పరిస్థితులు పాఠాలు నేర్పుతాయి. నేర్చుకోవాలి కూడా. దశాబ్దాల కాలంగా ఆంధ్ర జనాలు కావచ్చు తెలుగు జనాలు కావచ్చు హైదరాబాద్ మీద దృష్టి పెట్టిన ఫలితంగా అక్కడ విపరీతమైన ప్రగతి సాధన సాధ్యమైంది. కేవలం పారిశ్రామికంగా మాత్రమే కాదు వైద్యపరంగా కూడా హైదరాబాద్ నే ముందు స్థానాన్ని ఆక్రమించింది.
ఈ రోజు వైద్యం కోసం అందరూ హైదరాబాద్ పరుగులు పెడుతున్నారు అంటూ వెక్కిరిస్తున్న చంద్రబాబు సైతం తన పాలనలో ఈ కీలక విషయాన్ని విస్మరించారు. అక్కడికి ఈ వ్యవహారంతో సంబంధం లేనట్లు ఆయన ట్వీట్లు వేసి ప్రకటనలు చేస్తుంటారు.
ఎక్కడ రైలు, రోడ్, సముద్ర రవాణా సదుపాయాలు వుంటాయో అక్కడ ప్రగతి సాధ్యం అవుతుంది. అదే విధంగా ఎక్కడ మెడికల్ కాలేజీలు వుంటాయో అక్కడ వైద్య సదుపాయాలు మెరుగ్గా వుంటాయి.
ఆంధ్రకు వచ్చేసరికి విశాఖ, కాకినాడ, గుంటూరు, విజయవాడ, తిరుపతి ప్రాంతాలు మాత్రమే ఈ తరహా స్థాయికి కొంత వరకు చేరుకున్నాయి. అయితే ఆంధ్రలో కూడా విశాఖ, విజయవాడ లాంటి కొన్ని ప్రాంతాలను తప్పిస్తే మిగిలిన చోట్ల కూడా ఇబ్బడిముబ్బడిగా వైద్య సదుపాయాలు లేవు. పైన చెప్పుకున్న సెంటర్లలో కూడా డాక్లర్ల సంఖ్య ఎక్కువగా పెరిగింది, నిపుణులైన వైద్యులు వున్నారు తప్ప, అత్యాధునిక సదుపాయాలున్న ఆసుపత్రులు తక్కువ.
విశాఖలో ప్రయివేటు మెడికల్ కళాశాలలు వచ్చాయి కాబట్టి, అలాగే విశాఖ నగరం బాగా అభివృద్ది చెందింది కనుక కొంత వరకు ఆ కొరత తీరింది. కానీ మిగిలిన నగరాల పరిస్థితి అలా లేదు. ఇదిలా వుంటే ఆంధ్రలో బి క్లాస్ పట్టణాలు పెద్ద సంఖ్యలో వున్నాయి.
శ్రీకాకుళం జిల్లా నుంచి కడప కర్నూలు వరకు ఇలాంటి పట్టణాల సంఖ్య దాదాపు నలబై యాభై వరకు వుంది. వీటన్నింటికి ఆధునిక వైద్య సదుపాయాలు కొంచెం దూరంగానే వున్నాయి. ఉత్తరాంధ్ర జిలాల్లో చూసుకుంటే విశాఖనే కీలకం. ఈస్ట్ కు కాకినాడ, రాజమండ్రి, వెస్ట్ కు ఏలూరు ఇలా…కానీ ఈ జిల్లాలు అన్నింటిలో బి క్లాసి టౌన్ లు చాలానే వున్నాయి. అక్కడా పేరుకు ఆసుపత్రులు వున్నాయి కానీ ప్రాణం మీదకు వస్తే పరుగులు పెట్టి ప్రధాన పట్టణాలకు పోవాల్సిందే.
ఇన్నాళ్లూ ఈ అవసరం పెద్దగా తెలియలేదు. కానీ కోవిడ్ పుణ్యమా అని ఇప్పుడు తెలిసి వస్తోంది. జనం ప్రధాన నగరాలకు పరుగులు తీస్తున్నారు. చిన్న నగరాలకు ఆక్సిజన్ సదుపాయాలు అందడం లేదు. అటు చెన్నయ్, ఇటు హైదరాబద్ లకు దగ్గర వున్నవారు అటు చేరుతున్నారు.
ఇదంతా ఓ లెసన్ కావాలి. నిజానికి ఈ పరిస్థితికి ముందే సిఎమ్ జగన్ ఓ మంచి ప్రణాళిక వేసారు. కానీ అమలు మాత్రం అంత చురుగ్గా లేదు. కొత్తగా జిల్లా కేంద్రాలు కాబోయే లేదా పార్లమెంట్ స్థానాలు అయిన సెకెండ్ క్లాస్ పట్టణాలు అన్నింటిలో మెడికల్ కళాశాలలు ప్రారంభించాలని జగన్ ప్రతిపాదించారు. ఆమోదించారు. కానీ ఒక్కో కళాశాల, దానికి అనుబంధంగా ఆసుపత్రి నిర్మించాలి అంటే ఒక్కోదానికి రెండు మూడు వందల కోట్లు అవసరం.
ముందుగా ఇప్పటికి నాలుగు కాలేజీలకు మాత్రం టెండర్ల దశకు చేరుకుంది ఈ వ్యవహారం. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ గుణపాఠం చూసిన తరువాత మిగలిన ఖర్చులు తగ్గించి లేదా కొత్త అప్పులు చేసి అయినా అన్ని కళాశాలలు ఒకేసారి ప్రారంభించాల్సిన అగత్యం వుంది. ఎప్పుడయితే సెకెండ్ క్లాస్ నగరాల్లో మెడికల్ కాలేజీలు వస్తాయో, ప్రయివేటు వైద్య సదుపాయాలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు జల్లే ఈ విత్తనాలు కనీసం మరో అయిదేళ్లకు ఫలితాలు ఇస్తాయి.
జనం ప్రధాన నగరాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి మారుతుంది. హైదరాబాద్ కు ప్రత్యామ్నాయంగా మన నగరాల్లో కూడా ఐటి, తదితర వ్యవహారాలను అభివృద్ది చేస్తే సరిపోదు. వైద్య సదుపాయాలను కూడా మెరుగు పర్చాలి.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫ్రాధమిక ఆరోగ్య కేంద్రాల మీద దృష్టి సారించింది. వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు విడుదల చేసింది. ఈ మధ్యనే ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయాలు అందుబాటులో వుంచాలనే ఆదేశాలు కూడా వెలువడ్డాయి కానీ అవి ఇంకా కార్యరూపం దాల్చినట్లు కనిపించడం లేదు.
కరోనా వైరస్ అన్న ఉత్పాతం మానవాళి ఊహించనిది. భవిష్యత్ అనేది ఇంకా భయానకంగానే వుంటుంది తప్ప మరింత అద్భుతంగా మారిపోతుంది అని ఊహించడం దురాశే అవుతుంది. అందువల్ల ఇప్పటి నుంచే భవిష్యత్ పరిస్థితులు బేరీజు వేసి, అప్పటి అవసరాలు తీరేందుకు వీలుగా ద్వితీయ శ్రేణి నగరాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపర్చాలి. ఆక్సిజన్ ప్లాంట్ ల అవసరం బాగా తెలిసి వచ్చింది కాబట్టి, ఆ దిశగా స్వయం సమృద్ది సాధించడానికి కృషి చేయాలి.
కరోనా నేర్పుతున్న పాఠాలను, విసురుతున్న సవాళ్లను, చూపిస్తున్న లక్ష్యాలను అర్థం చేసుకుని, ఆ దిశగా వైద్య రంగాన్ని అభివృద్ది చేయకపోతే, భవిష్యత్ లో ఇలాంటి ఉత్పాతాలు వస్తే ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్థితి వుంటుంది. దారిపొడుగు జనశవాలతో భయానక దృశ్యాలు సాక్షాత్కరించే వైపరీత్యాలు సంభవించే ప్రమాదం వుంది తస్మాత్ జాగ్రత్త.
చాణక్య