ప్రపంచానికి కరోనా వైరస్ ఒక్కటే ప్రమాకరమైతే…ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదనంగా అలాంటి మరికొన్ని వైరస్ల ప్రభావంతో విలవిలలాడుతున్నారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం ఏమంటే ఆ ప్రమాదరకర వైరస్‌లను ప్రజలు గుర్తించారు. ఆ వైరస్లు కంటికి కనిపించేవే. కరోనా వైరస్ కంటికి కనిపించని సూక్ష్మ జీవి అనే విషయం తెలిసిందే.
కరోనాతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్న ఆ వైరస్లు రాజకీయ, మీడియా ముసుగులో ఉన్నాయి. వాటికి దేశం, ప్రపంచ విపత్తుతో సంబంధం లేదు. 24 గంటలూ సీఎం జగన్ లక్ష్యంగా విషాన్ని కక్కుతుంటాయి.
కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రధాని మోడీ 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. కరోనా వైరస్‌కు మందు లేదని, కేవలం దానికి దూరంగా ఉండడం ఒక్కటే మన ముందున్న పరిష్కార మార్గంగా ప్రధాని మొదలు ప్రతి ఒక్కరూ చేస్తున్న హెచ్చరిక.
ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఇళ్లలో నుంచి అనవసరంగా బయటికొస్తున్న వాళ్లను కట్టడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో హాస్టళ్లు మూనివేయడంతో పెద్ద ఎత్తున ఆంధ్రాకు బయల్దేరారు. వారందరినీ క్వారంటైన్లోకి పోవాలని ప్రభుత్వం కోరుతోంది. కానీ హైదరాబాద్ నుంచి వచ్చిన యువత ఒప్పుకోవడం లేదు. ఇది అసలు సమస్య.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ గురువారం ప్రెస్‌మీట్ పెట్టారు. మన వాళ్లైనప్పటికీ రాష్ట్రంలోకి అనుమతించలేని పరిస్థితి తనను కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్లను అనుమతిస్తామని, ఇక మీదట ఎవరూ రావద్దని ఆయన చేతులో జోడించి వేడుకున్నారు.
సీఎం ప్రెస్‌మీట్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. ఆయన ఏమన్నారంటే….
“విపత్కర సమయంలో సీఎం జగన్ ప్రసంగం ప్రజల్లో భరోసా పెంచలేకపోయింది. సీఎం రాష్ట్రానికి నాయకుడిగా మాట్లాడలేదు. విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్యను కచ్చితంగా ప్రకటించలేకపోవడం ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెడుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయిన ఏపీ విద్యార్థులు, ప్రజలను స్వస్థలాలకు చేర్చే విషయంలో ప్రభుత్వ తీరు ఆక్షేపణీయంగా ఉంది” అని విమర్శించారు. విద్యార్థుల సమస్యపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విటర్ వేదికగా జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ స్పందన కూడా కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఆయన జగన్ సర్కార్ గురించి పెద్దపెద్ద మాటలను కొన్ని రోజులుగా మాట్లాడుతున్నారు. కనీసం ఏపీ అంతా జాతీయ పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ నిలబెట్టే దమ్ము లేదు కానీ, విమర్శలు మాత్రం కోటలు దాటుతాయి. ఇంతకూ ఆయన ఏమంటున్నారంటే…
“హైదరాబాద్ నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ అసమర్థత బయటపడింది. కరోనా పట్ల జగన్ తేలిగ్గా మాట్లాడి క్షమించరాని తప్పు చేశారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే వేలాది మంది విద్యార్థులను రోడ్డుపై ఉంచారని, ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం దారుణం. అర్థరాత్రి సమయంలో అంత మందిని రోడ్లపై ఉంచి వారి జీవితాలతో ఆడుకోవటం అమానవీయం”….ఇదీ కన్నా వారి స్పందన.
ఒక వైపు ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఇళ్లకే పరిమితమై కరోనాను పారదోలాలని ప్రధాని పిలుపునిస్తారు. మరోవైపు హైదరాబాద్ నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ అసమర్థత బయటపడిందని కన్నా విమర్శిస్తారు? ఇంతకూ ఎవరి ఆదేశాలను పాటించాలో కన్నా లక్ష్మినారాయణ చెబితే బాగుంటుంది. లాక్డౌన్ ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్లందరిని హైదరాబాద్ నుంచి పంపేవాళ్లపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదో కన్నా లక్ష్మినారాయణ సమాధానం చెబుతారా?
ఇంకో అత్యంత ప్రముఖ నాయకుడు ఆంధ్రాలో ఉన్నారు. ఆయనే రామకృష్ణ. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి. ఇటీవల తెలుగుదేశం కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్‌లనే చదువుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకూ ఆయన ఏమంటున్నారంటే…
“రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలన్న డిమాండ్‌పై సీఎం ఎలాంటి ప్రకటన చేయలేదు. వైద్యానికి సంబంధించి తీసుకుంటున్న చర్యల గురించి వివరించి ఉండాల్సింది. ముంబయ్, హైదరాబాద్ నగరాల్లోనూ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అభవ్రతా భావంతో ఉన్న వలస కూలీల గురించి సీఎం ప్రస్తావించకపోవడం విచారకరం”…. అని రామకృష్ణ మండిపడుతున్నారు. బాబు డైరెక్షన్లో నడుస్తున్న కమ్యూనిస్ట్ నాయకుడీయన.
ఇక ఇంత పెద్ద విపత్కర పరిస్థితుల్లోనూ జగనే తమ సమస్యగా టీవీ5, ఏబీఎన్ చానళ్లు వార్తలను వండివారిస్తున్నాయి. మరీ ముఖ్యంగా టీవీ5 అయితే ఏ మాత్రం విచక్షణ లేకుండా ఏకంగా సీఎం జగన్‌ను ఓ ముఠా నాయకుడంటూ గంటల తరబడి చర్చా కార్యక్రమాలు నడిపిస్తోంది. వీళ్ల మాటలను వింటుందే, ఎల్లో రాతలను చదువుతుంటే కనిపించని కరోనా వైరస్ కంటే…ఈ నాయకులు, మీడియా సంస్థలే భయపెడుతున్నాయి. కరోనా వైరస్ కంటే ఏపీ సమాజానికి వీళ్లే ప్రమాదకరమైన వైరస్‌లనే అభిప్రాయం బలపడుతోంది.