వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి మాజీ ఎంపీ, తెలుగుదేశం నేత జేసీ దివాకర్ రెడ్డి చాలా కదిలిపోయి స్పందించేశారు పాపం! జగన్ తనే రాజు, తనే మంత్రి అన్నట్టుగా పాలిస్తూ ఉన్నారని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ ఒక నియంతలా పాలిస్తున్నారనేది జేసీ దివాకర్ రెడ్డి భావం కాబోలు. ఇలా దివాకర్ రెడ్డి ప్రజాస్వామ్య విలువల గురించి ప్రవచించినట్టుగా ఉన్నారు. బహుశా దివాకర్ రెడ్డి లాంటి వాళ్లు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటానికి మించిన తమాషా లేదు. తాడిపత్రి నియోజకవర్గంలో అయితేనేం, అనంతపురం ఎంపీగా ఉన్న సమయంలో అయితేనేం.. దివాకర్ రెడ్డి, ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డిలు అనేక సార్లు అప్రజాస్వామ్యకమైన పోకడలతో వార్తల్లోకి వచ్చిన వైనాలు చెరిపేస్తే చెరిగిపోయేవి కావు!
అధికారం చేతిలో ఉన్నన్నాళ్లూ ఎవ్వరినీ లెక్క చేయనట్టుగా, ఎవరి విషయంలో అయినా ఇష్టానుసారం మాట్లాడటం, ప్రభుత్వాధికారుల మీద, సహచర రాజకీయ నేతల మీద చిందులు తొక్కడం, వారిని ఉద్ధేశించి బూతులు తిట్టడం.. ఇవన్నీ జేసీ సోదరుల రాజకీయంలో చెరిగిపోని వ్యవహారాలే. ప్రభుత్వాధికారులను ఆఫీసులకు వెళ్లి దూషించిన చరిత్రా
ఉంది ఈ అన్నదమ్ములకు. వీళ్లు ఉన్న పార్టీల్లో వీళ్లకు నచ్చని రాజకీయ నేతలను ఉద్దేశించి వీరు చేసిన వ్యాఖ్యానాలూ వీడియో రికార్డులకూ ఎక్కాయి.
ఇక సాక్షి పత్రికలో తమకు వ్యతిరేకంగా ఏదో కథనం వచ్చిందని, ఆ పత్రికాఫీసు ముందు టెంటు వేసుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలూ ఎవరూ మరిచిపోయేవి కావు. థర్డ్ క్లాస్ జనాలు కూడా ఆ మాటలు మాట్లాడటానికి వెనుకాడతారు. ఎదురుగా కెమెరాలు ఉన్నాయి, తనో ఎమ్మెల్యేను తను ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేతను ఉద్ధేశించి మాట్లాడుతున్నట్టు అనే విషయాన్ని మరిచిపోయినట్టుగా అప్పట్లో ప్రభాకర్ రెడ్డి నీఛమైన మాటలు మాట్లాడారు.
ఇక జేసీ సోదరుల విషయంలో ఉన్న ఆరోపణలకూ కొదవలేదు. వీరి అప్రజాస్వామ్యక పోకడల గురించి అనేక మంది గగ్గోలు పెట్టారు. మూడు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎన్నో రచ్చలున్నాయి. కనీసం తమ ఇంటికి ఎవరైనా వస్తే తమ ఎదురుగా కూర్చోనివ్వరు అనేంత పేరును మూటగట్టుకున్నారు జేసీ సోదరులు! తమకు ఎదురులేదనే భావనతో ఈ అన్నదమ్ములు సొంత చోటే రాజకీయంగా చిత్తయ్యారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇంత చరిత్రను కలిగిన జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు ప్రజాస్వామ్యం-రాజు- మంత్రి అంటూ మాట్లాడటం పట్ల సామాన్యులు ఆశ్చర్యపోతూ ఉన్నారు.
అధికారం లేకపోయే సరికి దివాకర్ రెడ్డి నుంచి కొత్త తరహా మాటలు వస్తున్నాయని, చివరకు ఆయన కూడా ప్రజాస్వామ్య విలువలు అంటూ మాట్లాడటం యమ కామెడీగా ఉందని, అదేదో సినిమాలో ఒక డైలాగు ఉంటుంది. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువల గురించి మాట్లాడటం అన్నట్టుగా ఉంది జేసీ వ్యవహారం అని సామాన్యులు చర్చించుకుంటున్నారు.