మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాను మాత్రమే మేధావినని, మిగిలిన వాళ్లు అజ్ఞానులని భావిస్తుంటారు. తానేం మాట్లాడిన, చేసినా ప్రజలు గుర్తించలేరని భ్రమ పడుతుంటారు. అందుకే ఆయన మీడియా ముందుకొస్తే గంటల తరబడి మాట్లాడుతూ ఇటు జర్నలిస్టులను, అటు ప్రజలను విసుగిస్తుంటారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. మోడీకి దగ్గర కావడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తడానికి చంద్రబాబు ఏ చిన్న అవకాశం వచ్చినా విడిచిపెట్టడం లేదు. కరోనా మాట వింటే చాలు జనం హడలి పోతుంటే…చంద్రబాబు మాత్రం తనకు అదే కావాల్సిందన్నట్టుగా ప్రతి రోజూ ఆ సాకుతో మీడియా ముందుకొచ్చి ఉచిత ప్రచారం పొందుతున్నాడు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడంతో…మన మీడియా ముద్దుబిడ్డ చంద్రబాబు అందరూ ఊహించినట్టే ప్రత్యక్షమయ్యాడు. మోడీని ప్రశంసలతో ముంచెత్తడంతో పాటు పనిలో పనిగా జగన్‌పై బురద చల్లాడు. ఇంతకూ ఆయన ఏమన్నారంటే….
‘ధనిక, పేద అనే తేడా లేకుండా కరోనా అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. పేదలు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల కోట్ల ప్యాకేజీని స్వాగతిస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్యాకేజీ ప్రకటించకపోవడాన్ని గర్హిస్తున్నాం. మొక్కుబడిగా రూ.వెయ్యితో సరిపెట్టకుండా కేంద్ర ప్యాకేజీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి’… అని డిమాండ్ చేశాడు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో అందరికంటే చంద్రబాబుకే బాగా తెలుసు. ఎందుకంటే గత ఐదేళ్లలో మొత్తం ఊడ్చేసి అధికారం నుంచి దిగిపోయే నాటికి ఏపీ ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మిగిల్చి వెళ్లిన ఘనత చంద్రబాబుది. మరిప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్యాకేజీ ప్రకటించకపోవడాన్ని బాబు తప్పు పడుతున్నాడు.
గత ఐదేళ్లలో వేల కోట్లు దోచివేతకు కారణమైన చంద్రబాబు…కరోనా వల్ల దేశంతో పాటు రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉంటే…జేబులో నుంచి డబ్బు తీయడానికి మనసు రావడం లేదు. కేవలం రూ.10 లక్షలతో బాబు సరిపెట్టాడు. మరి ఇదే అమరావతి కోసం మాత్రం ఆయన జోలె పట్టి ఊరూరు తిరుగుతూ విరాళాలు సేకరించాడు. ఆ స్ఫూర్తి ఇప్పుడేమైంది? నితిన్ లాంటి చిన్న హీరో కూడా ఏపీకి రూ.10 లక్షల విరాళం ఇచ్చాడు. అలాంటి వాళ్లనైనా కనీసం తండ్రీకొడుకులైన బాబు, లోకేశ్ ఎందుకు తీసుకోలేదు?
ఇతరులు మంచి చేయాలి, తాము మాత్రం ప్రచారం పొందాలనే ఏకైక లక్ష్యం తప్ప….ప్రజలపై తండ్రీకొడుకులిద్దరికీ ఏ మాత్రం ప్రేమ లేదు. అమరావతి రాజధాని రైతుల ఉద్యమానికి తన బంగారు గాజులను విరాళం కింద ఇచ్చిన బాబు ధర్మపత్ని…ఇప్పుడు ఆ దాతృత్వం, దయాగుణం ఏమయ్యాయి? జగన్ సర్కార్ తన శక్తి మేరకు రూ.వెయ్యి ఇవ్వడాన్ని కూడా బాబు తప్పు పడుతున్నాడు. ముందు తాను దోచుకున్న సొమ్ములో కనీసం అతి పెద్ద విపత్కర సమయంలోనైనా కష్టాల్లో ఉన్న జనానికి ఇద్దామన్న ఆలోచన లేకుండా విమర్శలకు పరిమితం కావడం ఒక్క బాబుకే చెల్లు.