జగన్ ప్రభుత్వం అవినీతిని అరికట్టడానికి, ప్రభుత్వానికి వీలైనంత లాభం చేకూర్చడానికి కొత్తగా తీసుకువచ్చిన రివర్స్ టెండర్ల విధానం ద్వారా తొలి టెండరును ప్రకటించారు. పోలవరం డ్యాం లోనే ఒక టన్నెల్ నిర్మాణానికి సంబంధించి 274 కోట్ల రూపాయలకు టెండరు వచ్చింది. దీనికి సంబంధించి బిడ్లను ఈనెల 16వరకు స్వీకరిస్తారు. 17న రివర్స్ టెండరింగ్‌ను నిర్వహిస్తారు. రివర్స్ టెండర్లు అనే ప్రక్రియలో చేపడుతున్న తొలి టెండరు ఇది.
ఇంతకూ రివర్స్ టెండరు అంటే ఏమిటి?
టెండరు విధానంలో.. ప్రభుత్వం నిర్ణయించిన అంచనా ధరకంటె కనిష్టంగా కోట్ చేసిన కాంట్రాక్టరుకు పని కేటాయిస్తారు. ఒక్కసారికే కేటాయింపు పూర్తయిపోతుంది. రివర్సు టెండరు విధానంలో అలా కాదు. ఒకసారి ఎల్ 1 (కనిష్ట కోట్) ఎంతో తేలిన తర్వాత.. మిగిలిన కాంట్రాక్టర్లు మళ్లీ టెండరులో భాగం కావడానికి అవకాశం ఉంటుంది. అంటే టెండర్లు తెరిచినప్పుడు తేలిన్ ఎల్1 మొత్తం కంటె తక్కువకు తాము చేయగలమని ప్రతిపాదించచ్చు. దీనిని వేలం పాటలాగా ఆన్ లైన్ లో నిర్వహిస్తుంటారు.
బ్యాంకు గ్యారంటీలు సమర్పించి టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు మాత్రమే ఈ రివర్స్ టెండరింగ్ లో పాల్గొనాలి. టెండర్లు తెలిచిన తర్వాత తేలిన ఎల్ 1 ధరకు తాము చేయలేం అని భావించిన వాళ్లు అప్పుడే వైదొలగవచ్చు. అంతకంటె తక్కువకు చేయగలం అనుకునేవారు మాత్రం.. ఆన్ లైన్ తమ కొత్త రేటును ప్రతిపాదించాల్సి ఉంటుంది.
ఎల్ 1 గా తేలిన మొత్తానికి కనీసం .5 శాతం కంటె ఎక్కువ తేడాతో మాత్రమే పాడవలసి (కోట్ చేయవలసి)ఉంటుంది. దీనివలన.. ఒకసారి టెండర్లు తెరిచిన తర్వాత.. ఎల్ 1 గా కోట్ అయిన కనిష్ట ధరకంటె మరింత తక్కువకు పనులు పూర్తి చేయగల అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది. ఇలా వేలంపాటలాగా సాగుతూ ఉండగా.. కనీసం 15 నిమిషాల పాటూ ఎవరూ బిడ్ లో పాల్గొనకుండా ఉంటే.. అక్కడితో ప్రక్రియ ముగిసినట్లు ప్రకటించి.. అప్పటికి ఎల్ 1గా ఉన్నవారికి కేటాయిస్తారు.
ఆ తర్వాత ఒప్పందం చేసుకుని పనులు అప్పగిస్తారు. ఎటు చూసినా రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది.