ఆ ఇద్ద‌రు కోవ‌ర్టుల‌పై 20 సీట్ల‌లో గెలుపు భారం!

బీజేపీలో వుంటూ టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం పని చేసే నేత‌లు బాగానే వున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో బీజేపీలోని ఆ ఇద్ద‌రు టీడీపీ కోవ‌ర్టుల‌పై చంద్ర‌బాబు పెద్ద భారాన్నే మోపారు.…

బీజేపీలో వుంటూ టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం పని చేసే నేత‌లు బాగానే వున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో బీజేపీలోని ఆ ఇద్ద‌రు టీడీపీ కోవ‌ర్టుల‌పై చంద్ర‌బాబు పెద్ద భారాన్నే మోపారు. మ‌నిష‌న్న వారెవ‌రికైనా ర‌క్తం ఎర్ర‌గా వుంటుంది. కానీ ఆ ఇద్ద‌రు నేత‌ల‌కు కోస్తే ర‌క్తం ప‌సుపు రంగులో వుంటుంద‌నే వ్యంగ్య కామెంట్స్ ఉన్నాయి. అంత‌టి టీడీపీ భ‌క్తులు సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగియ‌గానే బీజేపీలో చేరారు.

పైగా ఆ ఇద్ద‌రూ రాజ్య‌స‌భ స‌భ్యులు కూడా. ఒక‌రేమో ప‌దవీ కాలాన్ని పూర్తి చేసుకోగా, మ‌రొక‌రు ఇంకా కొన‌సాగుతున్నారు. రాజ‌ధానిని అమ‌రావ‌తి నుంచి ఇంచు కూడా క‌ద‌ల‌నివ్వ‌మ‌ని త‌ర‌చూ ఆ మాజీ ఎంపీ అంటుంటారు. మ‌రొక రాజ్య‌స‌భ స‌భ్యుడు త‌ర‌చూ జ‌గ‌న్ పాల‌న‌ను కేంద్ర ప్ర‌భుత్వం క్షుణ్ణంగా ప‌రిశీలిస్తోంద‌ని, త‌గిన స‌మ‌యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని హెచ్చ‌రిస్తుంటారు.

ఈ నేప‌థ్యంలో ఆ ఇద్ద‌రు నేత‌లు టీడీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యే అభ్య‌ర్థుల గెలుపు బాధ్య‌త‌ల్ని తీసుకున్న‌ట్టు తెలిసింది. తాజాగా స‌ద‌రు ఎంపీ సోద‌రుడు శ‌నివారం హైద‌రాబాద్‌లో చంద్ర‌బాబునాయుడిని క‌ల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు టికెట్ త‌న‌కే అంటూ…ఈ 20 సీట్ల‌లో గెలుపు బాధ్య‌త‌ల్ని త‌న సోద‌రుడితో పాటు మ‌రో మాజీ ఎంపీకి అప్ప‌గించిన‌ట్టు ఆ నాయుడు గారు క‌థ‌లుక‌థలుగా చెబుతున్నారు.

దీంతో ప్రొద్దుటూరు టీడీపీ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. మొద‌టి నుంచి పార్టీ కోసం క‌ష్ట‌ప‌డుతూ, కేసులు పెట్టించుకోవ‌డంతో పాటు జైలుకు వెళ్లి వ‌చ్చిన త‌న‌కు టికెట్‌పై లోకేశ్ భ‌రోసా ఇచ్చార‌ని ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ ఉక్కు ప్ర‌వీణ్ అంటున్నారు. మ‌రోవైపు ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గంలో సీనియ‌ర్ రాజ‌కీయ నేత అయిన త‌న‌కు  టికెట్ ఇస్తేనే గెలుపు అవ‌కాశాలు వుంటాయ‌ని వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి చెబుతున్నారు.

తాజాగా ఓ ఎంపీ సోద‌రుడు చంద్ర‌బాబును క‌లిసి టికెట్ త‌న‌కే అని ప్ర‌చారం చేసుకంటున్నారు. బీజేపీలో వుంటున్న టీడీపీకి చెందిన ఆ నాయ‌కులిద్ద‌రూ తీసుకుంటున్న 20 సీట్ల‌లో ప్రొద్దుటూరు కూడా ఉంద‌నే ప్ర‌చారాన్ని తెర‌పైకి తేవ‌డం విశేషం. 20 సీట్ల‌లో త‌మ‌కు కావాల్సిన అభ్య‌ర్థుల‌కు టికెట్లు ఇప్పించుకోవ‌డంతో పాటు  ఎన‌నిక‌ల ఖ‌ర్చంతా తామే పెట్టుకుంటామ‌ని చంద్ర‌బాబుతో ఒప్పందం చేసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. చంద్ర‌బాబు వైఖ‌రి తెలిసిన వారైవ‌రైనా ఈ ప్ర‌చారాన్ని కొట్టి పారేయ‌లేని ప‌రిస్థితి.