మహానాడు వాయిదా వేశారు సరే… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అంతటితో ఊరుకుంటే సరిపోయేది. అయితే ఆయన, వాయిదా ప్రకటనతో మిన్నకుండకుండా… 28న ఎన్టీఆర్ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. గ్రామగ్రామాల్లో వాడవాడల్లో చాలా ఘనంగా ఎన్టీఆర్ జయంతి నిర్వహించాలని… మహానాడుకు నాగా పెట్టిన నేపథ్యంలో చంద్రబాబునాయుడు కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. అయితే… దీనిపై పచ్చ కార్యకర్తలు మాత్రం గుర్రుమంటున్నారు.
మహానాడు నిర్వహించడం అంటే… అందుకు కాగల ఖర్చు మొత్తం పార్టీ భరిస్తుంది. కీలక కార్యకర్తలంతా మూడురోజులు పనులు మానుకుని మహానాడుకు తరలివెళితే సరిపోతుంది. ఇప్పుడు ఊరూరా ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించడం, ర్యాలీలు, ప్రదర్శనలతో హోరెత్తించాలని పిలుపు ఇవ్వడం అంటే.. అదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా.. ఆ ఖర్చు భరించాల్సింది ఎవరు? అంటూ కార్యకర్తలు వేసారిపోతున్నారు.
మొన్ననే ఎన్నికలు ముగిశాయి.. అభ్యర్థుల నుంచి నిధుల ప్రవాహం ఎంతగా ఉన్నప్పటికీ… కార్యకర్తల స్థాయిలో కూడా.. ఎక్కడికక్కడ ఎంతోకొంత చేతిచమురు వదిలించుకోవడం అనేది అనివార్యంగా జరిగింది. మళ్లీ అధికారంలోకి వస్తే తప్ప.. ఈ నష్టాన్ని పూడ్చుకోవడమే సాధ్యంకాదని భయపడుతుండగా.. ఎన్టీఆర్ జయంతి.. ప్రదర్శనలు అంటూ ఆర్భాటం చేయడం.. భారం తమమీద పడుతుందని వాపోతున్నారు. ఆర్భాటాలకు నిధులు సమీకరించే పరిస్థితి ప్రస్తుతం లేదని, పార్టీ ఓడిపోతే… విరాళాలు ఇచ్చేవారు కూడా మొహం చాటేస్తారని ఆందోళన చెందుతున్నారు.
ఎన్టీఆర్ జయంతి.. అంటే చంద్రబాబు పిలుపు ఇవ్వకపోయినా సరే.. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించే నిజమైన అభిమానులు ప్రతిఊరిలోనూ ఉన్నారు. అయితే చంద్రబాబు మహానాడు చేయకపోగా… జయంతి పేరిట ఆర్భాటం చేయమంటే మాత్రం ఆ భారం కార్యకర్తలు, లోకల్ నాయకుల మీద పడుతుంది. పదవులు, ఫలితాలు మీరు అనుభవిస్తూ మాకు బ్యాండేస్తున్నారా? అంటూ ఈ నిర్ణయంపై వారు వాపోతున్నారు.