రాజధానిని తరలిస్తే.. భూములిచ్చిన రైతుల్ని వంచించినట్టే అన్నారు కొంతమంది, దొనకొండలో వైసీపీ వాళ్లు భూములు కొన్నారని అందుకే కేపిటల్ సిటీ మారుస్తున్నారని చీప్ కామెంట్స్ చేశారు ఇంకొంతమంది. ఇప్పటికే వెచ్చించిన వేల కోట్ల రూపాయల్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తారా అని అరిచారు మరికొంతమంది. తాజాగా మరో వాదన తెరపైకి వచ్చింది. కాదు కాదు తెరపైకి తెచ్చారు.
కాషాయదళం కొత్తపల్లవి అందుకుంది. రాజధానికి మతం రంగు పులిమింది, హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ గగ్గోలు పెడుతోంది. సాధువులతో శాపనార్థాలు పెట్టిస్తోంది. ఎన్నికల ముందు టీడీపీకి కొమ్ముకాచి, ఎన్నికల తర్వాత బీజేపీ నుంచి ఆర్థిక సాయం పొందుతోన్న ఓ టీవీ చానెల్ ఈ చర్చ అనబడే రచ్చను స్టార్ట్ చేసింది. శాస్త్రోక్తంగా పూజలు చేసి, అష్ట దిగ్బంధనం చేసి అమరావతి పట్టణానికి బీజం వేస్తే.. ఇప్పుడు రాజధాని మార్చాలనుకోవడం దుస్సాహసం అంటున్నారు కొంతమంది సాధువులు.
గ్రామదేవతల ఆశీస్సులతో.. రాష్ట్రం నలుమూలల నుంచి మంత్రించి తెచ్చిన మట్టి, నీటితో రాజధానికి అంకురార్పణ జరిగిందని, ప్రధాని మోదీ కూడా ఇలానే సెంటిమెంట్ తో గంగా జలాన్ని తెచ్చారని.. ఇలాంటి శక్తులన్నీ ఉన్నాయి కాబట్టి రాజధాని తరలించడం అసాధ్యమని చెబుతున్నారు. ఒకవేళ తరలించాలని చూసిన వాళ్లు మట్టిగొట్టుకు పోతారని, జీవితంలో బాగు పడరని శాపనార్థాలు పెడుతున్నారు. ఇలా హిందూ మతం పేరు చెప్పి జగన్ పై ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి దిగారు.
ఓవైపు రాజధాని గురించి వైసీపీ పూర్తి క్లారిటీ ఇచ్చినా కూడా రోజు రోజుకీ ఈ అంశంపై గొడవ ముదురుతోంది. రాజధాని పేరు చెబితే చాలు ఈ రోజుల్లో ఫుల్ పబ్లిసిటీ. అందుకే సాధువులు కూడా రంగంలోకి దిగి జగన్ పై ఎగిరెగిరి పడుతున్నారు. హిందూ మనోభావాలు అంటూ లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ల ఆలోచనల్ని బట్టి చూస్తే అమరావతి కేవలం హిందువులకే రాజధాని అనుకోవాలా..? ఈ ఆరోపణల వెనక ఉన్న బీజేపీకి అమరావతి హిందువుల రాజధాని అని చెప్పే దమ్ముందా?
ఇలాంటి చీప్ ట్రిక్స్.. ఉత్తరాదిలో వర్కవుట్ అవుతాయేమో కానీ, దక్షిణాదిలో బీజేపీ మాటల్ని నమ్మేవారు ఎవరూ లేరు. ఇలాంటి రాజకీయాలకు లొంగేవారు లేరు. రాజధాని గురించి లాజికల్ గా మాట్లాడితే ఎవరైనా వింటారు కానీ, ఇలా మతం పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే.. అది వారికే నష్టం.