రఘురామకృష్ణరాజు కేసులో ఏ2, ఎ3 గా రెండు మీడియా సంస్థలను ఆంధ్ర పోలీసులు పేర్కొన్నారు. ఇది కాస్త ఆలోచింపతగిన వ్యవహారమే. ఇందులో మీడియా సంస్థల తప్పు లేదా జోక్యం ఏమేరకు వున్నాయి అన్నది ఒక పాయింట్. అసలు ఇలా మీడియా సంస్థలను బాధ్యులను చేయవచ్చా అన్నది మరో పాయింట్.
ముందు రెండో పాయింట్ ను చూద్దాం. ఒక వ్యక్తి లేదా ఒక నాయకుడు లేదా ఒక సంస్థ ఏదైనా సరే మీడియా ముందుకు రావచ్చు. మీడియా వున్నదే అందుకు. అలాగే వివిధ పరిణామాలను మీడియా రిపోర్టు చేయవచ్చు. మీడియా వున్నదే అందుకు. వార్త, వ్యాఖ్యానం, రిపోర్టు ఏదైనా సరే మీడియా నిత్యం చేసే వ్యవహారం. ఇందులో వెస్టెడ్ ఇంట్రస్ట్ లు వుండొచ్చు, వుండకపోవచ్చు.
ఒక అంశం మీద ఒక్కో మీడియా ఎక్కువ ఫోకస్ పెట్టొచ్చు. గతంలో అనేక కుంభకోణాల ఆధారంగా అనేక మీడియా సంస్థలు అనేక ప్రభుత్వాలను, రాజకీయ పార్టీలను టార్గెట్ చేసిన సందర్భాలు అనేకం వున్నాయి. బోఫోర్స్ ఉదంతం దగ్గర నుంచి ఆంధ్రలో ఏలేరు భూముల కుంభకోణం మీదుగా ఎన్నో వ్యవహారాలు మీడియా ముఖంగానే బయటకు వచ్చాయి.
అలాగే ప్రతిపక్షనేతలు లేనా రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినపుడు వాళ్లకు వత్తాసు పలకడం లేదా వాళ్లని హైలైట్ చేయడం అన్నది కొన్ని మీడియాలు చేస్తుంటాయి. ఇదంతా వారి వారి పాలసీ ప్రకారం వుంటుంది. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని రాజకీయ పక్షాలు లేదా ఆ అంశాల బాధితులు మీడియాను నిలదీయవచ్చు.
కానీ దాని ఆధారంగా కేసులు పెట్టడం అన్నది సరియైనదేనా? ఎందుకంటే గతంలో అజ్ఞాతంలో వున్న నక్సల్స్ ను మీడియా ఇంటర్వ్యూ చేసిన దాఖలాలు, వారి అభిప్రాయాలను నేరుగా అందించిన వ్యవహారాలు వున్నాయి. అక్కడ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏ సెక్షన్ అయితే పెట్టిందో అది పెట్టడానికి అవకాశం వుంది. అంతే కాదు, ఇదే సెక్షన్ ను మీడియా మీద ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఎందుకంటే మీడియాలో ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు.
రఘురామ కృష్ణం రాజు వ్యక్తిగత హోదాలో నిత్యం ప్రభుత్వం మీద, ప్రభుత్వలో వున్నవారి మీద, పార్టీలో వున్నవారి మీద, ఆఖరికి ఓ వర్గం మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే, ఆయనకు కౌంటర్లు కూడా పడుతున్నాయి. రఘురామరాజుకు వత్తాసు పలుకుతున్న మీడియా సంస్థలు వాటిని ఎంకరేజ్ చేసి వుండకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో అవి ఇబ్బడిముబ్బడిగా వున్నాయి.
రఘురామ కృష్ణం రాజు కు రెండు మీడియా సంస్థలు దన్నుగా వున్నాయి. ఆయన మాటలకు అవి ప్రాధాన్యత ఇచ్చాయి. ఆయన కౌంటర్ పార్ట్ కు మీడియా సంస్థల దన్ను లేకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో గట్టిగానే కౌంటర్లు రకరకాల మాధ్యమాల రూపంలో వున్నాయి. అంటే ఎవరి మాధ్యమాన్ని వారు ఆశ్రయించి ఎవరి బురద వారు జల్లుకున్నారు. ఇదేగా జరిగింది. ఇక ప్రభుత్వం ఇందులో ఎందుకు జోక్యం కల్పించుకోవాల్సి వచ్చింది అన్నది ప్రశ్న.
ఇండియన్ పీనల్ కోడ్ లో వున్న కొన్ని అవకాశాలను వాడుకుని ప్రభుత్వం కేసులు పెట్టింది. రఘురామకృష్ణం రాజుతో కలిసి ఈ మీడియా సంస్థలు కుట్ర చేసాయన్నది ఆరోపణ. మరి ప్రభుత్వ అనుకూల వైఖరితో వున్నవారు సోషల్ మీడియాలో ఇదే మీడియా సంస్థల మీద జల్లిన బురదకు సమాధానం ఎవరు చెబుతారు. అలా అంటే మీడియా సంస్థలు కేసుపెట్టుకోవాలి అని ఎవరైనా అనొచ్చు. ఇలా పెట్టుకుంటూ పోతే అటు, ఇటు కేసులు పడుతూనే వుంటాయి.
ఇక ఇప్పుడు మొదటి పాయింట్ కు వద్దాం. మీడియా సంస్థల తప్పు లేదా జోక్యం ఎంతవరకు వుంది అన్నది చూద్దాం.
వర్తమాన జర్నలిజంలో తప్పు ఏమిటంటే వార్తను, వ్యాఖ్యను కలగాపులగం చేసేయడం. వార్తను వార్తగానూ, వ్యాఖ్యను వాఖ్యగానూ అందించడం అన్నది ఎప్పుడో మానేసారు. గతంలో ఎవరైనా ఎవరినైనా దొంగ అని అంటే, ఫలానావాడు దొంగ అని హెడ్డింగ్ పెడితే మధ్యలో ఫలానావాడి ఆరోపణ అని వుండేది. కానీ ఇప్పుడు అదంతా మాయం అయిపోయింది. వాడు దొంగ అని తాటికాయంత అక్షరాలతో వేయడం, వార్తను వ్యాఖ్యను కలిపేసి కొత్త వంటకం వండి వడ్డించడం ఇదే పద్దతి. దీనికి ఏ మీడియా కూడా అతీతం కాదు.
పైగా ఇటీవల యూ ట్యూబ్ మీడియా ఒకటి తయారయింది. ఇక్కడ శీర్షికలు మరీ దారుణం. అస్సలు కంటెంట్ కు, శీర్షికకు సంబంధం వుండదు. ఈ దారుణం మీద ఇప్పటికి ఎందరో గొంతు విప్పారు కానీ యూ ట్యూబ్ నిర్వాహకులు మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ప్రభుత్వాలు కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవు. ఆ పెట్టే కేసు ఏదో, ఇలాంటి తప్పుడు హెడ్డింగ్ లు పెడుతున్న ఛానెళ్లపై లేదా ఇంకా స్పందన సరిగ్గా రావాలంటే యూ ట్యూబ్ ప్రతినిధులపై పెట్టాలి. అప్పటికైనా ప్రాంతీయ భాష తెలిసిన వారిని అపాయింట్ చేసుకుని ఈ తరహా వ్యవహారానికి అడ్డుకట్ట వేసే అవకాశం వుంది.
మీడియాకు రాజకీయ ఆసక్తులు వుండొచ్చు. కానీ వ్యక్తిగత వైరాలు వుండకూడదు. వుంటే వండి వార్చే వార్తలు, పెట్టే శీర్షికలు అలాగే వుంటాయి. వాటి పర్యవసానాలు ఇలాగే వుంటాయి. ప్రెస్ కౌన్సిల్ అన్నది దాని అజమాయషీ అన్నదీ ఎప్పుడో పలుచనయిపోయింది. మీడియాకు అంబుడ్స్ మన్ లాంటి వ్యవహారం అవసరం అని ది హిందూ లాంటి మీడియా కొనేళ్ల క్రితం ఆ దిశగా ప్రయత్నాలు చేసింది.
కనీసం తెలుగు మీడియా సంస్థలు అన్నీ కలిసి అలాంటి వ్యవహారానికి తెరతీసి, కొన్ని కట్టుబాట్లు, గీతలు ఏర్పరచాల్సి వుంది. లేదూ అంటే ముందు ముందు మీడియా సంస్థలకు గడ్డుకాలమే. వాటిలో పని చేసేవారికీ కష్టకాలమే. ఎందుకంటే సోషల్ మీడియాపై కేసులు పెట్టడం అన్నది చంద్రబాబు ప్రారంభించారు. జగన్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అది మెయిన్ స్ట్రీమ్ మీడియాకు పాకింది. మళ్లీ చంద్రబాబు కావచ్చు. మరెవరైనా అధికారంలోకి వస్తే కొనసాగింపు వుంటుంది తప్ప, ఫుల్ స్టాప్ పడదు.
మీడియా యాజమాన్యాలు బాగానే వుంటాయి. ప్రభుత్వాలు బాగానే వుంటాయి. మధ్యలో మీడియా జనాలు నలిగిపోతారు. జీతం ఇస్తున్నందుకు మీడియా తరపున పనిచేయాలి. ఆ మీడియా పాలసీలకు అనుగుణంగా నానా కూతలు కూయాలి. నానా రాతలు రాయాలి. అలా పని చేసినందుకు ప్రభుత్వం నుంచి తాఖీదులు అందుకోవాలి?
సీనియర్ జర్నలిస్టులు, మేధావులు ఆలోచించాల్సిన తరుణం వచ్చేసింది.
చాణక్య