Advertisement

Advertisement


Home > Politics - Gossip

‘మసీదుకు స్థలం’ తీసుకోవడంపై మీమాంస!

‘మసీదుకు స్థలం’ తీసుకోవడంపై మీమాంస!

అయోధ్య వివాదం అనేది చాలా సున్నితనమైన సమస్య. దేశంలో కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు-హిందువుల మధ్య వైషమ్యాలు నివురుగప్పి ఉంటున్నప్పటికీ.. మెజారిటీ ముస్లింలు.. హిందువులతో అత్యంత స్నేహ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండే సమాజం మనది. మన తెలుగు ప్రాంతాల్లో లాగానే.. చాలా చోట్ల ముస్లింలు- హిందువులు బంధుత్వపు వరసలు పెట్టి పిలుచుకుంటూ ఉండడం కద్దు. అలాంటి మన దేశంలో.. అయోధ్య వివాదంపై సుప్రీం తీర్పు అనంతర పరిణామాలు కూడా అంతే సామరస్యంగా.. సుహృద్భావ వాతావరణంలో జరగవలసి ఉంది.

ఇప్పుడు వాతావరణంలో కొంత తేడా కనిపిస్తోంది. ముస్లింలలో కొందరు వ్యక్తులు సుప్రీం తీర్పుతో ఆవేదనకు గురై ఉండొచ్చు. వారి ఆవేదనలో అర్థముండొచ్చు కూడా..! కానీ వారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు మాత్రం... భారతీయ ముస్లిం సమాజం కోరుకుంటున్న, సహకరిస్తున్న సుహృద్భావ వాతావరణానికి భిన్నంగా కనిపిస్తోంది.

సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్నట్టుగా.. తమకు ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలం ఇవ్వాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని.. తాము ఆ స్థలాన్ని సొంతంగా సమకూర్చుకోగలం అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఐదెకరాల స్థలాన్ని కొనుక్కోగల శక్తి తమకున్నదని వారు అంటున్నారు.

సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు మాత్రం.. సుప్రీం తీర్పును ఆహ్వానిస్తోంది. దీనిని సవాలు చేసే ఉద్దేశం కూడా లేదని అంటోంది. ప్రభుత్వం ఇచ్చే స్థలం తీసుకోవాలా? వద్దా? అనేది 26న జరిగే సమావేశంలో నిర్ణయిస్తాం అని వారు పేర్కొంటున్నారు. నెగటివ్ ఫీలింగ్ ఏర్పడకుండా భూమిని తీసుకోవడమే మంచిదనే అభిప్రాయాలు కొందరిలో ఉన్నాయి.

అయితే సహజంగానే తీర్పుతో విభేదిస్తున్న కొందరు భూమి తీసుకోవడం అవమానంగా భావిస్తున్నారు. మేం మసీదుకోసం కొనుక్కోగలం అంటున్నారు.

ఇక్కడ ప్రశ్న ముస్లింలు కొనుక్కోగలరా? లేదా? అనేది కాదు. తతిమ్మా భారతీయ సమాజం వారిని ఎంత గౌరవంగా, ప్రేమాస్పదంగా చూస్తున్నది అన్నది మాత్రమే. సుప్రీం తీర్పు ద్వారా ప్రభుత్వం నుంచి స్థలం తీసుకోవడం అనేది.. న్యాయవ్యవస్థ పట్ల, భారతీయ ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల స్నేహభావాన్ని మాత్రమే చాటి చెబుతుంది.

ఎన్నాళ్లుగానో వివాదంగా ఉన్న విషయంలో ఇప్పుడు వెలువడిన తీర్పు రేకెత్తించే క్షణికమైన  భావోద్వేగాల్లో కొందరు ఇలా మాట్లాడవచ్చు గానీ.. దేశ సౌహార్ద్ర భావనల దృష్టికోణంలో ఆలోచిస్తే యావత్ సమాజానికి మంచి జరుగుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?