అమరావతిలో రాజధాని ఉంటుందా? ఉండదా? అనేది ఇప్పటికీ ఒక బ్రహ్మపదార్థంగానే ఉంది. సీఆర్డీయే సమీక్ష తర్వాత, మంత్రి బొత్స సత్యనారాయణ విలేకర్ల సమావేశం పెట్టారు గానీ.. రాష్ట్ర ప్రజల్లో వాస్తవంగా ఏ ఆందోళన అయితే నెలకొని ఉన్నదో, దానికి సంబంధించి నామమాత్రపు క్లారిటీ కూడా ఇవ్వకుండా.. ఆయన దానిని ముగించారు. ‘ఉంటుందా ఉండదా’ అని విలేకర్లు బిగ్గరగా అడుగుతూ ఉండగానే.. ఆయన ప్రెస్ మీట్ ముగించి వెళ్లిపోయారు.
అయితే ఇప్పుడు పరిణామాలను గమనిస్తోంటే.. రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలంలోని వెంకటాయపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానాల వారి ఆధ్వర్యంలో చేపట్టిన వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం అనేది రాజధాని ఉంటుందా పోతుందా అనే మీమాంసకు ఒక సూచిక అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
రాజధాని తరలిపోతున్నదనే వివాదం రెండు వారాల నుంచి నడుస్తుండగా.. జగన్ 29న నిర్వహించిన సీఆర్డీయే సమావేశం ముగిసేసరికి క్లారిటీ వస్తుందని, అధికారిక ప్రకటన వస్తుందని అంతా ఆశించారు. ప్రకటన బొత్స నోటమ్మట వచ్చిందిగానీ… ఆశించిన స్పష్టత మాత్రం రాలేదు. రాజధాని తరలిస్తామని ఎవరు చెప్పారు? వారినే అడగండి! అంటూ బొత్స సందేహాలను వదలిపెట్టారు. నిధులు లేక పనులు నిలిచి ఉన్నాయని అన్నారు.
అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆలయాన్ని ఎందుకు ఆపినట్లు. ఆరుదశల్లో 150 కోట్లతో క ట్టదలచుకున్న ఆలయాన్ని 36 కోట్ల పనులు మాిత్రం పూర్తిచేస్తామని.. అంతరాలయం కట్టి ఆపేస్తామని, అసలు నిర్ణయం తర్వాత తీసుకుంటామని ఎందుకు అంటున్నట్లు? ప్రజలకు అర్థం కావడం లేదు. ప్రస్తుతానికి పూర్తిబోర్డు నియామకం జరిగిన తర్వాత.. మిగిలిన పనుల విషయం తేలుస్తామని అంటున్నారు.
నిధులకొరత ఏమాత్రం లేని టీటీడీ.. వెంకటాయపాలెంలో వేంకటేశ్వరుని ఆలయనిర్మాణాన్ని యథాతథంగా కొనసాగిస్తే.. రాజధాని అక్కడే ఉంటుందని లెక్క. అంతరాలయంతోనే శ్రీవారి ఆలయానికి మంగళం పాడితే గనుక.. రాజధానిని తరలించే ఉద్దేశం ఉన్నట్లు లెక్క!