Advertisement

Advertisement


Home > Politics - Gossip

జ‌న‌సేన అభ్య‌ర్థికి చంద్ర‌బాబు నుంచి హామీ?

జ‌న‌సేన అభ్య‌ర్థికి చంద్ర‌బాబు నుంచి హామీ?

గ‌త ఎన్నిక‌ల్లో వేరుగా పోటీ చేసి చంద్ర‌బాబుకు రాజ‌కీయ సాయం చేయ‌బోయారు ప‌వ‌న్ క‌ల్యాణ్. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చాల‌నే పాచిక‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్-జ‌న‌సేన‌ను చంద్ర‌బాబు నాయుడు అప్పుడు ఉప‌యోగించుకున్నారు. ఆ పాచిక పార‌లేదు. అంతేగాక రెండో చోట్ల పోటీ చేసి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రువు పోగొట్టుకున్నాడు. 

త‌న ప‌రువు పోయినా ఫ‌ర్వాలేదు, త‌ను రాజ‌కీయంగా జోక‌ర్ అయిపోయినా ఫ‌ర్వాలేదు చంద్ర‌బాబు కోసం ప‌నిచేయ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా పెట్టుకుని జ‌న‌సేన అధిప‌తి ప‌ని చేస్తూ ఉన్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. చంద్ర‌బాబు చేతిలో పావుగా మార‌డం మిన‌హా ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ కల్యాణ్ రాజ‌కీయంగా సాధించింది ఏమీ లేదు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏమీ అమాయ‌కుడు కాద‌ని, చంద్ర‌బాబు చేతిలో ఆయ‌న ఊరికే ఏమీ పావుగా మార‌లేద‌ని, అందుకు త‌గిన ప్యాకేజీ ఉంటుంద‌నేది స‌ర్వ‌త్రా వినిపించే టాక్! ఆ మాత్రం ప్యాకేజీ లేనిది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఊరికే చంద్ర‌బాబుకు ఊడిగం చేయ‌డ‌నుకునే వారి అభిప్రాయం అది.

మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయితే తెలుగుదేశం-జ‌న‌సేన క‌లిసి పోటీ చేయాల‌నేది చంద్ర‌బాబు ప్ర‌ణాళిక‌గా స్ప‌ష్టం అవుతోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా కొన్నాళ్లుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓట్ల‌ను చీల‌నివ్వ‌ను అంటూ ఒక వాద‌న‌ను చెబుతూ వ‌స్తున్నారు! ప్ర‌జాస్వామ్యంలో ఓట్ల‌ను చీల‌నిచ్చేది, క‌లిపేది ఏమిటో ప‌వ‌న్ క‌ల్యాణ్ కే తెలియాలి. 

ఇందుకు బ‌దులు తెలుగుదేశంతో పొత్తు అంటూ సూటిగా చెబితే పోతుందేమో! ఇలాంటి డొల్ల వాద‌న‌లు వినిపించే ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రింత ప‌లుచ‌న అవుతూ ఉన్నాడు. మ‌రి తెలుగుదేశం- జ‌న‌సేన‌లు క‌లిసి పోటీ చేస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీకి గ‌ట్టిగా 15 నుంచి 20 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల టికెట్ల‌ను చంద్ర‌బాబు నాయుడు కేటాయిస్తార‌నే అభిప్రాయాలూ స‌ర్వ‌త్రా ఉన్న‌వే!

మొన్న‌టి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ముందు అయితే భ‌య‌ప‌డి అయినా చంద్ర‌బాబు నాయుడు జ‌న‌సేన‌కు న‌ల‌బై సీట్ల వ‌రకూ కేటాయించే అవ‌కాశం ఉండేద‌ని, ఇప్పుడు చంద్ర‌బాబుకు ధీమా పెరిగింద‌ని, దీంతో జ‌న‌సేన‌కు కేటాయింపులు త‌గ్గిపోవ‌చ్చ‌నే టాక్ న‌డుస్తూ ఉంది. ఇలాంటి టాక్ ను పుట్టించేది ప‌చ్చ‌వ‌ర్గాలే!

అందుకే అంటారు తెలుగుదేశం పార్టీతో పొత్తుతో, చంద్ర‌బాబుతో స్నేహంతో బాగుప‌డిన వారు చ‌రిత్ర‌లో లేర‌ని! మ‌రి ఇప్పుడు జ‌న‌సేన స్థాయిని తెలుగుదేశం వ‌ర్గాలే త‌మ ప్ర‌చారంతో త‌గ్గించేస్తూ ఉన్నారు. అదేమంటే అస‌లు జ‌న‌సేన‌తో పొత్తే వ‌ద్దంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయ‌ని, చంద్ర‌బాబే ప‌వ‌న్ పై ప్రేమ‌తో పొత్తుకు రెడీ అవుతున్నార‌నే టాక్ ను కూడా పుట్టించి న‌డిపిస్తున్నారు తెలుగుదేశం వాళ్లు! మ‌రి ఇలాంటి ప్ర‌చారాల‌కు చెక్ పెడుతూ తెలుగుదేశంతో పొత్తును ర‌ద్దు చేసుకునేంత సీన్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఎలాగూ లేదు. ఇదే టీడీపీ ధీమా!

ఆ సంగ‌త‌లా ఉంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు గ‌రిష్టంగా 20 సీట్ల వ‌ర‌కూ టీడీపీ కేటాయించే అవ‌కాశం ఉంద‌ని, అందులో కూడా దాదాపు చంద్ర‌బాబు చెప్పిన వారే అభ్య‌ర్థులుగా నిలిచే అవ‌కాశం ఉంద‌నేది ఇప్పుడు వినిపిస్తున్న మాట‌! జ‌న‌సేన ఎక్క‌డ పోటీ చేయాలి, ఆ పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు పోటీ చేయాల‌నేది పూర్తిగా చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లో జ‌ర‌గ‌బోతోంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎలాగూ ప‌వ‌న్ క‌ల్యాణ్ పూర్తిగా చంద్ర‌బాబు ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా న‌డుచుకుంటున్న‌ట్టుగా అభిప్రాయాలు క‌లుగుతూ ఉన్నాయి. మ‌రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఉప‌యోగించుకోవ‌డం తెలుసుకున్న చంద్ర‌బాబుకు జ‌న‌సేన త‌ర‌ఫున ఎవ‌రు పోటీ చేయాలో డిసైడ్ చేయ‌డం పెద్ద విష‌యం కాక‌పోవ‌చ్చు!

ఇప్ప‌టికే రాయల‌సీమ‌లో ఒక జ‌న‌సేన నేత‌కు చంద్ర‌బాబు నుంచి హామీ ల‌భించింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌ఫున పోటీకి రెడీగా ఉండాల‌ని.. పొత్తులో భాగంగా ఆ సీటు జ‌న‌సేన‌కు, జ‌న‌సేన త‌ర‌ఫున ఆయ‌న అభ్య‌ర్థిత్వానికి చంద్ర‌బాబు నుంచి హామీ ల‌భించిన‌ట్టుగా స‌మాచారం. స‌ద‌రు నేత గ‌తంలో తెలుగుదేశంలో క్రియాశీల‌కంగా ప‌ని చేసిన వ్య‌క్తే! తెలుగుదేశంలో ఒక చోటా మోటా లీడ‌ర్ ఒక‌ప్పుడు. ఆ త‌ర్వాత జ‌న‌సేన‌లో నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జి అయ్యారు. 

టీడీపీలో అంత‌ర్గ‌త సంబంధాలు బాగానే ఉన్న‌ట్టున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన టికెట్ విష‌యంలో చంద్ర‌బాబు నుంచి ఆయ‌న‌కు హామీ ల‌భించింద‌ట‌! దీంతో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టికే ప్ర‌చార ప‌నులు కూడా మొద‌లుపెట్టేసుకుంటున్నాడ‌ట‌.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?