కరోనా సెకెండ్ వేవ్ లో జరిగిన ఘోరాల గురించి అందరికీ తెలిసిందే. మృతదేహాన్ని ఇంటికి కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు. దీంతో ఎన్నో మృతదేహాల అడ్రెస్సులు కూడా మారిన ఘటనలు జరిగాయి. ఒక కుటుంబానికి చెందిన మృతదేహానికి మరో కుటుంబం అంత్యక్రియలు నిర్వహించడం లాంటివి చూశాం. ఇది కూడా అలాంటిదే.
మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాకు చెందిన కమలేష్ అనే వ్యక్తి కరోనా సెకెండ్ వేవ్ లో మరణించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపిన అధికారులు, అప్పటి నిబంధనల ప్రకారం మృతదేహాన్ని కుటుంబానికి అందించలేదు. తామే అంత్యక్రియలు నిర్వహించారు.
కట్ చేస్తే, రెండేళ్ల తర్వాత కమలేష్ ప్రత్యక్షమయ్యాడు. ఇంటికొచ్చి తలుపుతట్టాడు. కమలేష్ ను చూసిన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. వెంటనే ఈ సమాచారాన్ని అధికారులకు తెలిపారు.
రంగంలోకి దిగిన అధికారులు కమలేష్ ను విచారించారు. తను అహ్మదాబాద్ కు చెందిన ఓ స్మగ్లర్ గ్యాంగ్ కు దొరికానని కమలేష్ వెల్లడించాడు. వాళ్లు తనకు ప్రతిరోజూ మత్తు మందు ఇచ్చారని, అలా రెండేళ్లు గడిచిపోయాయని తెలిపాడు.
ప్రస్తుతం ఈ అంశంపై ఇంకాస్త లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. అటు కుటుంబ సభ్యులు మాత్రం చనిపోయాడనుకున్న కమలేష్ వెనక్కిరావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.