ఈ పైశాచికానికి ఇప్పుడే సమయం దొరికింది !

ఏదో ఒక దేశాన్ని కాదు, ప్రపంచం మొత్తాన్ని గడగడా వణికిస్తూ ప్రాణాలు తీస్తోంది కరోనా వైరస్. కొన్ని దేశాల్లో ఎక్కువ, కొన్ని దేశాల్లో తక్కువ. అంతే తేడా. అందుగలడిందు లేదను సందేహము వలదు చక్రి…

ఏదో ఒక దేశాన్ని కాదు, ప్రపంచం మొత్తాన్ని గడగడా వణికిస్తూ ప్రాణాలు తీస్తోంది కరోనా వైరస్. కొన్ని దేశాల్లో ఎక్కువ, కొన్ని దేశాల్లో తక్కువ. అంతే తేడా. అందుగలడిందు లేదను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు.. అన్నట్లుగా కరోనా బారిన పడని దేశం భూ ప్రపంచమంతా వెదికినా దొరకదు అన్నట్లుగా తయారైంది పరిస్థితి.

ఇది ప్రపంచ యుద్ధం కంటే చాలా పెద్దది అని కొందరు అంటున్నారు. అది వాస్తవం. చనిపోయినవారు చనిపోగా కోట్లాదిమంది ఆకలి బాధతో అల్లాడిపోతున్నారు. ఎవరైనా చనిపోతే ఎక్కడో ఉన్న కన్నకొడుకులు, కూతుళ్లు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ ను తరిమికొట్టి ప్రజలను కాపాడాలని దేశదేశాల వైద్యులు, పరిశోధకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, మనుషులను చంపడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉగ్రవాదులు, తీవ్రవాదులు సరిగా ఇదే సమయాన్ని ఎంచుకున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రవాదులు తెగబడ్డారు. గురుద్వారాపై దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 25 మంది సిక్కులు చనిపోయారు. గురుద్వారాలో నూటా యాభైమంది ప్రార్ధనలు చేస్తుండగా ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. తుపాకులతో కాల్పులు జరిపారు. ఇక ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు 17 మంది జవాన్ల ప్రాణాలు తీశారు.

ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు సమయం, సందర్భం ఏమీ లేదు. ప్రపంచం ఏమైపోతున్నా వారికి పట్టదు. పోలీసులను, అమాయక ప్రజలను చంపడమే వారి పని. మహమ్మారి కరోనాయే నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటే, దానికి అదనంగా ఉగ్రవాదులు సాగించిన మారణహోమం మరొకటి. ప్రభుత్వాలు అనేక ఆంక్షలు విధించి సామాన్య ప్రజలను ఇళ్లకు పరిమితం చేశాయిగానీ భద్రతా దళాలకు ఎలాంటి మినహాయింపు లేదు.

మావోయిస్టులను ఏరివేసే పనిలో కూంబింగ్ చేసే దళాలకు ఏ మూల నుంచి ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు. దేశాన్ని కాపలా కాసే భద్రతా దళాలకు ఉగ్రవాదులతో ఎప్పుడు ముప్పు వస్తుందో తెలియదు. అలాగే సామాన్య ప్రజలనూ ఉగ్రవాదులు వదిలిపెట్టరు. కరోనాయే పెద్ద ఉగ్రవాదం. దానికి మానవ ఉగ్రవాదమూ తోడైతే ఇక చెప్పేది ఏముంది ?

అందర్నీ చూసుకుంటా.. ఎక్కడివాళ్ళు అక్కడే ఉండండి