“కాళ్లు వాచిపోయేలా పోలీసులు నన్ను కొట్టారు. నిన్న రాత్రంతా వేధించారు” అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తన ఆవేదన వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజు కేసులో ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
రఘురామ హౌజ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను గుంటూరులోని సీఐడీ న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు సీఐడీ కోర్టులో బెయిల్ పిటిషన్‌తో పాటు అత్యవసర వైద్య సాయం కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా తనను పోలీసులు కొట్టారంటూ జడ్జికి ఎంపీ ఫిర్యాదు చేశారు.
తన ఆవేదనను నాలుగు పేజీల లేఖ రూపంలో లిఖితపూర్వక ఫిర్యాదును న్యాయమూర్తికి అందజేశారని సమాచారం. కాలి గాయాలపై హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు.
ఎంపీ కాళ్లకు తగిలిన గాయాల ఆధారాలను ఎంపీ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రఘురామను ఆస్పత్రికి తరలించాలని సీఐడీ కోర్టు సూచించింది.
ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సకు రఘురామకృష్ణంరాజు ససేమిరా అనడంతో రమేశ్ ఆస్పత్రిలో చేర్పించాలని జడ్జి ఆదేశించారు. ఇదిలా ఉండగా ఎంపీ కాలిగాయాలు చూసి రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించినట్టు సమాచారం.
రఘురామకృష్ణంరాజును గాయపరచడంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఎంపీ తరపు న్యాయవాదులు వెల్లడించారు. అలాగే ఈ ఎపిసోడ్‌పై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేయడం విశేషం.