Advertisement

Advertisement


Home > Politics - Gossip

కమలసారథ్యానికి కాపులకు నో!

కమలసారథ్యానికి కాపులకు నో!

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతలు స్వీకరించే ముహూర్తం దగ్గరపడింది. ఆయన జాతీయ అధ్యక్ష కుర్చీ ఎక్కేలోగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులను నియమించేయడానికి రంగం సిద్ధం అవుతోంది. అయితే.. ఏపీ రాజకీయాలకు సంబంధించినంత వరకు మరోమారు అధ్యక్ష స్థానం కాపు వర్గానికి దక్కే అవకాశం మాత్రం లేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంటున్న నేపథ్యంలో... తమ పార్టీలో కూడా పెద్దపీట కాపులకే వేస్తే... తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

గత ఎన్నికల సమయానికి రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు రెండు ప్రధాన కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నవిగా ముద్ర పడడం వలన.. భాజపా మూడో అతిపెద్ద కులాన్ని ఎంచుకుంది. కాపులకు సారథ్యం కట్టబెట్టాలని ప్రయత్నించారు. ఆ ఎడ్వాంటేజీ కలిసివచ్చి కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు కూడా మళ్లీ మరోమారు అధ్యక్ష పీఠం దక్కించుకోడానికి ఆయన ప్రయత్నాల్లో ఉన్నారు. భాజపాలో ఒకే వ్యక్తికి రెండు పర్యాయాలు వరుసగా అధ్యక్షస్థానం కట్టబెట్టడం కొత్త సంగతి కాదు. రివాజు కూడా. పలు సందర్భాల్లో అలా జరిగింది. అయితే ఈసారి కన్నాకు పదవి దక్కకపోవచ్చునని సమాచారం.

అనేక యితర కారణాలు కూడా జతకలిసి ఉండొచ్చు గానీ.. ఆయన సారథ్యంలో పార్టీ పెద్దగా సాధించిందేమీ లేదు. సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఒకశాతం ఓట్లు కూడా పార్టీకి రాలేదు. ఇలాంటి సమయంలో ఆయనపై నాయకత్వంలో పెద్దగా మొగ్గులేదు. పైగా పవన్ తో జట్టు కడుతున్న సమయంలో.. తమ పార్టీలోనూ కాపులకే ప్రాధాన్యం ఇస్తే.. కుల పార్టీగా ముద్ర పడుతుందనే భయం ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా పవన్ కల్యాణ్ జనసేనను విలీనం చేసేస్తారని కూడా ఆశిస్తున్న తరుణంలో.. ఇలాంటి నిర్ణయానికి భాజపా అధినాయకత్వం మొగ్గడం లేదు.

ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో భాజపా రాష్ట్ర సారథ్యాన్ని కన్నా లక్ష్మీనారాయణ, మాణిక్యాల రావు, సోము వీర్రాజు లాంటి వారు ఆశిస్తున్నా వారి కలలు నిజం కాకపోవచ్చు. ఇంకా పదవిని ఆశిస్తున్న వారు ఇతర సామాజిక వర్గాల నుంచి అనేకులు ఉన్నారు. వారినే పదవి వరిస్తుందనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతుంది. మరి నడ్డా వ్యూహాల్లో ఎలాంటి చమక్కులు ఉంటాయో వేచిచూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?