తన పాదయాత్రతో నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడిగా పార్టీపై లోకేష్ వారసత్వ హక్కుల కోసం చాన్నాళ్ల నుంచినే పోరాడుతూ ఉన్నారు. ఇందుకు పోటీ ఎవ్వరూ లేకపోయినా.. తనను తాను నాయకుడిగా నిరూపించుకోవడమే లోకేష్ కు ఇప్పటి వరకూ సాధ్యం కాలేదు.
ఎలాగైనా నాయకుడు అయిపోవాలని ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యి, మంత్రి పదవి కూడా తీసేసుకున్నారు. తన తండ్రే సీఎం కావడంతో.. మంత్రి కావాలనే ఆయన కోరిక అట్టే తీరిపోయింది. అయితే ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యి మంత్రి పదవి తీసుకోవడమే లోకేష్ చేతగాని తనానికి నిదర్శనంగా మారింది.
రాజకీయ వారసుడు తన సత్తా నిరూపించుకోవాలంటే ముందుగా ప్రత్యక్ష ఎన్నికలతో సత్తా చూపాలి, కానీ లోకేష్ పరోక్ష మార్గాన్ని ఎంచుకోవడం ఆయనకే మైనస్ పాయింట్ అయ్యింది. మంత్రి అయితే అయ్యాడు కానీ, మాజీ అనిపించుకోవడానికి పెద్ద సమయమూ పట్టలేదు. ఇక తొలి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓటమి పాలవ్వడం మరో పెద్ద మైనస్ గా నిలిచింది.
మామూలు వాళ్లైతే ఇలాంటి రాజకీయ ఎదురుదెబ్బలతో జనాలకు మొహం చూపించుకోవడానికి కూడా వెనుకాడే వారు. అయితే లోకేష్ కు అలాంటి బేషజాలు ఏమీ లేవు! తన మాట వరసతో ఎప్పుడో కామెడీ అయిపోయినా, నామినేటెడ్ పదవితో మంత్రి పదవిని పొంది, ఎమ్మెల్యేగా తొలి సారి పోటీ చేసి ఓటమి పాలైనా.. ఇంకా తనను చూసి ప్రత్యర్థులు భయపడుతున్నారని చెప్పుకోవడం చంద్రబాబు పుత్రరత్నానికే చెల్లుతోంది!
సొంతంగా పార్టీ పెట్టి, భారీ మెజారిటీలతో నెగ్గి, 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్ మోహన్ రెడ్డి తనను చూసి భయపడుతున్నాడని కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన లోకేష్ చెప్పుకు తిరుగుతున్నారు. ఇలా మాట్లాడితే జనాలు నవ్వుతారు అనే జ్ఞానం లోకేష్ కు లేదు కాబోలు. అయితే ఆయనకు ఉన్న అహం ఎప్పుడో ఆయన జ్ఞానాన్ని అంధకారంలోకి తోసిందని స్పష్టం అవుతోంది.
ఇప్పుడు పాదయాత్ర పేరుతో రోడ్లు పట్టుకు తిరుగుతున్నా లోకేష్ నిలువెల్లా తన అహంకారాన్ని చూపిస్తూ ఉన్నారు. ఒరేయ్ జగన్ రెడ్డి, అరేయ్ జగన్ రెడ్డి అంటూ..ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలను ఏకవచనంతో సంబోదిస్తూ, వాడూ, వీడూ అంటూ వాగుతూ లోకేష్ ఇదే నాయకత్వం అనే భ్రమలో కొనసాగుతూ ఉన్నాడు.
పాదయాత్ర చేసే నేతల్లో ప్రజల పట్ల ఆర్తి కనిపించాలి కానీ, లోకేష్ లో మాత్రం అహంభావం అడుగడుగునా భయటపడుతూ ఉంది. అడ్డగోలుగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పడం, గోబెల్స్ రూటును ఫాలో కావడం నారా వారబ్బాయి అనుసరిస్తున్న వ్యూహాలు! ఇక మాట తీరు అయితే ఇప్పటికీ మెరుగుపడింది లేదు! 2019 రిపీటవుతుందంటాడు, విఫ్లవాలు అంటాడు.. ఇప్పటికీ నారా లోకేష్ నాలిక మందం మాత్రం తగ్గలేదు! ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉదికినా.. అన్నట్టుగా ఉంది వ్యవహారం.
మరి ఈ సంగతంతా ఇలా ఉంటే.. పాదయాత్ర ద్వారా లోకేష్ తెలుగుదేశం నాయకులకు, శ్రేణులకూ మాత్రం ఒకే సందేశాన్ని ఇచ్చారు. టీడీపీ హోల్ సేల్ గా తనదే అనే సందేశాన్ని లోకేష్ గట్టిగా ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగాలనుకుంటే తన నాయకత్వాన్ని ఆమోదించడం తప్ప మరో మార్గం లేదని తెలుగుదేశం పార్టీ నేతలకు, శ్రేణులకూ లోకేష్ స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తున్నాడు. తను తప్ప మరో మార్గం ఏమీ లేదని, మరో ఆశలు పెట్టుకోనే వద్దని లోకేష్ తన పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్యకు వెళ్లి మరీ చాటి చెప్పుకుంటున్నాడు.
ఇక తన తండ్రి చంద్రబాబును కూడా కాదు, కేవలం తనను ప్రసన్నం చేసుకుంటేనే తెలుగుదేశం పార్టీ టికెట్లు దక్కుతాయి తప్ప, ఇంకో మార్గం లేదని లోకేష్ తన పాదయాత్ర ద్వారా టీడీపీలో ఉండాలనుకునే వారికి పూర్తి స్పష్టతను ఇచ్చాడు. పాదయాత్రకు ముందు వరకూ కూడా చంద్రబాబు ను నమ్ముకుంటే చాలని టీడీపీలోని మాజీ ఎమ్మెల్యేలు, నేతలు అనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు కూడా చంద్రబాబు ప్రాపకం పొందితే చాలనుకున్నారు. లోకేష్ ను వారంత సీరియస్ గా తీసుకున్నది లేదు. ఆయనగారి నాయకత్వ పటిమ వారికి తెలిసిందే.
చంద్రబాబు అయితేనే తమను గట్టెక్కిస్తాడని టీడీపీలో చాలా మంది అనుకున్నారు. కనీసం వచ్చే ఎన్నికల వరకూ అయినా పార్టీలో చంద్రబాబు చెప్పిందే జరుగుతుందని భావించారు. అయితే అలాంటి వారికి లోకేష్ నుంచి ముందు నుంచి ఆటంకాలున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మంత్రుల చాంబర్లలో తన మనుషులను నియమించి, అక్కడ ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు సమాచారాలను తెప్పించుకున్న ఘనత లోకేష్ ది. చంద్రబాబు తనయుడు అనేదే తప్ప మరో నాయకత్వ లక్షణం లేని లోకేష్ అలా అప్పుడు నాయకుడు అయిపోయారు. అయితే పార్టీ చిత్తయ్యింది.
ఇలాంటి నేపథ్యంలో తనకు మరింత డ్యామేజ్ జరుగుతున్న వైనాన్ని లోకేష్ కవరేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాదయాత్ర అనేది తన బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే అంశం కాదని తెలిసినా లోకేష్ ఈ యాత్రకు వెళ్లింది కేవలం పార్టీపై పట్టును సంపాదించుకోవడానికి లాగుంది. ప్రజలు, కష్టాలు అనే టాపిక్ లోకేష్ యాత్రలో కాన్సెప్టే కాదు. తనే తెలుగుదేశం పార్టీకి దిక్కు అని స్పష్టంగా చెప్పడానికి లోకేష్ ఈ యాత్రను పెట్టుకున్నాడు. అదే చేస్తూ ఉన్నాడు. పలు చోట్ల అభ్యర్థులను కూడా ప్రకటించేస్తూ ఉన్నారు.
తనను తాను బలవంతంగా నాయకుడిగా తెలుగుదేశం పార్టీపై రుద్దుకుంటున్నారు లోకేష్. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. తను తండ్రి నీడ నుంచి బయటకు రావడం కాదు, తెలుగుదేశంలో చీమ చిటుక్కుమన్నా అది తన ఆదేశాల మీదే జరగాలనేంత స్థాయిలో ఉంది వ్యవహారం. ఒక వ్యాపారస్తుడి కొడుకు తమ ఆస్తులన్నీ ఎక్కడెక్కడున్నాయో చూసుకుని.. తనే ఇక నుంచి అంతా అని చెప్పుకున్నట్టుగా లోకేష్ ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల వద్దకు వెళ్లి పార్టీ తన సొంతం అనే సంకేతాలను ఇస్తున్నారు.
ఇంకా ఎవరో వస్తారని, లేదా చంద్రబాబు ను ప్రసన్నం చేసుకుంటే చాలదని, తను మాత్రమే తెలుగుదేశం పార్టీకి దిక్కు అని చంద్రబాబు తనయుడు పార్టీ క్యాడర్ కు, పార్టీలోని చిన్నా పెద్ద లీడర్లందరికీ స్పష్టంగా చెప్పకనే చెబుతున్నాడు.
లోకేష్ కనుసన్నల్లోనే వచ్చే ఎన్నికలను టీడీపీ ఎదుర్కొనాల్సి ఉండవచ్చు. పంతానికి వెళ్లి అయినా లోకేష్ తన ఇష్టానుసారమే పార్టీ అభ్యర్థులను డిసైడ్ చేసే అవకాశాలు లేకపోలేదు. అప్పట్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ద్వారా మంత్రి పదవిని పొందినట్టుగానే , ఇప్పుడు చంద్రబాబు తనయుడు అనే హోదాలో పార్టీని ప్రైవేట్ ప్రాపర్టీగానే లోకేష్ ట్రీట్ చేస్తున్నారు. మరి ఇందుకు పర్యవసనాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిదాయకమైన అంశం.