చంద్రబాబును లాబీల్లో తిట్టించిన కేశవ్!

శాసనసభ జరగుతున్నప్పుడు పాలక- ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎడాపెడా తిట్టుకుంటారు. విమర్శించుకుంటారు. ఈ యుద్ధాలను ప్రజలు టీవీ చానెళ్ల లైవ్ కవరేజీల్లో చూస్తూనే ఉంటారు. కానీ అదే శాసనసభ లాబీల్లోకి వచ్చేసరికి ఒకరినొకరు నవ్వుతూ…

శాసనసభ జరగుతున్నప్పుడు పాలక- ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎడాపెడా తిట్టుకుంటారు. విమర్శించుకుంటారు. ఈ యుద్ధాలను ప్రజలు టీవీ చానెళ్ల లైవ్ కవరేజీల్లో చూస్తూనే ఉంటారు. కానీ అదే శాసనసభ లాబీల్లోకి వచ్చేసరికి ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకుంటారు. తమ మధ్య ఉండే ఆత్మీయతలను ఒలకబోసుకుంటారు. ఈ మాయోపాయాలేవీ సాధారణ ప్రజలకు కనిపించవు. అలాంటిదే ఒక సంఘటన మంగళవారం నాడు కూడా చోటు చేసుకుంది. పాపం చంద్రబాబునాయుడు.. చికిత్సకోసం అమెరికాకు వెళ్లిపోయినా సరే.. ఆ పార్టీ ఎమ్మెల్యే కేశవ్ పనిగట్టుకుని ఆయనకు తిట్లుపడేలా చేశారు.

తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు అసెంబ్లీ లాబీల్లో వైకాపా ఎమ్మెల్యే రోజా ఎదురుపడ్డారు. కేశవ్ ఊరుకోకుండా.. రోజా అసెంబ్లీ ప్రసంగంలో ఇదివరకటి వాడీ వేడీ లేవని పయ్యావుల కేశవ్ ఆమెతో సరదాగా వ్యాఖ్యానించారు. తమను తిట్టడంలో ముందుండే రోజా, ఇప్పుడు మౌనంగా ఉంటున్నారంటూ అన్నారు. ఆ మాటల ద్వారా ‘మంత్రిపదవి రాలేదు గనుక’ ఆమె అసంతృప్తిగా ఉన్నదనే భావనను రెచ్చగొట్టడానికన్నట్లుగా కేశవ్ మాట్లాడారు.

ఆ వ్యాఖ్యలకు రోజా మాత్రం దీటుగానే స్పందించారు. చంద్రబాబు సభలో లేకపోవడం వల్లే తన ప్రసంగంలో వాడితగ్గి సరిగా తిట్టలేకపోయానని, చంద్రబాబు మొహం చూసిన వెంటనే తిట్లు అవంతట అవే వచ్చేస్తయన్నట్లుగా రోజా అప్పటికప్పుడు తన సహజశైలిలో మళ్లీ అందుకున్నారు. పాపం.. చంద్రబాబునాయుడు ఎక్కడో అమెరికాకు వెళ్లిన తర్వాత కూడా ఇక్కడ లాబీల్లో తిట్టిస్తున్నందుకు పయ్యావుల కేశవ్ కంగుతున్నారు.

రీజన్ అదికాదేమో అంటూ కేశవ్ నసిగే ప్రయత్నం చేయగా… చంద్రబాబు లేని సమయం చూసి శాసనసభలో కేశవ్, జగన్ భజన చేస్తున్నారంటూ రోజా మరింత ఘాటుగా రిటార్టు ఇచ్చారు. దీంతో కంగారు పడ్డ కేశవ్.. గతంలో తాము తేదలచుకున్న బిల్లును ఇప్పుడు ప్రభుత్వం తేవడం వల్లే ప్రశంసించానంటూ బుకాయించి జారుకోవాల్సి రావడం కొసమెరుపు.

రాజకీయ నటన కంటే సినిమాల్లో నటన మంచిది