ఆయన ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. అంటే సైకిల్ పార్టీలో ఆరవ వేలు లాంటి వారన్నమాట. చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు. ఆయన గారి పుత్ర రత్నం లోకేష్ నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇక ఏపీకి కళాని ప్రెసిడెంట్ చేశారు.
జాతీయ స్థాయి ఏమో కానీ, తిప్పి కొడితే పదమూడు జిల్లాల్లోనే టీడీపీ ఉంది. నిన్నటి ఎన్నికల్లో అది కూడా లేకుండా పోయింది. రాయలసీమ మొత్తం పసుపు పార్టీ ఖాళీ అయింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చీకటి తప్ప వెలుగు లేదు. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా తుక్కు తుక్కు అయ్యాయి.
జాతీయ పార్టీ అధినేత చంద్రబాబుకే ఇపుడు పెద్దగా పార్టీ పని లేకుండా పోయింది. అందుకే ఆయన జిల్లాల టూర్లు పెట్టుకుంటున్నారు. ఒక్కో జిల్లాలో మూడేసి రోజులు గడిపినా దాదాపుగా ఈ టూర్లు కూడా అయిపోవస్తున్నాయి.
చిత్రమేంటంటే ఈ టూర్లలో ఎక్కడా కళా వెంకటరావు ఏపీ అధ్యక్షుడిగా కనిపించడంలేదు. నిజానికి జాతీయ అధ్యక్షుడిగా బాబు పై స్థానంలో ఉంటే కళా చేయాల్సిన పర్యటనలు ఇవి. కానీ బాబు అన్నీ తానే అంతా తానే అన్నట్లుగా పార్టీని తయారు చేశారు. తాను కూడా జిల్లా, మండల మీటింగులు పెట్టుకుంటూ లేని బిజీ తెచ్చుకుని బాబు తెగ తిరుగుతున్నారు. మరి కళా పేరుకు మాత్రమే ఏపీ టీడీపీ ప్రెసిండెంట్ గానే మిగిలారు.
ఆయన సొంత జిల్లా శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు టీడీఎల్పీ ఉప నేతగా కొంత హడావుడి చేస్తున్నారు. ఎంపీగా కింజరపు రామ్మోహననాయుడు ఉన్నారు. జిల్లా పార్టీలో అచ్చెన్న దూకుడు సాగుతోంది. బాబుకు రైట్ హ్యాండ్ గా ఉంటున్నారు. సిక్కోలు టీడీపీలో వర్గ పోరు గట్టిగా ఉంది. ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా కళా తన జిల్లాలో పార్టీ గొడవలను సైతం పరిష్కరించలేకపోతున్నారు. ఆయన మాట వినే వారు కూడా ఎవరూ లేరు.
జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా చంద్రబాబే సెలెక్ట్ చేసి ఇవ్వాలి. దాంతో కళా మాజీ మంత్రిగా పూర్తి ఖాళీగా ఉంటున్నారు. ఆయనకు ఎటూ వూసుపోవడంలేదు, అందువల్ల అపుడపుడు మీడియా ముందుకు వచ్చిన జగన్ సర్కార్ని విమర్శిస్తూ ఉన్నాననిపించుకుంటారుట. జగన్ ఆరు నెలల పాలన దారుణమని కళా లేటెస్ట్ గా కామెంట్ చేశారు.
జగన్ కి అధికారం ఇస్తే ఇరవయ్యేళ్ళు వెనక్కుపోయిందని ఆయన అంటున్నారు. మంచి ముఖ్యమంత్రిగా ఆరు నెలల్లో రుజువు చేసుకుంటానని చెప్పిన జగన్ పూర్తిగా ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకున్నారని అంటున్నారు.
చిత్రమేంటంటే ఈ మాటలు కూడా చంద్రబాబు ఎపుడే వాడేశారు. కళా వాటినే రిపీట్ చేస్తూ తన రాజకీయ ఉనికిని చాటుకుంటున్నారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు మరి.