భారతీయ జనతా పార్టీ నాయకులకు హఠాత్తుగా ఎక్కడలేని చురుకుదనం పుట్టుకొచ్చింది. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన మీద ఎడాపెడా విరుచుకు పడి పోతున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలన లో ఏమేం లోపాలు ఉన్నాయో, ఇప్పుడే గుర్తుకొచ్చినట్లుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శల జడివాన కురిపిస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా దగ్గుబాటి పురందేశ్వరి కూడా నోరు చేసుకుంటున్నారు.
ఇందుకు ఆమె ఏమంటున్నారంటే కక్షపూరిత పాలను తప్ప అభివృద్ధి ఆమెకు కనిపించడం లేదట, రివర్స్ టెండరింగ్ వలన పోలవరం పనులు వెనక్కి వెళ్ళాయట.. మూడు రాజధానుల వలన పెట్టుబడులు రావడం లేదట… ప్రభుత్వ విధానాలతో పరిశ్రమలు మరలి పోతున్నాయట… నిజానికి ఇవన్నీ పాచిపోయిన పాత ఆరోపణలే! భాజపా నాయకులు జగన్ ను దూషించ తలచుకున్నప్పుడల్లా ఇవే మాటలు వల్లిస్తున్నారు.
కాకపోతే పురందేశ్వరి ప్రస్తుతం కొత్తగా చెబుతున్నది ఏంటంటే … మండలి రద్దు కు శాసనసభ తీర్మానం చేయడం గురించి! శాసన మండలి వలన ఉపయోగం లేదని అంటున్నారని… అలాంటప్పుడు మొదటి భేటీలోనే దానిని ఎందుకు రద్దు చేయలేదని ఆమె ప్రశ్నిస్తున్నారు.
ఈ మాజీ కేంద్ర మంత్రి గారికి గుర్తుందో లేదో కానీ… ఆమె తండ్రి నందమూరి తారక రామారావు కూడా ఆ విధంగా చేయలేదు. ఆయన కూడా, ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎప్పుడైతే తనకు శాసనమండలి వలన ఇబ్బంది ఎదురైందో… అప్పుడే ఆగ్రహించి, దానిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపారు.
ఆయన కూడా శాసనమండలి అనవసరం అని భావించారు. అలాగని మొదటి బేటీ లోనే దానిని రద్దు చేసి పారేయలేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే, శాసన మండలి అతిగా వ్యవహరించి ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నాడని ఆయన భావించినప్పుడు మాత్రమే ఆ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా అచ్చంగా ఎన్టీఆర్ బాటలోనే పయనించారు. ఎమ్మెల్సీల వ్యవస్థను తొలుత ఆయన ఉపేక్షించారు. కానీ వారు ప్రభుత్వ పాలన నిర్ణయాలకు అడ్డుపడుతున్నారని అని అనుకున్న తర్వాత మండలి రద్దుకు ఉపక్రమించారు. జగన్ చర్య మాత్రం పురందేశ్వరికి తప్పుగా కనిపిస్తున్నట్లున్నది. ఆమె ఒక్కసారి గతంలోకి తొంగి చూసుకుంటే ఇలాంటి డైలాగులు రావేమో మరి!