జనసేనాని పవన్‌ కళ్యాణ్‌కి ఏమయ్యింది.?

'హై కోర్టు కర్నూలులో వుంటే, శ్రీకాకుళం నుంచి కర్నూలుకి వెళ్ళాలా.? అనంతపురం నుంచి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్ళి ఉద్యోగాలు చేయాలా.? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు లేదా సెక్రెటేరియట్‌లో పని వుంటే వెళ్ళటం సాధ్యమయ్యే…

'హై కోర్టు కర్నూలులో వుంటే, శ్రీకాకుళం నుంచి కర్నూలుకి వెళ్ళాలా.? అనంతపురం నుంచి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్ళి ఉద్యోగాలు చేయాలా.? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు లేదా సెక్రెటేరియట్‌లో పని వుంటే వెళ్ళటం సాధ్యమయ్యే పనేనా.?' ఇవీ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సోషల్‌ మీడియా వేదికగా సంధించిన ప్రశ్నలు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, రాష్ట్రానికి మూడు రాజధానులు.. అనే ప్రతిపాదనను తెరపైకి తేవడంతో, పవన్‌ కళ్యాణ్‌ ఉలిక్కిపడ్డారు.

ఎడా పెడా ట్వీట్లు వేసేశారు పవన్‌ కళ్యాణ్‌. వాటిల్లో చాలా తప్పులు తడకలు వున్నాయనుకోండి.. అది వేరే విషయం. ప్రధానంగా, పైన పేర్కొన్న ట్వీట్‌ అయితే అత్యంత హాస్యాస్పదం. అమరావతిలో ప్రస్తుతం హైకోర్టు వుంది.. శ్రీకాకుళం నుంచి ప్రజలు అమరావతికి వెళ్ళడంలేదా.? అమరావతిలోనే సచివాలయం వుంది.. అక్కడికి ఉద్యోగులు వెళ్ళడంలేదా.? కోర్టు పనులు వున్నోళ్ళు ఆ కోర్టు అవసరాల నిమిత్తం కోర్టు ఎక్కడ వుంటే అక్కడికి వెళ్ళాల్సిందే. సెక్రెటేరియట్‌ విషయమైనా అంతే. అన్నీ ఒకే చోట వుంటే కొంత సౌలభ్యం వుండొచ్చు. వేర్వేరు చోట్ల వుంటే చిన్న చిన్న ఇబ్బందులు వుండొచ్చు.

రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలంటే ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రతిపాదనలు తప్పనిసరి. నిజానికి, పవన్‌ ప్రశ్నించాలనుకుంటే దానికి తగ్గట్టుగా ఆయన కొంత 'హోమ్‌ వర్క్‌' చేసుకుని వుండాలి. అంతే తప్ప, వున్నపళంగా సోషల్‌ మీడియాకెక్కి ఎడా పెడా ట్వీట్లు వేసేస్తే దాని వల్ల ఉపయోగమేంటి.? 'ఇవా మీ తెలివితేటలు.?' అని అభిమానులు సైతం విసుక్కునేలా ట్వీట్లు వేస్తున్నారంటే, పవన్‌ కళ్యాణ్‌ తన స్థాయిని తగ్గించుకుంటున్నారనే కదా అర్థం.

అన్నట్టు, పవన్‌ ట్వీట్‌ మత్యాల్లో 'కమిటీ రిపోర్ట్‌ రాకముందే జగన్‌ రెడ్డిగారు మూడు రాజధానులు ప్రకటించేకాడికి, అసలు కమిటీలు వెయ్యడం దేనికి.? నిపుణుల్ని అపహాస్యం చెయ్యడం దేనికి.?' అనే ఆణిముత్యం కూడా వుందండోయ్‌. ఇదే ప్రశ్న చంద్రబాబు హయాంలో కాపు రిజర్వేషన్ల నిమిత్తం వేసిన కమిటీ, దాన్ని చంద్రబాబు అటకెక్కించిన వైనంపై ఎందుకు పవన్‌ వేయలేకపోయాడట.?