ఏపీ బీజేపీ మాజీ చీఫ్, ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మార్పుపై స్పష్టత వచ్చింది. ఈ నెల 24న చంద్రబాబు సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ పసుపు కండువా కప్పుకోనున్నారు. బీజేపీపై ఆయన గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తనను తప్పించడం కంటే, నచ్చని సోము వీర్రాజుకు కీలక బాధ్యతలు అప్పగించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
అలాగే బీజేపీలో కన్నా అనుచరులంటూ లేకుండా చేయాలని సోము వీర్రాజు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో సోము వీర్రాజు కొంత వరకూ సక్సెస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలపరచడం కంటే ఆ పార్టీలో ఆధిపత్యాన్ని సాధించడంపైనే నాయకులు ఎక్కువ దృష్టి సారించారు. కన్నా హయాంలో నియమించిన జిల్లా అధ్యక్షుల్ని సోము వీర్రాజు రాత్రికి రాత్రే తప్పించారు. దీనిపై కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల సోము వీర్రాజు, అలాగే మరో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై కన్నా లక్ష్మీనారాయణ బహిరంగ విమర్శలకు దిగారు. ముఖ్యంగా జనసేనాని పవన్‌కల్యాణ్ పొత్తులో భాగంగా కలిసి రాకపోవడానికి ప్రధాన కారణం సోము వీర్రాజు వైఖరే అని కన్నా తీవ్ర విమర్శలు చేశారు. పవన్‌కల్యాణ్‌కు తాను అండగా ఉంటానని ఆయన ప్రకటించారు. మరోవైపు పవన్‌కల్యాణ్ ఆదేశాల మేరకు కన్నాను జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ కలుసుకున్నారు.
కన్నాతో నాదెండ్ల చర్చల నేపథ్యంలో ఆయన జనసేనలో చేరుతారనే చర్చ విస్తృతంగా జరిగింది. అయితే సీఎం జగన్‌ను ఎదుర్కోవడం పవన్‌తో సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. వ్యక్తిగత అభిమానం ఎలా ఉన్నా, రాజకీయంగా వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీనే తనకు సరైన పార్టీగా ఆయన తుదకు నిర్ణయించుకున్నారు.
తాజాగా టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కన్నా ప్రధాన ప్రతిపక్షంలో చేరనున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆయన పని చేయడానికి నిర్ణయించుకున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి కన్నా టీడీపీ తరపున పోటీ చేయడం పక్కా అని సమాచారం. టీడీపీలో కన్నా చేరికతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గం అండగా నిలుస్తుందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు.