డిజిటల్ మీడియాపై కేంద్రం కత్తి పట్టింది. ప్రస్తుత వ్యవస్థలో డిజిటల్ మీడియా అత్యంత శక్తివంతమైన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి డిజిటల్ మీడియా కొరకరాని కొయ్యగా మారింది.
మోదీ ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపడంలో ప్రధాన స్రవంతి మీడియా వివిధ కారణాల వల్ల వెనుకంజ వేసింది. దీంతో డిజిటల్ మీడియా పాలకుల తప్పులను తూర్పార పట్టడంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ పరిణామాలు మోదీ సర్కార్‌కు కంటగింపుగా మారాయి.
ఈ నేపథ్యంలో డిజిటల్ మీడియాపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టడం విమర్శలకు దారి తీస్తోంది. డిజిటల్ మీడియాలో వచ్చిన వార్తా కథనాలు, సమాచారం తప్పుడదని రుజువు చేస్తే సంబంధిత సోషల్ మీడియా సంస్థల రిజిస్ట్రేషన్ రద్దు చేయడం లేదా జరిమానా విధించేందుకు అవకాశం కల్పించేలా చట్టసవరణ బిల్లును కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖ తీర్చిదిద్దింది.
కేంద్ర ప్రభుత్వం చట్టసవరణ బిల్లును ఆమోదిస్తే… మొదటిసారిగా డిజిటల్ న్యూస్ మీడియా నమోదు చట్టంలోకి వస్తుంది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే డిజిటల్ న్యూస్ ప్రొవైడర్లకు ఆంక్షలు తప్పవు. చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజుల్లోపు… డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు తమ వెబ్‌సైట్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.
ఈ చట్ట సవరణ బిల్లును రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే డిజిటల్ మీడియాపై నియంత్రణ చేసే అవకాశం పాలకులకు అధికారికంగా దక్కనుంది.
ఇప్పటికే పత్రికలు, చానళ్లను ప్రభుత్వాలు ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నవో అనుభవంలో ఉంది. ఇప్పుడు డిజిటల్ మీడియాపై కూడా నియంత్రణకు పాల్పడితే నిజాలు చెప్పే పరిస్థితి కరువవుతుందని ప్రజాస్వామిక వాదులు ఆందోళన చెందుతున్నారు.