జేసీకి బిగిస్తున్న ఉచ్చు

జేసీ ట్రావెల్స్ కేవ‌లం ప్ర‌యాణికుల‌నే కాదు అవినీతిని కూడా ర‌వాణా చేసింది. న్యాయ‌స్థానంలో మ‌రోసారి జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్‌రెడ్డిల‌కు చుక్కెదురైంది. జేసీ ట్రావెల్స్ ఫోర్జ‌రీ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

జేసీ ట్రావెల్స్ కేవ‌లం ప్ర‌యాణికుల‌నే కాదు అవినీతిని కూడా ర‌వాణా చేసింది. న్యాయ‌స్థానంలో మ‌రోసారి జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్‌రెడ్డిల‌కు చుక్కెదురైంది. జేసీ ట్రావెల్స్ ఫోర్జ‌రీ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్‌రెడ్డి గ‌త నెల‌లో అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం తండ్రీకొడుకు క‌డ‌ప సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు.

బెయిల్ పిటిష‌న్ల‌ను న్యాయ‌స్థానం సోమ‌వారం తిర‌స్క‌రించింది. వారిద్ద‌రి రిమాండ్‌ను ఈ నెల 27వ తేదీ వ‌ర‌కు న్యాయ‌స్థానం పొడిగించింది. వీరితో పాటు ప్ర‌భాక‌ర్‌రెడ్డి అనుచ‌రుడు, ఈ కేసులో కీల‌క నిందితుడైన చ‌వ్వా గోపాల్‌రెడ్డి బెయిల్ పిటిష‌న్‌ను కూడా న్యాయ‌మూర్తి తిర‌స్క‌రించారు.

కాగా ట్రావెల్స్ కుంభ‌కోణంలో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్‌రెడ్డికి సంబంధించి బ‌ల‌మైన సాక్ష్యాలు ఉండ‌డం వ‌ల్లే బెయిల్ దొర‌క‌లేద‌నే వాద‌న వినిపిస్తోంది. కేసు విచార‌ణ‌లో భాగంగా జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న అనుచ‌రుడు చ‌వ్వా గోపాల్‌రెడ్డి కీల‌క అంశాలు వెల్ల‌డించార‌ని స‌మాచారం. ఆ స‌మాచారం కేసులో వీరి పాత్ర‌ను మ‌రింత నిర్ధార‌ణ చేసేట్టుగా ఉంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

నేర అంగీకార ప‌త్రంలో ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌న నేరాన్ని అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. స్క్రాప్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం  చెన్నైకి చెందిన ముత్తుకుమార్‌ను తాను సంప్రదించిన‌ట్టు ప్ర‌భాక‌ర్‌రెడ్డి అంగీక‌రించార‌ని స‌మాచారం. అలాగే నాగాలాండ్‌ ఆర్టీఏ బ్రోకర్‌ సంజయ్‌ ద్వారా  అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించిన‌ట్టు కూడా ఒప్పుకున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. నాగాలాండ్‌కు వాహ‌నాల‌ను తీసుకెళ్లకుండానే అక్కడ మొత్తం 154 వాహనాల రిజిస్ట్రేషన్‌ చేయించిన‌ట్టు నేర అంగీకార ప‌త్రంలో పేర్కొన్న‌ట్టు తెలిసింది.

బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌-4గా నమోదు చేయించడం వెనుక జ‌రిగిన త‌తంగాన్ని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న అనుచ‌రుడు గోపాల్‌రెడ్డి పోలీసుల‌కు పూస‌గుచ్చి చెప్పిన‌ట్టు తెలిసింది.  ఇందుకోసం ముత్తుకుమార్‌, సంజయ్‌లకు  భారీగా డబ్బు ముట్ట‌చెప్పిన‌ట్టు కూడా అంగీక‌రించార‌ని తెలిసింది. అంతేకాదు,  త‌న అనుచరుడు నాగేంద్ర నకిలీ పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు తయారు చేయ‌డం, వాటితోనే ఎన్‌ఓసీ తీసకున్న విష‌యాల‌ను కూడా జేసీ పోలీసుల ఎదుట అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం.

ఫోర్జరీ  పత్రాలతో తెలంగాణ, కర్ణాటకలలో 8 వోల్వో బస్సులు, లారీలు విక్రయించిన విష‌యం పోలీసుల విచార‌ణ‌లో మొత్తం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.  ఏది ఏమైనా జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి నేర‌మంతా అంగీక‌రిస్తూ…త‌న‌కేం సంబంధం లేద‌ని చెప్ప‌డం కొస‌మెరుపుగా ప్ర‌చార‌మ‌వుతోంది. మొత్తానికి పోలీసుల విచార‌ణ‌లో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్‌రెడ్డి, అనుచ‌రుడు గోపాల్‌రెడ్డి చెప్పిన కీల‌క స‌మాచారం….పోలీసుల ద‌ర్యాప్తులో సేక‌రించిన ఆధారాలు స‌రిపోయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో జేసీ, ఆయ‌న కుమారుడు, అనుచ‌రుడికి మ‌రింత ఉచ్చు బిగించేలా ఉంద‌ని పోలీసు వ‌ర్గాల ద్వారా అందుతున్న స‌మాచారం.