పవన్ కామెడీ : ఎమ్మెల్యేను లాక్కుంటున్నారంట!

పవన్ కల్యాణ్ మళ్లీ కొత్త కామెడీ చేశారు. తమ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేను ‘లాక్కోవడానికి’ చూస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. వైకాపా ప్రభుత్వం తమ మీద ఎందుకు కక్ష…

పవన్ కల్యాణ్ మళ్లీ కొత్త కామెడీ చేశారు. తమ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేను ‘లాక్కోవడానికి’ చూస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. వైకాపా ప్రభుత్వం తమ మీద ఎందుకు కక్ష కట్టిందో తెలియడం లేదంటూ అమాయకత్వం కనబరిచారు. తనను రెచ్చగొట్టద్దని, ఎంతవరకైనా పోరాటం చేస్తానని కూడా పవన్ పేర్కొంటున్నారు.

ఆయన పార్టీ ఎమ్మెల్యే మీద పోలీసు కేసు పెట్టినందుకు ఆవేదన చెందడం సబబే. అందుకు ప్రభుత్వాన్ని నిందించడం కూడా సహజంగా జరిగేదే. ఆ ఎమ్మెల్యే పేకాటరాయుళ్లను విడిపించడానికి పోలీసు స్టేషన్ కు వెళ్లి.. అలాంటి నేలబారు దందాతో రచ్చకెక్కాడనే విషయాన్ని మరచిపోయి, స్టేషను మీద దాడి చేసినందుకు కేసుపెట్టడాన్ని గర్హించడమూ సమజమే.

కాకపోతే ఈ ఎపిసోడ్ మొత్తానికి… తమ పార్టీ ఎమ్మెల్యేను లాక్కోడానికి చూస్తున్నారన్న మాటే కామెడీగా కనిపిస్తోంది. ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను గానీ.. తమ పార్టీలో కలుపుకోవాల్సిన అగత్యం వైకాపాకు లేదు. 175 సభ్యులున్న సభలో ఏకంగా 151 మంది తిరుగులేని బలంతో వారి ప్రభుత్వం నడుస్తోంది. ఇంకా ఇతర పార్టీల ఎమ్మెల్యేల అవసరమేంటో అర్థం కాని సంగతి.

అదే సమయంలో.. ఇతర పార్టీల వారే ఎగబడి వైకాపాలోకి వెళ్లాలని చూస్తున్నప్పటికీ.. ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే రావాలని జగన్ చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్టీ ఫిరాయిస్తామంటూ పలువురు తనను సంప్రదించినా తాను ఒప్పుకోలేదని జగన్ కూడా సభలోనే చెప్పారు.

మరోవైపు స్పీకరు.. ‘ఎలాంటి ఫిరాయంపులనూ ప్రోత్సహించం అని, ఎవరిమీదనైనా వేటు వేసి తీరుతామని’ తెగేసి చెప్పేస్తున్నారు. అదే సమయంలో జనసేన ఎమ్మెల్యే రాపాక.. సభలో జగన్ ప్రభుత్వాన్ని ఏ రకంగా కీర్తించారో కూడా అందరికీ తెలుసు.

పరిస్థితులన్నీ ఇంత స్పష్టంగా ఉండగా, తన ఎమ్మెల్యేను లాక్కోడానికి ప్రయత్నిస్తున్నారంటూ పవన్ కల్యాణ్ ఆవేదన చెందడం కామెడీ కాక మరేమిటి? కేసులు పెట్టడం వరకు పోరాడితే ఓకే.. కానీ.. ఈ ‘లాక్కోవడం’ అనే కామెడీ ఐడియా ఆయనకు ఎక్కడినుంచి వచ్చిందో తెలియడం లేదు.