Advertisement

Advertisement


Home > Politics - Gossip

గులాబీ నాయకులు పనికిరాకుంటే వలస నేతలకు ఛాన్స్?

గులాబీ నాయకులు పనికిరాకుంటే వలస నేతలకు ఛాన్స్?

తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి రాబోయే ఎన్నికల మీదనే ఉంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే కాకుండా ఇతర చిన్నా చితక పార్టీలు కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా సత్తా చాటుతామంటున్నాయి. కేసీఆర్ పాత అస్త్రాన్నే అంటే ముందస్తు ఎన్నికలనే మళ్ళీ బయటకు తీయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇది అవుతుందో కాదో చెప్పలేం. కానీ టీఆర్ఎస్ ఇమేజ్, వ్యక్తిగతంగా కేసీఆర్ ప్రతిష్ట తగ్గిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. గత రెండు పర్యాయాలు లేని ఒకేవిధమైన భయం కేసీఆర్ ను కమ్ముకుందని అంటున్నారు. 

అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇక కేసీఆర్ అపర చాణక్యుడనే సంగతి తెలిసిందే కదా. ఆయనే పెద్ద ఎన్నికల వ్యూహకర్త. కానీ ఈసారి మాత్రం ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా పెట్టుకున్నారు. ఆ సంగతి ఆయనే చెప్పారు. 

పీకే ఇప్పటికే తన పని ప్రారంభించాడు కూడా. పీకే ఆధ్వర్యంలోని ఐ ప్యాక్ టీమ్ ఇచ్చే నివేదికల మీదనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భవిష్యత్తు అంటే పార్టీ టిక్కెట్లు వచ్చేది రానిది ఆధారపడి  ఉంటుంది. ఈసారి కేవలం పార్టీ మాత్రమే అభ్యర్థులను గెలిపించలేదని కేసీఆర్ భావిస్తున్నారు.

అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ కూడా చాలా ముఖ్యమని అనుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు పార్టీ అభ్యర్థుల ఇమేజ్‌తో  ముడిపడి ఉంటాయని భావిస్తున్నారు. కాబట్టి మంచి ఇమేజ్ వున్న నాయకులను రంగంలోకి దించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ల సీట్లు సింగిల్ డిజిట్ కి పరిమితం చేసేలా ముఖ్యమంత్రి కేసిఆర్ వ్యూహరచన చేసినట్లు సమాచారం. ఈ వ్యూహంలో 'ఆపరేషన్ ఆకర్ష్' కూడా ఉంది. 

ప్రత్యర్థి పార్టీల్లో అభ్యర్థులు కాబోయే వారిని అంటే మంచి ఇమేజ్ ఉన్నవారిని, గెలుపు గుర్రాలను గుర్తించి పార్టీలో చేర్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇమేజ్ బాగాలేని టీఆర్ఎస్ నాయకులను కేసీఆర్ పక్కకు పెడితే వాళ్ళ స్థానాల్లో వలస నాయకులకు చోటు కల్పిస్తారు.

అదనంగా, ప్రతి ఎమ్మెల్యే  నియోజకవర్గంలో  సర్వేలు నిర్వహించడానికి పార్టీ ఐప్యాక్ బృందంతో పాటు, మరికొన్ని ఏజెన్సీల సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. నియోజకవర్గాల వారీగా నివేదికలు ప్రతికూలంగా ఉంటే, సిట్టింగ్ అభ్యర్థికి బదులుగా ఇతర పార్టీల నుండి కొత్తగా చేరిన అభ్యర్థికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. 

ఈ క్రమంలో నియోజకవర్గాల వారీగా సర్వేలు చేసే ఏజెన్సీలు టీఆర్‌ఎస్ అభ్యర్థుల అవకాశాలపై సర్వేలు చేయడమే కాకుండా ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే అభ్యర్థుల అవకాశాలపై అంచనా నివేదికలను కూడా ఇస్తాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

తెలంగాణా సాధించిన వీరుడిగా టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ను ప్రతిరోజూ కీర్తిస్తుంటారు. ఆకాశానికి ఎత్తుతుంటారు. కానీ తెలంగాణా రాష్ట్రం ప్రకటించగానే అంటే 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకుగాను 63 సీట్లు మాత్రమే టీఆర్ఎస్ సాధించింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో 88 స్థానాలు మాత్రమే సాధించింది. 

అప్పుడే భారీగా టీడీపీ, కాంగ్రెస్ నుంచి భారీగా నాయకులను గుంజుకుంది. వారిలో కొందరు మంత్రులయ్యారు. కొందరు కీలక స్థానాల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలకు ముందే ఈ ఫిరాయింపుల స్ట్రాటజీ అమలు చేయాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు సమాచారం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?