మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు, తాజాగా వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్ట్, రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పులివెందులలో వైసీపీ బాధ్యతల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎవరికి అప్పగిస్తారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇంతకాలం పులివెందుల నియోజకవర్గ బాధ్యతల్ని వైఎస్ భాస్కర్‌రెడ్డి చూస్తూ వచ్చారు. అలాగే కడప జిల్లా వైసీపీ బాధ్యతల్ని వైఎస్ అవినాష్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
రానున్నది ఎన్నికల సీజన్ కావడం, అలాగే ఇతరేతర కారణాల రీత్యా వైసీపీ బాధ్యతలపై కడప జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా వైఎస్ ప్రకాశ్‌రెడ్డి కుటుంబంపై అందరి దృష్టి పడింది. ఈయన వైఎస్ భాస్కర్‌రెడ్డికి స్వయాన అన్న. పారిశ్రామిక వేత్తగా సుపరిచితుడు. వివాద రహితుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందారు. అలాగే వైఎస్ జగన్ పులివెందులకు ఎప్పుడొచ్చినా తప్పనిసరిగా వైఎస్ ప్రకాశ్‌రెడ్డి ఇంటికి వెళ్తారు.
వైఎస్ ప్రకాశ్‌రెడ్డి తనయుడు వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం తొండూరు వైసీపీ బాధ్యతల్ని చూస్తున్నారు. వైఎస్ మదన్ కుమారుడు డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి గత ఎన్నికల్లో కడప జిల్లాలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈయన వైసీపీ డాక్టర్స్ విభాగంలో రాష్ట్ర పదవిలో కొనసాగుతున్నారు. అలాగే వృత్తిరీత్యా ప్రస్తుతం విశాఖలో వుంటున్నారు. డాక్టర్ అభిషేక్ భార్య కూడా గైనకాలజిస్ట్.
తాజా పరిస్థితుల దృష్ట్యా యువకుడైన డాక్టర్ అభిషేక్‌కు పులివెందుల బాధ్యతల్ని అప్పగించొచ్చనే ప్రచారం జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో డాక్టర్ అభిషేక్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా కలుపుగోలుతనం, ప్రజలతో మమేకం అయ్యే విధానం, సమస్యల్ని ఓపికగా వినడం, వాటి పరిష్కారానికి చూపే చొరవే పులివెందుల వైసీపీ బాధ్యతల్ని అప్పగించడానికి కారణాలవుతాయనే టాక్ వినిపిస్తోంది.
డాక్టర్ అభిషేక్‌కు కీలక బాధ్యతల్ని అప్పగించడం ద్వారా పులివెందులలో నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు అవుతుందనే చర్చ నడుస్తోంది. త్వరలో పులివెందుల రాజకీయ తెరపై కొత్త యువ నాయకత్వం రెపరెపలాడే అవకాశాలున్నాయి.