అమరావతిపై కమలనేత డొంకతిరుగుడు

అమరావతి ప్రాంత రైతులు డిమాండ్ లో  న్యాయం ఉన్నదా లేదా అనేది వేరే సంగతి..  కానీ వారు తమ ఆవేదన చెప్పుకోవడానికి వచ్చినప్పుడు, నాయకులుగా గుర్తింపు పొందుతున్న వారు సావధానంగా వాటిని ఆలకించి తీరాల్సిందే. ప్రజల…

అమరావతి ప్రాంత రైతులు డిమాండ్ లో  న్యాయం ఉన్నదా లేదా అనేది వేరే సంగతి..  కానీ వారు తమ ఆవేదన చెప్పుకోవడానికి వచ్చినప్పుడు, నాయకులుగా గుర్తింపు పొందుతున్న వారు సావధానంగా వాటిని ఆలకించి తీరాల్సిందే. ప్రజల ఓట్లు మాత్రం తమకు కావాలి, వారి గోడు మాకు అక్కర్లేదు  అనే తరహాలో నాయకులు వ్యవహరించకూడదు. దీనివలన ప్రజాస్వామ్య వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిల్లి పోతుంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యవహరించిన తీరు గమనిస్తే ఇదే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.

అమరావతి ప్రాంత రైతులకు న్యాయం చేయాలంటూ అక్కడినుంచి కొందరు వచ్చి కేంద్ర హోంశాఖ ముఖ్యమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా తప్పదు కిషన్ రెడ్డి అన్నారు. అయితే ఇదే సమయంలో లో ఆ తూయన మాట్లాడుతూ.. ఈ విషయంలో అక్కడి ప్రభుత్వము పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని సూచనలు చేయడం చిత్రంగా ఉంది.

మూడు రాజధానుల ప్రతిపాదన మంచిదనే అభిప్రాయం భారతీయ జనతాపార్టీ కి కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే అమరావతి ప్రాంత రైతులు వ్యతిరేకతను కొని తెచ్చుకోవడం ఇష్టం లేని ఆ పార్టీ… మెరమెచ్చు మాటలతో పొద్దుపుచ్చుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ను ఓడించి అధికారంలోకి రావాలని కలలు కంటున్న ఈ పార్టీ…  రాష్ట్రానికి సంబంధించిన ఒక విషయంలో స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోవడం గమనార్హం. స్థానిక నాయకుడు తలోరకంగా మాట్లాడుతూ మరింత గందరగోళం సృష్టిస్తున్నారు.

రాజధాని మారుతున్నట్లు గా ప్రభుత్వం కేంద్రానికి తెలియజేస్తే, స్పష్టత వచ్చిన తర్వాత అప్పుడు తమ స్పందన ఏమిటో తెలియజేసి అని కిషన్ రెడ్డి అనడం చిత్రంగా ఉంది. ఒకవేళ భిన్నాభిప్రాయం ఉంటే నిర్ణయం జరుగుతున్నప్పుడు చక్కదిద్దడానికి ప్రయత్నించాలే తప్ప,  స్పందించి ఏం సాధిస్తారు అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. తమ అభిప్రాయాన్ని బయటకు చెప్పలేక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం.. డొంకతిరుగుడుగా మాట్లాడడం భారతీయ జనతా పార్టీకి తగదని ప్రజలు విమర్శిస్తున్నారు.