అమరావతిలో రాజధాని కట్టడానికి ఎంతవుతుంది అనే ప్రశ్నకు ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పటం లేదు. రాష్ట్రం విడిపోతుంది అనగానే బాబు చేసిన మొదటి ప్రకటన – కొత్త రాజధానికై 4 లక్షల కోట్లు కావాలి అని. తర్వాత దాన్ని 5 కూడా చేశారు. అప్పటికే ఆయన తలలో సింగపూరు మోడల్, నవనగరాలు తిరుగుతున్నాయేమో తెలియదు. ఆ తర్వాత డిజైన్లు, గ్రాఫిక్స్ అందరికీ తెలిసిన సంగతే. కేంద్రం తానడిగిన డబ్బు యివ్వలేదని ఫిర్యాదు చేయడమూ తెలిసిందే. డిపిఆర్ (సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు) లేనిదే ఎలా యిస్తాం అని కేంద్రమంత్రులు అడుగుతూనే ఉన్నారు. చివరకు యిచ్చినది 1150 ఎకరాలకు మాత్రమే! పూర్తి రిపోర్టు లేనిదే యింత ఖర్చవుతుందని ఎవరైనా ఎలా చెప్పగలరు? అద్భుత నగరం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు లక్షా తొమ్మిది వేల కోట్లు అవుతాయని ఆ మధ్య నారాయణ ప్రకటించారు. అది కేవలం మౌలిక సదుపాయాలకే, భవంతులకు ఎంతవుతుందో చెప్పలేదు.
భవంతులకు అయ్యే ఖర్చు తెలిస్తే, దానిలో సింగపూరు వాళ్లు ఎంత పెడతారు, అంతర్జాతీయ సంస్థలు ఎంత ఋణం యిస్తాయి, మనం ఎంత మార్జిన్ పెట్టాలి అనేది తెలుస్తుంది. అంత స్తోమత ఆంధ్ర రాష్ట్రానికి ఉందా లేదా ఎవరికి వారు లెక్కలేసుకుంటారు. బాబు చెప్పినదేమిటి? అమరావతిలో నవనగరాలు కట్టి, పరిశ్రమల్ని తెప్పించి, జనాల్ని రప్పించి, ఆదాయం గడించి దానితో 13 జిల్లాలను పోషించేయవచ్చని! దీనిలో ఎన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయో తలచుకుంటేనే భయమేస్తుంది. అయినా బాబు ధైర్యంగా యిది సెల్ఫ్-ఫైనాన్సింగ్ కాపిటల్ అంటూ ప్రచారం చేశారు. ఒక పాన్ షాపు బ్రేక్ ఈవెన్ కావడానికే రెండేళ్లు పడుతుంది. అలాటిది దీనిలో ఉన్న పరిశ్రమలు, సేవాసంస్థలు అన్నీ బ్రేక్ ఈవెన్ కావాలంటే, లాభాలు సంపాదించాలంటే ఎన్ని ఏళ్లు, ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఊహించండి. కట్టడానికి మనం తెచ్చిన ఋణాలు తీర్చడానికి వాయిదాలు, వడ్డీలు కూడా వీటిల్లోంచి మినహాయించాలి.
కట్టకపోతే రెండు లక్షల కోట్లా! ? – ఇంత భూరి ప్రాజెక్టు ఉంటే రాజధానికి కట్టడానికి ఏమీ అవదు అని కొందరు అనసాగారీ మధ్య. అలా ఎలాగో నాకు తెలియటం లేదు. ప్రభుత్వభూమిలో కట్టి ఉంటే భూమి ఖఱ్చు ఉండేది కాదు. అప్పుడు కూడా మౌలిక వసతులకు, భవన నిర్మాణాలకు, యితర హంగులకు బోల్డంత అయ్యేది. అమరావతి విషయంలో భూమి కూడా ఊరికే రాలేదు. జేబులోంచి డబ్బివ్వలేదు కదా అనేది పిచ్చి వాదన. డబ్బివ్వకపోయినా ఎకరాకి 1000 చ.గ.ల నివేశనస్థలం, 250/450 చ.గ.ల వాణిజ్యస్థలం కమిట్‌మెంట్ ఉంది. అది యివ్వనక్కరలేదంటే అది కూడా ప్రభుత్వానికే మిగిలేది. ఇది కాక ప్రతీ ఏడూ భూపరిహారం, కూలీ పరిహారం కింద వందల కోట్లు పదేళ్ల పాటు యివ్వాలి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి కావా?
ఇప్పుడు రాజధాని అక్కడ కట్టాలంటే లక్ష కోట్లు అక్కరలేదని, అక్కణ్నుంచి మారిస్తే మాత్రం దాదాపు రెండు లక్షల కోట్లు ఖర్చవుతుందని సుజనా చౌదరి అంటున్నారు. అలా ఎలా అంటే ఒప్పందం నుంచి తప్పుకున్నందుకు గాను రైతులకు, యితరులకు యివ్వవలసిన నష్టపరిహారం అంత ఉంటుందట! నిజమా!? ముందుగా రైతుల గురించి ఆలోచిస్తే – వాళ్లతో చేసిన ఒప్పందాలను ఒకసారి చూడండి. నష్టపరిహారం గురించి ఏమైనా ఉందేమో! అది పూర్తిగా ఏకపక్షంగానే ఉంది తప్ప రైతులకు రక్షణ కల్పించటం లేదు. ఈనాడు రైతు రక్షకులుగా ఎందరో నాయకులు అవతారం ఎత్తుతున్నారు. వారికి కొందరు వామపక్ష మేధావులు, సామాన్యులు కూడా వంత పాడుతున్నారు. ఒక పాఠకుడు వీళ్ల గురించి నేనూ పోరాడతానని రాశారు.
ఒప్పందాలలో రైతులకు రక్షణ ఉందా? – రైతుల చేత అన్యాయపు, ఏకపక్షపు ఒప్పందాలు రాయించుకుంటున్నపుడు వీరంతా ఏమయ్యారో నాకు తెలియటం లేదు. అసలా ఒప్పందాలపై ప్రభుత్వ ప్రతినిథి ఎవరూ సంతకం పెట్టటం లేదని, అందువలన అవి బైపార్టయిట్ ఒప్పందాలు కావని జంధ్యాల రవిశంకర్ ఓ సారి చర్చలో అన్నారు. 18 నెలల్లో డెవలప్ చేసిన భూములను వెనక్కి యిస్తామని బాబు అన్నారు. ఇవ్వలేదు. అప్పుడు వీరెవరైనా ఉద్యమాలు చేశారా? ఆ క్లాజ్ అగ్రిమెంటులో ఎందుకు లేదని అడిగారా? మామూలు రాజధాని కట్టడానికే 15-20 ఏళ్లు పడుతున్నాయని యితర రాష్ట్రాలలో చూశాం. అమరావతి తయారు కావడానికి కూడా హీనపక్షం 15 ఏళ్లు పడుతుందని వీరికి తోచలేదా? అప్పటిదాకా బాబే అధికారంలో ఉంటారని ఎవరైనా గ్యారంటీ యివ్వగలరా? బాబు కానీ వేరెవరైనా ముఖ్యమంత్రి కానీ నోటితో చెప్పే మాటలు నమ్మడానికి వీల్లేదని, అంతా కాగితంపై స్పష్టంగా ఉండాలని వీరు రైతులకు చెప్పలేదా? నాబోటి కాలమిస్టులు రాస్తే ఆంధ్రవ్యతిరేకులమని, అమరావతి హైదరాబాదుకి పోటీ వచ్చేస్తుందన్న కుళ్లుతో రాస్తున్నామని చాలామంది అన్నారు.
అసలు హైదరాబాదుతో పోలిక ఎందుకనే నా బాధ. హైదరాబాదు 400 ఏళ్లకు పై బడి రాజధాని. 1956 నుంచి 23 జిల్లాలకు రాజధాని. అమరావతి కానీ వైజాగ్ కానీ ఖండిత రాష్ట్రానికి, 13 జిల్లాలకు రాజధాని. జనాభాలో కానీ, విస్తీర్ణంలో కానీ, కేంద్ర సంస్థల ఉనికిలో కానీ పోలికే లేదు. ఎన్నాళ్లు శ్రమిస్తే ఆంధ్ర రాజధాని హైదరాబాదు అవుతుంది? ఒకవేళ అయినా అది అభిలషణీయమా? ఇప్పటికి కూడా హైదరాబాదు తప్పిస్తే తెలంగాణలో నగరాలు లేవు. అన్నీ అక్కడే కేంద్రీకరింపబడి, హైదరాబాదు రోగాల నగరంగా, గతుకుల బతుకుల నరకంలా తయారైంది. ఆంధ్ర రాజధాని కూడా అలా కావాలా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా ఆంధ్రలో అన్ని ప్రాంతాలూ యించుమించుగా కాస్తోకూస్తో తేడాగా అభివృద్ధి చెందేలా రూపొందించడం మంచిది అని టిడిపి తప్ప అన్ని పార్టీలూ అంటున్నాయి. అంటూనే అమరావతి నుంచి రాజధాని తరలించడాన్ని వ్యతిరేకిస్తాం అంటున్నాయి, వైసిపి తప్ప!
మిగిలిన భూమిని ఏం చేయాలి? – రాజధాని ఉంచినా ఉపయోగపడకుండా మిగిలిన ఎకరాలు ఏం చేయాలని వారి ఉద్దేశం? రైతుల నుంచి భూమి తీసేసుకోవడం జరిగింది, అంతా కలగాపులగం చేసి, ఏది ఎవరిదో తెలియకుండా చేసేయడమూ జరిగింది. ఆ ప్రక్రియకు లోనుకాని భూములేవైనా ఉంటే గుర్తించి వెనక్కి యిచ్చేస్తాం, వ్యవసాయం చేసుకోండి అంటే రైతులెవ్వరూ ముందుకు రావటం లేదు. మహా అయితే వెయ్యి ఎకరాలలో రాజధానికి కావలసిన బిల్డింగులన్నీ కట్టేశారనుకోండి, తక్కిన 32 వేల ఎకరాలను ఏం చేయాలి అని అడిగితే వీరెవరూ సమాధానం చెప్పటం లేదు. రైతులకు అన్యాయం జరగకూడదు, ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదు, రైతులతో చర్చించాలి – వంటి పడికట్టు ప్రకటనలే యిస్తున్నారు.
రైతులతో చర్చిస్తే ఏమంటారు? రాజధాని తరలించకూడదు అంటారు. సరే, తరలించం, కానీ యిక్కడ లక్షల కోట్లతో అద్భుతనగరం కట్టం అంటే తమకు దక్కిన స్థలాలను వాళ్లు ఏం చేసుకుంటారు? 'దృష్టి మరల్చడానికేనా?' అనే వ్యాసంలో రాసినట్లు వాటికి ఎంతో కొంత విలువ తప్పక పెరుగుతుంది. కానీ రైతుల ఆశలకు, దానికీ ఎక్కడా లంగరందదు. వాళ్లకు అలాటి ఆశలు కల్పించారు మరి. రైతుల చేతిలో ఉన్న ఆయుధమల్లా ఒప్పందాన్ని అమలు చేయండంటూ కోర్టుకి వెళ్లడమే! ఈ ప్రభుత్వం డెవలప్ చేయనంటేనే తంటా కానీ, చేసి యిస్తానంటే కోర్టు మాత్రం ఏమంటుంది? అందువలన రైతులకు నష్టపరిహారం చెల్లించవలసిన అవసరం ఎందుకు పడుతుంది?
కాంట్ట్రార్లకు నష్టపరిహారం – ఇక యితర కాంట్రాక్టుల గురించి – సింగపూరు వాళ్లతో కుదుర్చుకున్న ఒప్పందం రద్దయిపోయింది. వాళ్లేమీ నష్టపరిహారం అడగలేదు. మీరడిగిన సమాచారం యివ్వడం కంటె మానుకోవడమే మాకు హాయి అనేసి వెళ్లిపోయారు. ఇక తక్కిన వ్యాపారవేత్త లెవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు కనుక! పరిశ్రమా రాలేదు, ప్రభుత్వం వాళ్లకు కమిట్‌మెంటూ యివ్వలేదు. భూకేటాయింపులు మాత్రం విచ్చలవిడిగా జరిగాయి. కేటాయింప చేసుకున్నవారు అక్కడ యిప్పుడు భవనాలు, యూనివర్శిటీలు కట్టే ఉద్దేశం మార్చుకుని కట్టకపోవచ్చు. నిర్ణీత సమయంలో వాళ్లు కట్టకపోతే ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. నష్టపరిహారం మాట ఎందుకు వస్తుంది? ఇక భవంతులు కడతామని ప్రభుత్వం, కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందం మాటంటారా? అవి ఎలా రాసుకున్నారో చూడాలి. చాలా భాగం పూర్తయిన బిల్డింగులను పూర్తి చేయిస్తున్నారు. సగం కంటె తక్కువ కట్టిన బిల్డింగులను నిలిపివేస్తున్నారు అన్నారు. నిలిపివేస్తే ఆ కాంట్ట్రార్లు అభ్యంతర పెట్టవచ్చు.
కొన్ని కేసుల్లో మొబిలైజేషన్ అడ్వాన్సు పేర ప్రభుత్వమే ముందుగా డబ్బు యిస్తోంది. అంతకంటె పని తక్కువగా అయి వుంటే కాంట్రాక్టరుకు నష్టం లేదు. ఎక్కువగా అయి వుంటేనే సమస్య. వేరే చోట కాంట్రాక్టు యిస్తామని రాజీ చేసుకుంటే నష్టపరిహారం మాట రాకపోవచ్చు. ఏది ఏమైనా యీ నష్టపరిహారాలు లక్షన్నర, రెండు లక్షల కోట్లు అయితే కచ్చితంగా ఉండవు. సుజనా చౌదరి గారి గ్రూపు తమ గోరంత ఆస్తులను కొండంతగా చూపి బ్యాంకుల నుంచి ఋణాలు తీసుకున్నారు. పాత అలవాటుతో యిప్పుడూ అదే తరహాలో అంకెలు ఉత్ప్రేక్షించి చెపుతున్నారు లాగుంది. పైగా రాజధాని మారిస్తే కేంద్రం ఊరుకోదు అంటూ బుకాయింపు ఒకటి! పార్టీ మారిస్తే ఊరుకునే కేంద్రం రాజధాని విషయంలో స్పందిస్తుందా? మాకేమీ ప్రమేయం లేదు, అధికార ప్రతినిథిగా నేను చెపుతున్నా అంటూ జివిఎల్ వెంటనే కౌంటర్ యిచ్చి సుజనా పరువు తీశారు. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును రాష్ట్రప్రభుత్వం తుంగలోకి తొక్కినప్పుడూ కేంద్రం కలగజేసుకోలేదు. ఇప్పుడూ చేసుకోదు. తన ఆస్తుల విలువను కాపాడుకోవడానికి సుజనా కేంద్రం పేరు వాడుకున్నారని అందరికీ అర్థమైంది.
వెక్కిరింతకు గురైన మూడు రాజధానుల కాన్సెప్టు – రాజధాని మార్పు అనకుండా జగన్ మూడు రాజధానులు అనడం, పైగా దక్షిణాఫ్రికాతో పోల్చడంతో వెక్కిరింతలకు గురయ్యాడు. దక్షిణాఫ్రికాలో ఒక్కో రాజధానికి మధ్యదూరం 1200 కి.మీ.లకు తక్కువ లేదు. ఇక్కడి పరిస్థితి అది కాదు. హైకోర్టు ఉన్న ఊరును కూడా రాజధాని అనడంతో, మూడు రాజధానులు కాకపోతే పదమూడు పెట్టుకో, నెలకో రాజధాని చొప్పున మార్చుకుంటూ పో, ఓడలో రాజధాని పెట్టుకుని రెండు నెలలకో రేవులో లంగరేసి, అదే రాజధాని అనుకో అంటూ వేళాకోళం చేస్తున్నారు. మూడు రాజధానులుంటే ముఖ్యమంత్రి మూడు చోట్లు యిళ్లు కడతారా అని ఓ కొక్కిరాయి ప్రశ్న. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న బాబు రాజధానిలో యిల్లే కట్టుకోలేదు. సొంతిల్లు పరరాష్ట్రంలోనే ఉంచుకున్నారు. మొన్నటిదాకా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నవారిలో చాలామంది సొంత యిళ్లు తమ ఊళ్లల్లో ఉంచుకుని, హైదరాబాదులో ప్రభుత్వ క్వార్టర్లలో ఉన్నారు.
ఏ ఊరైనా సరే, పెడితే అన్నీ ఒకే చోట పెట్టు అంటూ ఉపదేశిస్తున్నారు కొందరు పరిశీలకులు. కొన్ని రాష్ట్రాలలో అలా లేదు కదా, వాళ్లకు వచ్చిన లోటేమిటి అని అడిగితే సమాధానం లేదు. మన దగ్గర శ్రీబాగ్ ఒడంబడిక ఉంది కదా దాన్ని మన్నించాలి కదా అంటే పట్టించుకోవటం లేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఆంధ్ర ప్రజల మధ్య పరస్పరానుమానాలు ఉన్నాయి. ఆ ఉద్యమం కృష్ణా, గుంటూరు జిల్లాలలో ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని అవకాశాలు తమిళ ప్రాంతాల వారికే దక్కుతున్నాయంటూ వీళ్లు విమర్శించారు. వాళ్లు తమిళ ప్రాంతాలుగా పేర్కొన్న కొన్ని జిల్లాలు నిజానికి దక్షిణాది తెలుగువారు అత్యధిక సంఖ్యలో ఉన్నవే! వాటిని వదులుకోవడానికి కోస్తా నాయకులు సిద్ధపడ్డారు. వారి చూపంతా మద్రాసు నగరంపై మాత్రమే ఉంది. ఇదంతా రాయలసీమ వాసులను కలవర పరిచింది. మద్రాసు ఎటూ దక్కేట్టు లేదు. ఈ దక్షిణాది ప్రాంతాలు కూడా చేజారితే కోస్తా వాళ్లు తమ ప్రాంతాన్నే అభివృద్ధి చేసుకుని, తమను నిర్లక్ష్యం చేస్తారని భయపడ్డారు. అందువలన తమకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అక్కరలేదని అనసాగారు.
శ్రీబాగ్ ఒడంబడిక – దాంతో కోస్తా నాయకులు కంగారు పడ్డారు. రాయలసీమ కలిసిరాకపోతే ఉద్యమం నీరుకారి పోతుందని భయపడి, ఆ నాయకులను చర్చలకు పిలిచారు. ఆంధ్రపత్రిక యజమాని, 'విశ్వదాత' కాశీనాథుని నాగేశ్వరరావు గారి యింట్లో కూర్చుని ఒప్పందం రాసుకున్నారు. ఆ యింటికి పేరు శ్రీబాగ్ కాబట్టి ఆ ఒప్పందానికి ఆ పేరు వచ్చింది. దానిలో ప్రాంతీయ కమిటీల గురించి, అభివృద్ధి వికేంద్రీకరణ గురించి అనేక హామీలున్నాయి. 1956లో తెలంగాణను కలుపుకున్నపుడు తెలంగాణ నాయకులతో యిలాటిదే 'పెద్దమనుషుల ఒప్పందం' అని చేసుకున్నారు. దానిలోనూ బోల్డు హామీలు గుప్పించారు. ఇదంతా కాంగ్రెసు నాయకుల మధ్యనే. ఒకసారి అధికారంలోకి వచ్చాక యివన్నీ మర్చిపోయారు. అదేమిటని అడగాల్సిన రాయలసీమ, తెలంగాణ నాయకులు కూడా పట్టించుకోలేదు. దాంతో రాజకీయ కారణాలతో ప్రాంతీయ ఉద్యమాలు లేవనెత్త దలచిన వారికి యివి అందివచ్చిన ఆయుధాలుగా మారాయి.
తమాషా ఏమిటంటే రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రులైన వారిలో చాలామంది రాయలసీమ వారున్నారు. అయినా వారు శ్రీబాగ్‌ను నిర్లక్ష్యం చేశారు. కానీ 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడుతుందనగానే ముఖ్యమంత్రి కాబోయే ప్రకాశం గారు ఆ ఒప్పందంలోని ముఖ్యమైన అంశాన్ని అమలు చేశారు. ఆయన కుటుంబ మూలాలు ప్రకాశం జిల్లాలో ఉన్నా, పెరిగి, పెద్దయి, ఖ్యాతి గడించింది, రాజమండ్రి, మద్రాసులలోనే! రాజధాని, హైకోర్టులలో రాజధానిని రాయలసీమకు (కర్నూలు)కి, హైకోర్టును కోస్తాకు (గుంటూరు) యిచ్చారు. అది విజయవాడ, గుంటూరులలో ఆగ్రహావేశాలను రగిలించినా ఆయన ఖాతరు చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మళ్లీ పాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, బాబు రాజధానిని కోస్తాకు యిచ్చారు కాబట్టి శ్రీబాగ్ ననుసరించి తమకు హైకోర్టు యిస్తారని రాయలసీమ వాసులు ఆశించారు.
కానీ బాబు ఎటూ తేల్చకుండా, హైకోర్టును చీల్చమని అడగకుండా చాలాకాలం కాలక్షేపం చేసి, చివరకు హైకోర్టును కూడా అమరావతికే అప్పగించారు. ఇప్పుడు జగన్ హైకోర్టును రాయలసీమకు తరలిస్తానంటే టిడిపి నాయకులు, హైకోర్టు ఎందుకు బెంచ్ యిస్తే పోతుందిగా అంటున్నారు. తమ హయాంలో బెంచి కూడా ప్రకటించలేదని మర్చిపోతున్నారు. ఆ బెంచ్ ఏదో అమరావతిలోనే పెట్టి హైకోర్టు కర్నూలులో పెట్టవచ్చుగా అంటే వీరి వద్ద సమాధానం లేదు. హైకోర్టు ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరుగుతుందా అని వాదిస్తున్నారు. కరక్టు, గుడ్డికన్ను మూసినా తెరిచినా ఒకటే కాబట్టి అది తరలిపోయినా చింతించాల్సిన పనేముంది? హైకోర్టు ఉండడం వలన అభివృద్ధి జరగదు కానీ యిది భావోద్వేగాలకు సంబంధించిన విషయం.
కర్నూలు ఎంపిక లాజిక్ – కర్నూలు ఎందుకు ఎంపిక చేశారు? అని ప్రకాశం గారిని అడిగితే ఆయన 'తెలుగు వారందరూ ఏకమై విశాలాంధ్ర (అప్పట్లో అలాగే అనేవారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టారు) ఏర్పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికే డెవలప్ అయి, అన్ని సౌకర్యాలు ఉన్న హైదరాబాదు దానికి రాజధాని అవుతుంది. ఈ లోగా మరో రాజధాని కట్టి డబ్బులు తగలేయడం దేనికి? పెద్దగా ఖర్చు లేకుండా యిక్కడే కాలక్షేపం చేద్దాం' అన్నారు. అన్నట్టుగానే గుడారాల్లో సెక్రటేరియట్ నడిపారు. అందుకే మూడేళ్లపాటు రాజధానిగా ఉన్న కర్నూలులో పెద్ద పెద్ద భవంతులేవీ కానరావు. క్యాంపులుంటాయంతే! భవన నిర్మాణాలపై ప్రభుత్వధనం వ్యయం కాలేదు. 1953లో మద్రాసు పోగొట్టుకుని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 2014లో హైదరాబాదు పోగొట్టుకుని మళ్లీ అదే సైజుకి వచ్చేసింది.
అయితే అప్పుడు ప్రకాశం గారు ప్రాక్టికల్‌గా ఆలోచించి, సౌకర్యాలన్నీ ఉన్న నగరం ఉండగా మరోదాన్ని సృష్టించడం ఎందుకు అనుకున్నారు. కానీ 2014లో బాబు దానికి విపర్యంగా ఆలోచించారు. సౌకర్యాలన్నీ ఉన్న వైజాగ్ ఉండగా దాన్ని పక్కకు పడేసి, కొత్తగా ఓ మాయాబజారు సృష్టించి, దానిలో సౌకర్యాలు కల్పిద్దామనుకున్నారు. అదే అన్ని చిక్కులకూ దారి తీసింది. ఆయన పాలనాకాలంలో చాలా భాగం దాని గురించి మాట్లాడడంతోనే సరిపోయింది. పైగా అది ప్రభుత్వభూముల్లో కాకుండా ప్రయివేటు భూముల్లో కట్టబోయారు. వాటికి ధర చెల్లించకుండా దీర్ఘకాలపు కమిట్‌మెంటులో ప్రభుత్వాన్ని యిరికించారు. ఇలా మొత్తమంతా అస్తవ్యస్తం చేశారు. ఐదేళ్ల తర్వాత కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని సవరించడానికి చూస్తోంది. దొనకొండలో ప్రభుత్వ భూముల్లో ఎందుకు కట్టరు అని ఒక విలేకరి అడిగితే, బాబు 'అక్కడ జనాలు లేరు, అక్కడ కడితే నువ్వు కూడా నీ ఫ్యామిలీని షిఫ్ట్ చేయవు' అన్నారు. వైజాగ్‌లో అయితే ఆల్‌రెడీ జనాలున్నారు, సౌకర్యాలున్నాయి. అక్కడికి ఎందుకు వెళ్లలేదో తెలియదు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని అందరికీ తెలుసు. రాజధాని కట్టడానికి కేంద్రం పెద్దగా సహకరించటం లేదనీ తెలుసు. అలాటప్పుడు సౌకర్యాలున్న వైజాగ్ ప్రాంతంలో, అదీ ప్రభుత్వభూముల్లో రాజధానికి అవసరమైన భవంతులు కట్టుకుంటే సరిపోతుంది అనేది ఆచరణాత్మకమైన ఆలోచన. దాన్ని వ్యతిరేకించడానికి బలమైన కారణాలు చూపాలి. లేవు కాబట్టి రైతుల సెంటిమెంటును రగులుస్తున్నారు. రియల్టర్లు నష్టపోతారు అని బాహాటంగా చెపితే జనాలు ఏడిస్తే ఏడవనీ అంటారు. హైదరాబాదులో మహేశ్వరం, ఆంధ్రలో నూజివీడు, దొనకొండ.. యిలా అనేక చోట్ల హెచ్చుధరలు పెట్టి కొనేసి, తర్వాత తలపట్టుకున్నవారు వేలల్లో, లక్షల్లో ఉన్నారు. 'ధరలు పెరుగుతాయని పెళ్లికొడుకుల్ని బేరాలాడి పెట్టుకున్నాం, యిప్పుడు తక్కువ కట్నానికి మరోణ్ని మాట్లాడుకోవాలి' వంటి కథలు ఎప్పుడూ వినబడుతూనే ఉన్నాయి. వాటికి ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే రియల్ ఎస్టేటు కూడా షేర్ మార్కెట్ లాటి జూదమే. పరిమిత ధరలో కొంటే ఫర్వాలేదు కానీ విపరీతమైన ధరల్లో కొంటే విచారించడం ఖాయం. ఇప్పుడు వైజాగ్‌లో ఎవరైనా కొంటూంటే వారూ బాధపడక తప్పదు.
అభివృద్ధికి గ్యారంటీ లేదు – ఎందుకంటే రాజధాని, అభివృద్ధి అనేవి వేర్వేరు అంశాలు. ముంబయి రాజధాని అయినా పుణేలో చాలా అభివృద్ధి జరుగుతోంది. రాజధాని ఉన్నంత మాత్రాన కొత్త భువనేశ్వర్ ఏమీ బావుకోలేదు. అక్కడ ఆర్టీసీ బస్సుల్లో తగినంత ఆక్యుపెన్సీ ఉండటం లేదని ఆ మధ్య ఓ వార్త చదివాను. ప్రభుత్వం తన పక్షాన రాజధానికి కావలసిన కొద్ది బిల్డింగులు కడితే చాలు. తక్కినవి మార్కెట్ ఫోర్సెస్‌కు వదిలేస్తే, అవసరాలను బట్టి వారే కట్టుకుంటూ పోతారు. అందుకే కాబోలు రాజధాని నిర్మాణానికి జగన్ వేల కోట్లు సరిపోతాయి అంటున్నాడు. ఇప్పటిదాకా 4-5 లక్షల కోట్లు కావాలని అంటూ వచ్చిన టిడిపి యిప్పుడు అంతేమీ అవదంటోంది. అమరావతిని మార్చకూడదని జనాల్ని ఒప్పించడానికి ఆ వాదన వినిపిస్తోంది. అక్కడ టిడిపి నాయకులకు ఆస్తులున్నాయని అందరికీ తెలిసిపోయింది కాబట్టి రైతుల పాటే అందుకోవాలి.
అందుకే కాబోలు భువనేశ్వరిగారు దిగి వచ్చి రైతుల కోసం అంటూ విరాళం యిచ్చారు కానీ ఆ చర్య విమర్శల పాలైంది. ఆవిడ రాజకీయాల్లోకి యిప్పటిదాకా రాలేదు కాబట్టి, ఎవరూ ఆమె గురించి మాట్లాడలేదు. వైయస్ భార్య విజయలక్ష్మి భర్త మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి అనేక రకాల విమర్శలకు గురయ్యారు. భువనేశ్వరి వాటి జోలికి పోలేదు. ఈ రోజు సోషల్ కాజ్ అంటూ తెర ముందుకు వచ్చారు. ఈ సామాజిక స్పృహ యిప్పుడు రావడం కూడా వింతగా ఉంది. ఎందుకంటే గోదావరి పుష్కరాల్లో 29 మంది మరణించినప్పుడు కూడా ఆమె యిటువంటి ఔదార్యం కనబరచలేదు. బాధిత కుటుంబాలను ఆదుకోలేదు. నిజానికి ఆ నాటి సంఘటనలో ఆవిడ ప్రమేయం లేకపోయినా, 'ఆ పూజలో నేను కూడా పాల్గొన్నాను కదా, మా కోసమే కదా, జనాల్ని ఆపారు' అనే ఆలోచన ఆమెను బాధించి వుండాలి. ఏది ఏమైనా దేనికి స్పందించాలో, దేనికి అక్కరలేదో ఎంచుకునే హక్కు ఆమెకుంది.
అరకొర డిపిఆర్ – మళ్లీ మనం మొదటికి వస్తే అమరావతిలో రాజధాని కట్టడానికి ఎంత ఖర్చవుతోంది తెలియకుండా పోతోంది. పూర్తి డిపిఆర్ (డిటయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) ఉండి వుంటే మనకో అంచనా ఉండి వుండేది. 'మాట్లాడితే లక్షల కోట్లు అడుగుతున్నారు, డిపిఆర్ పంపకుండా ప్రతిపాదన ఎలా పరిశీలిస్తాం?' అని కేంద్రం చాలాకాలం అడుగుతూ వచ్చింది. చివరకు 2018 మార్చిలో నారాయణ అసెంబ్లీలో చెప్పారు – 1450 ఎకరాలు డెవలప్ చేయడానికి రూ. 11,500 కోట్లు అడిగామని. అది ఎందుకంటే హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ కట్టడానికి సోషల్ అండ్ ఎక్స్‌టర్నల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పరచడానికి అట. తక్కిన మహాభవనాలు కట్టే ఖర్చు దీనికి చేర్చలేదు. 1450 ఎకరాలకు అంత అయితే 33 వేల ఎకరాలకు 2.67 లక్షల కోట్లు అవుతుంది.
అంత ఖర్చు ఎందువుతుందో ఆయనే అసెంబ్లీలో చెప్పారు. తక్కిన చోటయితే పునాదికి 30 అడుగుల లోతు తవ్వితే చాలట, కానీ యిక్కడి భూమి మెత్తగా ఉండటం చేత 100 అడుగుల లోతుకి వెళ్లాలట. ఎవరైనా ఖర్చు తక్కువయ్యే ఊళ్లో కడతారు, వీళ్లు మాత్రం ఎక్కువ అయ్యే చోట ప్లాను చేశారు. బాబు 52 వేల ఎకరాల్లో నవనగరాలు అంటూ మనల్ని ఊరించినా యీ డిపిఆర్ 1450 ఎకరాలకు మాత్రమే పంపారు. తక్కినవాటి గురించి కనీసం ఒక స్టేజి వరకైనా తయారయి వుంటే, దాన్ని బయట పెడితే మంచిది. అప్పుడు అందరికీ ఖర్చు గురించి ఒక ఐడియా వస్తుంది.
ఎస్‌ఐజెడ్ మంచి ఆలోచన – ఎవరేం మాట్లాడినా, రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రప్రజలందరూ కలిసి పరిష్కరించుకోవాల్సిన సమస్య రైతుల నుంచి సేకరించిన 33 వేల ఎకరాల సమస్య! అది బాబు తయారుచేసిన భూతమే కావచ్చు, కానీ ఆయనను నిందిస్తూ ఎల్లకాలం కూర్చోలేం కదా! రైతుల ఆశలు తీర్చడానికి అక్కడ లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగే పని కాదు. వందల ఎకరాల్లో రాజధాని పూర్తయిపోయినా తక్కిన భూమిని ఏం చేయాలనే సమస్య కళ్ల ఎదురుగా ఆడుతూనే ఉంది. మొన్న టీవీ చర్చలో కాంగ్రెసు అధికార ప్రతినిథి శర్మ అనే ఆయన 'ఆ మిగులు భూముల్లో కార్పోరేట్ ఫార్మింగ్ చేయవచ్చు. కాంగ్రెసు గతంలో యిలాటిది ప్రతిపాదించింది కానీ జరగలేదు' అన్నారు. నిజంగా అది మంచి ఆలోచనే. ఎందుకంటే ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం 86% మంది రైతులకు 1-2 ఎకరాల భూమి మాత్రమే ఉంది. వాళ్లు విడిగా వ్యవసాయం చేసినా కిట్టుబాటు కాదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అమూల్ వంటి సంస్థలా దీన్ని తీర్చిదిద్దవచ్చు.
అది సారవంతమైన భూమి. భూములిచ్చిన రైతులను స్టేక్‌హోల్డర్లుగా చేసి కార్పోరేషన్ ఏర్పాటు చేసి, 25 వేల ఎకరాలను సాగు చేసి, వాణిజ్యపంటలను పండించి, అమ్మి, వచ్చిన లాభాలను అందరు షేర్‌హోల్డర్లకు పంచవచ్చు. పంజాబ్, హరియాణాలలో అగ్రి ప్రోడక్టులను లాభదాయకంగా చేసుకున్నారు. నిన్ననే వార్త చదివాను. అక్కడ ప్రభుత్వం ఎస్‌ఏజెడ్ (స్పెషల్ అగ్రికల్చర్ జోన్) ఏర్పాటు చేసే ఆలోచన ఉందని. మంచిదే. ఇక్కడ జాగ్రత్త పడవలసినదేమిటంటే ఆ కార్పోరేషన్ నిర్వహణ రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టకుండా, నిపుణుల చేతిలో పెట్టాలి. పూర్తి వ్యాపార ఫక్కీలో నడపాలి. లేకపోతే ఆర్టీసీ లాగానే నష్టాలు వచ్చాయని, కొంతకాలం తర్వాత ప్రభుత్వం మూసేస్తా ననవచ్చు. రాజకీయ నాయకులను వారించలేము అనుకుంటే యిప్పుడే ప్రయివేటు రంగంలోని అగ్రిప్రోడెక్టు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని ప్రభుత్వ వాటాగా తలా 5 వేల ఎకరాలు యిస్తే సరి. అలా అయితే వాటిని నివేశన, వాణిజ్య స్థలాలుగా డెవలప్ చేసే ఖఱ్చు ప్రభుత్వానికి తప్పుతుంది.
ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2020)