పవన్ కల్యాణ్ పార్టీకి ఉంది ఒకే ఒక్క ఎమ్మెల్యే.. ఆయన కూడా వైసీపీ గేటు ఎప్పుడు తీస్తారా అని ఎదురు చూస్తున్న బాపతు. ఇటువైపు సీఎం జగన్ కి తనతో సహా 151ఎమ్మెల్యేల బలం ఉంది. మరి పవన్ ని చూసి జగన్ జడుసుకుంటారా? పవన్ కల్యాణ్ జనంలోకి వస్తున్నారంటే భయపడి నిర్ణయాలు తీసుకుంటారా..? ఏమో జనసేన మాత్రం అదే ఫీలవుతోంది. తన ఫీలింగ్ ను రాజధాని రైతుల ముసుగులో జనంపైకి వదులుతోంది. పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటన అని ప్రకటించగానే భయపడి వైఎస్ జగన్ రాజధానికి పొలాలను ఇచ్చినవారికి కౌలు బకాయిలు 182కోట్లు విడుదల చేశారట. ఈ కామెడీని ప్రచారం చేసుకుంటూ నవ్వులపాలవుతోంది జనసేన. దీన్ని జనసేన విజయంగా ప్రొజెక్ట్ చేసుకుంటోంది.
రాజధాని కౌలు సొమ్ము గత ప్రభుత్వాల కంటే ముందుగానే విడుదల చేసి జగన్ తన మంచిమనసు చాటుకున్నారు. అసలు కౌలు డబ్బు ఆగిపోయిందని, ఆపేశారని వైసీపీనేతలెవరూ చెప్పలేదు, రాజధాని రైతులు కూడా తమకు ఏటా వచ్చే కౌలు ఈ ఏడాది ఆగిపోయిందని ఎక్కడా విమర్శించలేదు. అది కేవలం యెల్లో బ్యాచ్ దుష్ప్రచారం మాత్రమే. అలాంటి పసలేని మాటల్ని నమ్మి పవన్ కల్యాణ్ పర్యటన పెట్టుకోవడం ఏంటి? ఆ పర్యటనకు భయపడి జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారనే వార్తలు రావడం ఏంటి?
అసలు ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్లే పవన్ కల్యాణ్ తనని తాను ఎక్కువగా ఊహించుకున్నారు, ఊహించుకుంటున్నారు. మాటకు ముందు అరుపులు, చప్పట్లతో తన సభలన్నీ హోరెత్తిపోయే సరికి ఓట్లు గలగలా రాలతాయనే ఉద్దేశంతో రెండుచోట్లా పోటీ చేసి బొక్కబోర్లా పడ్డారు. తీరా ఇప్పుడు కూడా ఆయనకు జ్ఞానోదయం కలగకపోతే ఎవరిది తప్పు. నువ్వు తోపు, నువ్వు తురుము.. నీకు ముఖ్యమంత్రి కూడా భయపడిపోతున్నాడంటూ.. చుట్టూ ఉన్నవారు ఆకాశానికి ఎత్తేయడం వల్లే పవన్ ఇంకా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారలేకపోతున్నారు.
నిజానికి ఏ కార్యక్రమం ఎప్పుడు అమల్లోకి తీసుకురావాలి, ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిధుల్ని ఏ నెల దేనికి విడుదల చేయాలనే అంశంపై పూర్తి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు ముఖ్యమంత్రి. దీనిపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. ఉదాహరణకు రైతుభరోసా పథకాన్నే తీసుకుందాం. ఇది అక్టోబర్ 15న ప్రారంభం అవుతుంది. అగ్రిగోల్డ్ బాధితులకు ఈ నెలాఖరు నుంచి చెల్లింపులు చేయబోతున్నారు. ఈ నెలాఖరు నుంచి ఆటో, టాక్సీ డ్రైవర్లకు 10వేల భృతి అందించబోతున్నారు. జనవరి 26న అమ్మఒడి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి చివరివారంలో వైఎస్ఆర్ పెళ్లికానుక మొదలవుతుంది.
ఇలా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దశలవారీగా నిధుల్ని విడుదల చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో కౌలు బకాయిలు కూడా ఇందులో భాగంగానే విడుదలయ్యాయి. ఈ మాత్రం దానికే జనసైనికులు నానా హంగామా చేస్తున్నారు. పవన్ ను మునగచెట్టు ఎక్కిస్తున్నారు. రేపు అమ్మఒడి, రైతుభరోసా, పెళ్లికానుక కార్యక్రమాల ముందు కూడా ఇలానే పర్యటనలు చేసి అది పవన్ గొప్పదనం అని చెప్పుకుంటారేమో. ఇకనైనా జనసైనికులు తమ అజ్ఞానాన్ని వీడితే మంచిది. ఎందుకంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మరి.