మాజీ సీఎం అల్లుడి అదృశ్యం.. భిన్నవాదనలు

కెఫే కాఫీ డే ఫౌండర్ వీబీ సిద్ధార్థ అదృశ్యం మిస్టరీగా మారింది. అదృశ్యం అయినది కేవలం ఒక ప్రముఖ వ్యాపార వేత్త మాత్రమే కాదు, కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి  అల్లుడు కూడా.…

కెఫే కాఫీ డే ఫౌండర్ వీబీ సిద్ధార్థ అదృశ్యం మిస్టరీగా మారింది. అదృశ్యం అయినది కేవలం ఒక ప్రముఖ వ్యాపార వేత్త మాత్రమే కాదు, కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి  అల్లుడు కూడా. కొన్నాళ్ల కిందట ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్ ను  వీడి భారతీయ జనతా పార్టీలోకి చేరారు. ఆయన అల్లుడిపై కేంద్ర ధర్యాప్తు సంస్థల నుంచి వస్తున్న ఒత్తిడిని ఆపడానికే ఆ సీనియర్ కాంగ్రెస్ నేత బీజేపీలోకి చేరినట్టుగా అప్పట్లో విశ్లేషణలు వినిపించాయి.

కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి పదవితో పాటు, కేంద్రంలో మంత్రిగా కూడా వ్యవహరించారు  ఎస్ఎం. బెంగళూరు డెవలప్ మెంట్లో ఆయన భాగస్వామ్యం కీలకం అని కన్నడీగులు అంటారు. దేవేగౌడ కుటుంబీకులు కర్ణాటక అభివృద్ధిని హాసన్ ఏరియాకు పరిమితం చేస్తున్న దశలో కృష్ణ రూటు మార్చారని, కంపెనీలను బెంగళూరు బాట పట్టించడంలో ఆయనదే కీలక పాత్ర అని కర్ణాటక రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

కాంగ్రెస్ వాళ్లు కూడా ఆయనకు కేంద్రంలో మంత్రి పదవిని ఇచ్చి గౌరవించారు. కీలకమైన శాఖలను  నిర్వహించిన కృష్ణ బీజేపీలోకి చేరడం అప్పట్లో చర్చనీయాంశంగా నిలిచింది. అంతా అల్లుడి కోసమే అనే  టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఆ అల్లుడే  అదృశ్యం కావడం మరింత సంచలనంగా మారింది.

ఈ అంశంపై కాంగ్రెస్ నేత డీకే శివకుమార స్పందించారు. సిద్ధార్థ అదృశ్యం పై తమకు అనుమానాలున్నాయని ఆయన అన్నారు.మరోవైపు సిద్ధార్థ రాసినట్టుగా చెబుతున్న లేఖలో సంతకం పొంతన కుదరలేదని అంటున్నారు అధికారులు. సిద్ధార్థ అదృశ్యం అయిన చోటుకు దగ్గర్లోనే ఒక వ్యక్తి నదిలోకి  దూకారని అక్కడి మత్స్యకారులు చెబుతూ ఉన్నారు. ఇలా పరిపరివాదనలతో ఈ అదృశ్యం ఇంకా మిస్టరీగానే మిగిలింది.