అమరావతి ప్రాంతం నుంచి రాజధాని తరలి పోతుందని ఇవాళ వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ నానాయాగీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఐదేళ్ల పాలనలో ప్రజలు అందిస్తే రాజధాని విషయంలో భూమి సేకరణ తప్ప నిర్మాణాల పరంగా పెద్దగా ముందడుగు వేయకుండా ఇవాళ తరలించడానికి అవకాశం కల్పించినది చంద్రబాబు నాయుడే. ఆయన తన పాలన కాలంలో రాజధాని లో కొన్ని నిర్మాణాలను పూర్తి చేసి ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదు. అయితే రాజధానికి అవసరమైన నిర్మాణాలు కాకుండా, సర్కార్ సొమ్ము తగలేస్తూ చంద్రబాబు ఎలాంటి ఇతర కుట్రలు చేశారో ఈనాడు కథనం బయటపెడుతోంది.
అమరావతి ప్రాంతం రాజధానిగా ఎంపిక చేసిన నాటి నుంచి… రియల్ ఎస్టేట్ దందాలు నడిపేవారు కాకుండా, పర్యావరణ స్పృహ ఉన్న పెద్దలు అందరూ కూడా దీనిని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆ ప్రాంతం కొండవీటి వాగు ముంపు ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. అయితే స్వార్ధ ప్రయోజనాలతో ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసిన చంద్రబాబు నాయుడు, అలాంటి వాక్యాలను పెడచెవిన పెట్టారు. పైగా బయటపడకుండా ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించారు.
కొండవీటి వాగు నుంచి నీకు ప్రమాదం వాటిల్ల కుండా ఉండేందుకు 237 కోట్ల రూపాయల వ్యయంతో ఎత్తిపోతల పథకం చేశారు. ఆ స్థాయి ఈ పధకానికి అది చాలా ఎక్కువ ఖర్చు కింద లెక్క. పైగా ఈ ప్రాజెక్టు వరద నీటిని ఇతర ప్రాంతాల పొలాలకు ఉపయోగపడేలా ఎత్తిపోయడం ఉండదు. ఇది కేవలం వరదనీటిని ఎత్తి కృష్ణానదిలో గుమ్మరిస్తుంది. అంటే కేవలం రాజధానిని మునగకుండా కాపాడడం తప్ప.. దీనికి మరో ప్రజా ప్రయోజనం లేదు. రాజధాని ని కాపాడే ప్రాజెక్టు గనుక పథకానికి ఎక్కువ ఖర్చు పెట్టామని అధికార్లు సమర్థించుకుంటున్నారు. ఆ ఖర్చులో స్వాహాల పర్వం ఎంత ఉన్నదో తెలియదు.
ఆమాత్రం ఖర్చుతో రాజధానిలో ఒక్క నిర్మాణం కూడా పూర్తి చేయని చంద్రబాబు, రక్షణ ముసుగులో ఎత్తిపోతల మాత్రం ముగించారు. పైగా ఇప్పుడది పూర్తిగా వృధా అవుతుంది అని మొసలి కన్నీరు పెడుతున్నారు. కొందరి వాదన ఎలా ఉన్నదంటే.. అంత పెద్ద ఖర్చుతో ఎత్తిపోతల నిర్మించారు గనుక, అది వృధా కాకుండా ఉండాలంటే… అదే ప్రాంతంలో రాజధాని రావాలని అంటున్నట్లుగా ఉంది.
ఇదంతా నాడా దొరికింది కనుక గుర్రం కొనడానికి ఎగబడే మూర్ఖుని ప్రయత్నం చందంగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు. మునిగిపోయే ప్రాంతాన్ని ఇలా కాపాడుకొనే ప్రయత్నం బదులు, సురక్షితమైన మరొక ప్రాంతాన్ని ఎంచుకోవడం మంచిదే కదా అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.