కంటితుడుపుమాటల్తో కడుపు నింపేశారు?

రాజధాని రైతులు ఢిల్లీ వెళ్లారు. అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల గురించి అసెంబ్లీలో బిల్లు కూడా పాసయిన తర్వాత.. తెలుగుదేశం పార్టీ కూడా దాదాపుగా పోరాటాల్ని దన్నుగా నిలవడం మానేసిన తర్వాత.. రాజధాని రైతులు…

రాజధాని రైతులు ఢిల్లీ వెళ్లారు. అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల గురించి అసెంబ్లీలో బిల్లు కూడా పాసయిన తర్వాత.. తెలుగుదేశం పార్టీ కూడా దాదాపుగా పోరాటాల్ని దన్నుగా నిలవడం మానేసిన తర్వాత.. రాజధాని రైతులు మాత్రం కొందరు ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారు. అక్కడకు వెళ్లి, మోడీ, అమితషాలను కలిసి రాజధాని నిర్ణయాన్ని నిలిపివేస్తాం అన్నట్లుగా బీరాలు పలికి వెళ్లారు. తీరా అక్కడ కంటితుడుపుగా కిషన్ రెడ్డితో భేటీ కావడంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

హోంశాఖసహాయ మంత్రి కిషన్ రెడ్డి అంతకంటె కంటితుడుపు మాటలతో వారి కడుపు నింపే ప్రయత్నం చేశారు. కిషన్ రెడ్డి ఏపీ రాజధాని విషయంలో తన అభిప్రాయాలను ఇదివరకే చాలా సందర్భాలలో కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఇప్పుడు రాజధాని రైతుల ముఖప్రీతికోసం ఆయన మాట్లాడినట్లుగా కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తోంది.

రాజధాని విషయంలో జగన్ పునరాలోచించాలని, కేవలం రాజధాని మార్చడం వలన అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం సరికాదని కిషన్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ పునరాలోచన అనే మాట కూడా.. రాష్ట్ర భాజపా చేసిన తీర్మానం ను బట్టి చెప్పినదే. నిజానికి ఇదే కిషన్ రెడ్డి- గతంలో .. రాజధాని అనేది రాష్ట్రప్రభుత్వం ఇష్టం అని.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు అని పలుమార్లు చెప్పి ఉన్నారు. రైతులు వచ్చి కలిశారు గనుక.. ఆ అభిప్రాయం రిపీట్ చేయకుండా, ముఖప్రీతికి చెప్పారని అనుకోవాలి.

మండలిరద్దు విషయంలో కూడా ఆయన ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఆపగలం అని అనలేదు. మండలిరద్దు గురించి.. కేంద్రానికి అధికారిక సమాచారం ఇంకా రాలేదని, కేంద్రం రాజ్యాంగ పరిధిలోనే ఆలోచన చేస్తుందని మాత్రం అన్నారు. రాజ్యాంగాన్ని బట్టి పోవడం అంటే.. ఆ తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదించి పంపడం మాత్రమే జరుగుతుందనేది పలువురి అభిప్రాయం.

రాజధాని రైతులు ఢిల్లీ వెళ్లారు గానీ.. వారికి కమల నేతల నుంచి ఎలాంటి హమీ లభించినట్లు లేదు. అసలు ఢిల్లీ యాత్ర అనేదే.. ఉద్యమం నీరసించిపోయిందనడానికి సూచికగా పలువురు భావిస్తున్నారు.

‘ఎల్లో’ వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరం