ఎన్నికల టైమ్ లో మంగళగిరిలో విస్తృతంగా పర్యటించారు. పనిలోపనిగా మంచి కామెడీ కూడా పండించారు. ఇలా పోలింగ్ ముగిసింది, అలా అంతర్థానమయ్యారు లోకేష్. 2 రోజులకు ఒక ట్వీట్ తప్ప ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఒక నాయకుడు ఏం చేయకూడదో సరిగ్గా అదే పని చేస్తున్నారు చినబాబు.
గెలిచినా, ఓడినా ప్రజల మధ్య ఉండాల్సిందే. నేతలంతా అదే పని చేస్తున్నారు. చివరికి పార్ట్ టైమ్ పొలిటీషియన్లు అని విమర్శలు ఎదుర్కొంటున్న పవన్, నాగబాబు కూడా ప్రజల్లో కనిపిస్తున్నారు. నాగబాబు అయితే ఓడిపోతానని తెలిసి కూడా తన నియోజకవర్గానికి మరోసారి వెళ్లారు. లోకేష్ మాత్రం పూర్తిగా మంగళగిరికి ముఖం చాటేశారు.
ఎన్నికల టైమ్ లో ఊరూవాడా అంతా తిరుగుతారు. ఎందుకంటే అది అవసరం. ఓట్ల కోసం ఎన్నో ఫీట్లు చేస్తారు. అయితే ఎన్నికల తర్వాత కూడా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. అది హుందాతనం. ప్రజల మధ్య తిరగకపోయినా, కనీసం మీడియాకు అయినా కనిపించాలి. లోకేష్ ఆ పని కూడా చేయలేదు. తండ్రి చంద్రబాబు ఆదేశాలతో ఆమధ్య ఎన్నికల సంఘంపై విరుచుకుపడి, సమీక్షలు నిర్వహిస్తానని ప్రకటించిన చినబాబు.. ఆ తర్వాత పత్తా లేకుండాపోయారు.
మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీడీపీ నుంచి బరిలోకి దిగిన లోకేష్ మధ్య భారీ పోటీ నెలకొంది. ఇద్దరూ హోరాహోరీగా ప్రచారం చేశారు. అయితే పోలింగ్ తర్వాత కూడా ఆర్కే అక్కడే ఉన్నారు. ప్రజలతో మమేకమైపోయారు. లోకేష్ మాత్రం ఇంట్లో కూర్చున్నారు. ట్వీట్లతో కాలక్షేపం చేస్తున్నారు.
లోకేష్ భాషలోనే చెప్పుకోవాలంటే, ఆయన ఇప్పుడు కూడా మంత్రి. పరిమిత అధికారాలతోనే కావాలంటే చాలా చేయొచ్చు. కానీ ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారు. కోడ్ కారణంగా చీకటి జీవోలు ఇష్యూ చేసే పరిస్థితి లేకపోవడంతో, ఎంచక్కా ఏసీలోనే కాలక్షేపం చేస్తున్నారు.