Advertisement

Advertisement


Home > Politics - Gossip

లాక్ డౌన్ సంకేతం : తె-తెదేపా షట్ డౌన్!

లాక్ డౌన్ సంకేతం : తె-తెదేపా షట్ డౌన్!

కరోనా భయానికి ప్రభుత్వాలు రాష్ట్రాల్ని లాక్ డౌన్ చేశాయి. కానీ ఈ సందర్భంగా ఒక రాజకీయ సంకేతం కూడా కనిపిస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏకంగా షట్ డౌన్ అయినట్టే! ఇక్కడ ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్ అయినట్టేనని అంతా అనుకుంటున్నారు. ఈ కరోనాకు సంబంధించిన అడుగులు వేయడంలో.. తెలంగాణలో పార్టీని... ఆ రాష్ట్రమ్మీద రాజకీయ ఆశలని పూర్తిగా వదులుకున్నట్లేనని చంద్రబాబునాయుడు స్పష్టంగానే సంకేతాలు ఇస్తున్నారు. కరోనా ధాటికి విలవిల్లాడుతున్న సామాన్య ప్రజానీకానికి ఆప్త హస్తం అందించేందుకు ప్రముఖులందరూ భూరి విరాళాలు ప్రకటిస్తుండగా.. చంద్రబాబునాయుడు కేవలం పది లక్షలరూపాయలు, అది కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి మాత్రమే ఇవ్వడం గమనార్హం.

చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతం ఇప్పుడు ఏమైపోయిందో ఎవ్వరూ అడగడం లేదు. ఆయన తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న నాటినుంచి తెలంగాణ-ఆంధ్ర తనకు రెండు కళ్లు అంటూ కొత్త సిద్ధాంతం ప్రవచించి అభాసుపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం మీద అనేక సందర్భాల్లో అనేకానేక జోకులు పేలుతూనే ఉన్నాయి. చంద్రబాబు వాటన్నిటినీ భరిస్తూనే ఉన్నారు.

ఆయన ఎంతగా తెలంగాణ కూడా తనకు ఒక కన్ను లాంటిదని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ... తెలంగాణ సమాజం ఆయనను నమ్మలేదు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దారుణాతిదారుణంగా ఓడించారు. పార్లమెంటు ఎన్నికల్లో అసలు పార్టీకి దిక్కే లేకుండా పోయింది. ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి చూస్తే.. భవిష్యత్తులో కూడా తెలుగుదేశానికి ఇప్పుడు దక్కిన ఒక్క సీటు బోణీ అయినా మళ్లీ వస్తుందనే గ్యారంటీ లేదు. చంద్రబాబునాయుడుకు తెలంగాణ రాజకీయాల మీద ఆసక్తి, ఆశ పూర్తిగా ఉడిగిపోయినట్టే.

ఇలాంటి కారణాల వల్లనే.. ఆయన తెలంగాణ రాష్ట్రానికి కరోనా పోరాటం కోసం.. ఒక్క రూపాయి కూడా విదిల్చలేదనే అభిప్రాయం వినవస్తోంది. నిజానికి చంద్రబాబు సొంత ఇల్లు, కుటుంబం నివసిస్తున్న హైదరాబాదు కూడా ఈ రాష్ట్రంలోనే ఉంది. ఈ రాష్ట్రంలోనే.. ఆంధ్రప్రదేశ్ కంటె కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అయినా సరే.. చంద్రబాబు పట్టించుకోలేదంటే.. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ దుకాన్ బంద్ అయినట్లే అని అంతా అనుకుంటున్నారు.

ఆంధ్రాకి పోవాలా.. ఈ క్యూలైన్ చుడండి

అందర్నీ చూసుకుంటా.. ఎక్కడివాళ్ళు అక్కడే ఉండండి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?