'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన మీద కక్ష కట్టింది..' అని తేల్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తమ పార్టీ ఏకైక ఎమ్మెల్యే పై కేసులు నమోదు చేయడాన్ని పవన్ ఆక్షేపించారు. తమ మీద కక్ష కట్టి ఆ కేసులు పెట్టారని పవన్ ఆరోపిస్తున్నారు.
దేనికైనా ఒక హద్దుండాలి. ఏకంగా పోలిస్ స్టేషన్ మీదకు రాళ్ల దాడికి దిగి, అనుచరులతో కలిసి రాళ్లు రువ్వుతూ, వీడియోలుగా తీసి వాటిని సోషల్ మీడియాకు ఎక్కించి.. అదీ తమ శక్తి అని ప్రచారం చేసుకున్న రాజకీయ నేత మీద కేసు పెట్టడం తప్పు అవుతుందా? పోలిస్ స్టేషన్ మీదే రాళ్లు రువ్వితే కేసులు పెట్టకూడదా? అది రాజకీయ కక్ష సాధింపు అవుతుందా?
అంతకన్నా విడ్డూరం ఏమిటంటే.. రాపాక వర ప్రసాద్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడానికే ఆ కేసులు పెడుతున్నారని పవన్ ఆరోపించడం. ఇది మరింత సిల్లీగా ఉంది. రాష్ట్రంలో ఏం జరుగుతోందో పవన్ కల్యాణ్ కు అర్థం కాకపోవచ్చు కానీ ప్రజలకు మాత్రం బాగా అర్థం అవుతోంది.
అధికారంలో ఉన్న పార్టీలోకి జంపింగ్ చేయడానికి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉబలాటపడుతూ ఉన్నారు. వారిలో కొందరు బాహాటంగా ప్రకటనలు చేస్తున్నారు. అయినా ఫిరాయిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న కండీషన్ తో వారు తటపటాయిస్తూ ఉన్నారు. ఫిరాయింపుల విషయంలో జగన్ కచ్చితంగా తన అజెండాను అసెంబ్లీలోనే ఓపెన్ గా ప్రకటిస్తున్నారు.
అంత ప్రకటించాకా.. వీర జనసేన ఎమ్మెల్యేను చేర్చుకోవడానికి ఇలా కేసులు పెట్టాల్సిన అవసరం ఉందా? అనేది ఇంగితం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. ఆ విషయం పవన్ కు అర్థం అయినట్టుగా లేదు. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అంటున్నారాయన.
అంటే అన్నారు కానీ, ఏదైనా సీరియస్ వ్యవహారాన్ని అయినా ఇలా వాడుకుంటే అదో గౌరవం. మరీ ఇలా పేకాట పాపారావులను వెనకేసుకు వచ్చిన తన ఎమ్మెల్యేను మళ్లీ తను వెనకేసుకురావడం జనసేన ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేస్తుందని పవన్ గ్రహించలేకపోతున్నట్టుగా ఉన్నారు. ఈ మాత్రం రాజకీయ అవగాహన లేకే పవన్ కల్యాణ్ కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారనేది మరో నిష్టూర సత్యం అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.