టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి తొలి స్పీకర్‌గా పనిచేశారు. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగానూ పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో కోడెల శివప్రసాద్ ఎదుర్కొన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. కోడెల శివప్రసాద్ గురించి గుంటూరు జిల్లాలో తెలియనిదెవరికి.? ఆయన ఇంట్లో బాంబులు పేలిన వైనం దగ్గర్నుంచి, 'కోడెల పన్ను' వ్యవహారం దాకా.. కోడెల శివప్రసాద్ అంటే ఓ చరిత్ర. ఇందులో ఇంకో మాటకు తావులేదు.
తాజాగా కోడెల శివప్రసాద్ మీడియా ముందుకొచ్చి, తన మంచితనం గురించి చాలా 'గొప్పగా' చెప్పేసుకున్నారు. తన రాజకీయ జీవితంలో అస్సలంటూ ఒక్క మచ్చ కూడా రాలేదని సెలవిచ్చారు. నీతికీ, నిజాయితీకీ మారు పేరు తానేనన్నారు. అవునా.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు కోడెల శివప్రసాద్ ప్రెస్‌మీట్ చూస్తుండగానే.
2014 ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని కోట్లు ఖర్చు చేసిందీ స్వయంగా కోడెల శివప్రసాదే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారాయె. దాంతో, ఆయన మీద కేసు కూడా నమోదయ్యింది.. ఆ కేసు విచారణలో వుంది కూడా. గత ఐదేళ్ళ టీడీపీ పాలనలో, కోడెల స్పీకర్‌గా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సింది పోయి, అచ్చంగా కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ నేతగా పనిచేశారు.
సొంత నియోజకవర్గంలో అయితే కోడెల కుటుంబానికి పన్ను కట్టకుండా ఎవరూ ఏ పనీ చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపిస్తుంటారు చాలామంది. ఆరోపించడమేంటి.? అప్పట్లో పోలీసులకు చాలా ఫిర్యాదులు వెళ్లాయి.. ప్రభుత్వం టీడీపీదే గనుక, అప్పట్లో కోడెలకు వ్యతిరేకంగా ఎలాంటి కేసులూ నమోదు కాలేదు.
రోజులు మారాయ్.. 'కోడెల ట్యాక్స్'కి సంబంధించి నిజాలు నిగ్గు తేలుతున్నాయి. ప్రతి ఫిర్యాదునీ పోలీసులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు కూడా. లక్షల నుంచి కోట్లదాకా.. కోడెల పేరు చెప్పి ఆయన కుటుంబం 'వెనకేసుకున్న' మొత్తాల గురించి వింటోంటే, అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోతోంది.
కోడెల మాత్రం, 'ఇది కక్షసాధింపు చర్య' అంటూ పరమ రొటీన్ పొలిటికల్ డైలాగు పేల్చేసి, చేసిన పాపాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదీ కోడెల మంచితనం అంటే. అవునవును, కోడెల మంచితనం గురించి తెలియనిదెవరికి.? గుంటూరు జిల్లాలో ఎవర్నయినా చెబుతారు కథలు కథలుగా కోడెల గురించి.!