాకుండా.. బాధ్యత మొత్తం జగన్ మీద వదిలేసి… కేంద్రం అందుకు ఆమోదిస్తే ఎటూ లబ్ధి తనకూ జరుగుతుంది కదా.. అనే ఉద్దేశంతో కేసీఆర్ నిరీక్షిస్తున్నట్లుగా కనిపిస్తోంది.