వైఎస్ వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యులే ఆరోపణలు ఎదుర్కోవడం వైసీపీకి ఇబ్బందికర పరిస్థితే. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఈ అంశం తీవ్రంగా చికాకు పెడుతోంది. వివేకా హత్య కారణంగా వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయింది. తన తండ్రిని వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఆయన తనయుడు , కడప ఎంపీ అవినాష్‌రెడ్డి హత్య చేయించారంటూ వైఎస్ వివేకా తనయ డాక్టర్ సునీత గట్టిగా వాదిస్తున్నారు.
డాక్టర్‌కు సునీతకు నేరుగా మద్దతు తెలిపే వాళ్లెవరనేది కుటుంబ సభ్యులు పైకి కనిపించడం లేదు. కానీ ఆమెకు నైతిక మద్దతు బాగా ఉంది. మరోవైపు వైఎస్ జగన్‌కు వివేకా సొంత చిన్నాన్న కావడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ఇటు భార్య తరపు కూడా దగ్గరి బంధుత్వం వుంది. దీంతో వైఎస్ జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ అంశంపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. వైఎస్ వివేకా హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పుకొచ్చారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని తేల్చి చెప్పారు. సీఎం జగనే కేసును సీబీఐకి ఇవ్వమన్నారని మంత్రి చెప్పడం సంచలనం రేకెత్తిస్తోంది. దోషులు బయటికి రావాల్సిందే అని మంత్రి పేర్కొనడం చర్చనీయాంశమైంది. మొదట్లో కేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేయడం తెలిసిందే.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ దర్యాప్తుపై జగన్ అభిప్రాయం మారింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ గతంలో దాఖలు చేసిన పిటిషన్ సైతం సీఎం జగన్ వెనక్కి తీసుకున్నారు. కానీ డాక్టర్ సునీత పట్టుపట్టి న్యాయపోరాటం చేసి సీబీఐ దర్యాప్తు చేపట్టేలా అనుకున్నది సాధించారు. ఆ తర్వాత దర్యాప్తు నెమ్మదించినప్పటికీ, సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో మళ్లీ వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో వరుస అరెస్టులు చోటు చేసుకోవడం తెలిసిందే. జగనే సీబీఐ విచారణ కోరుకున్నారన్న మంత్రి మాటలపై సెటైర్స్ పేలుతున్నాయి. మంత్రి జోకులేస్తున్నారని నెటిజన్లు ఆడుకుంటున్నారు.